ETV Bharat / state

TSPSC పేపర్ లీకేజీ కేసు.. ఆ ఏడుగురికి సిట్ నోటీసులు..!

author img

By

Published : Mar 31, 2023, 5:43 PM IST

Updated : Mar 31, 2023, 6:42 PM IST

TSPSC Paper Leakage Case Updates : ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టీఎస్‌పీఎస్సీ సభ్యులను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఏడుగురు సభ్యులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షల్లో సభ్యుల సలహాలు, సూచనలు ఏ విధంగా ఉంటాయి.. ప్రశ్నాపత్రాలు, వాటిని భద్రపరిచేందుకు కమిషన్ తీసుకునే చర్యలు తదితర వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఛైర్మన్, కార్యదర్శి నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరించారు.

TSPSC Paper Leakage Case Updates
TSPSC Paper Leakage Case Updates

TSPSC Paper Leakage Case Updates : రాష్ట్రంలో సంచలనంగా మారిన ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టీఎస్‌పీఎస్సీ సభ్యులను ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. కమిషన్‌లో సభ్యుల పాత్ర, పరీక్షల నిర్వహణలో వాళ్ల నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనే వివరాలు తెలుసుకునేందుకు సిట్ బృందం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఒక్కొక్కరిని ప్రశ్నించాలనే యోచనలో అధికారులు ఉన్నారు.

ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి నుంచి సిట్ అధికారులు పలు వివరాలు సేకరించారు. వివిధ ఉద్యోగ నియామక పరీక్షలను ఏ విధంగా నిర్వహిస్తారు, ప్రశ్నాపత్రాలు ఎవరు రూపొందిస్తారు.. వాటిని ఎక్కడ భద్రపరుస్తారు.. ఎవరెవరి ఆధీనంలో ప్రశ్నాపత్రాలుంటాయనే వివరాలను ఛైర్మన్, కార్యదర్శి నుంచి తెలుసుకున్నారు. వాటిని సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ పరిపాలనా విభాగం సహాయ కార్యదర్శి సత్య నారాయణతో పాటు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర లక్ష్మిని ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సాక్ష్యులుగా చేర్చారు. ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించేందుకు అవసరమైతే సభ్యులను ప్రశ్నించేందుకు సిట్ నిర్ణయించింది. ఈ మేరకు వాళ్లకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి రమేశ్‌ను గత వారం సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షమీమ్, సురేశ్‌లతో పాటు రమేశ్‌ను అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్సీలో రమేశ్ పొరుగు సేవల సిబ్బందిగా పని చేస్తున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. టీఎస్‌పీఎస్సీ సభ్యుడి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా రమేశ్ పని చేస్తున్నట్లు తేలింది. ఇతర సభ్యుల వద్ద పని చేసే వ్యక్తిగత సహాయకుల వివరాలను సైతం సిట్ అధికారులు సేకరించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టీఎస్‌పీఎస్సీకి చెందిన నలుగురు ఉద్యోగులను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. కమిషన్‌లో పని చేసే 20 మంది గ్రూప్-1 ప్రిలిమ్స్ రాస్తే.. అందులో 8 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. షమీమ్, రమేశ్, సురేశ్‌లకు 100కు పైగా మార్కులు వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా.. నిందితుల మూడో రోజు విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ పెన్​డ్రైవ్​లో 15 ప్రశ్నాపత్రాలున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఇవీ చూడండి..

TSPSC పేపర్ లీకేజీలో మరో ట్విస్ట్.. నిందితుల పెన్​డ్రైవ్​లో 15 ప్రశ్నపత్రాలు

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం.. ప్రశ్నపత్రాల కోసం పొలాలు, నగలు తాకట్టు

TSPSC పేపర్‌ లీకేజీ కేసు.. రంగంలోకి ఈడీ.. అందుకోసమేనా.?

Last Updated : Mar 31, 2023, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.