TSPSC లీకేజీ వ్యవహారం.. AE పేపర్ ఒక్కటే కాదు.. అవి కూడా లీక్?

author img

By

Published : Mar 14, 2023, 7:11 AM IST

TSPSC

TSPSC Exam Paper Leak Latest Updates:టీఎస్​పీఎస్సీ పరీక్షా పత్రాల లీక్‌లో విస్మయకర వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు టౌన్​ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్ పరీక్ష పత్రాలు లీక్‌ అయ్యాయని అనుమానిస్తుండగా.. ఈ నెల 5 జరిగిన ఏఈ ప్రశ్నపత్రాలు లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులు కంప్యూటర్‌ నుంచి కాపీ చేసిన ఫోల్డర్‌లో భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో అత్యవసరంగా సమావేశం కానున్న టీఎస్​పీఎస్సీ అధికారులు ఏఈ పరీక్ష రద్దుపై నిర్ణయం తీసుకోనుంది.

TSPSC పేపర్​ లీకేజీ వ్యవహారం.. ఏఈ ఒక్కటే కాదు! మరికొన్ని కూడా లీక్?

TSPSC Exam Paper Leak Latest Updates: టీఎస్​పీఎస్సీ పరీక్ష పత్రాల లీక్‌ డొంక కదులుతోంది. పోలీసుల దర్యాప్తులో ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 5న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74,000 మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55,000 మంది హాజరయ్యారు. తొలుత ఈ నెల 12న నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయని భావించారు.

కానీ, ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైనట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు కంప్యూటర్‌ నుంచి కాపీ చేసిన ఫోల్డర్‌లో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలతో పాటు భవిష్యత్‌లో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకుని.. అందులోని సమాచారం ఆధారంగా పలువురు వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు టీఎస్​పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్, గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు.

రెండు నెలల ముందే సిద్ధం కానున్న పరీక్షల ప్రశ్నాపత్రం: రెండు నెలల ముందుగానే నియామక పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రంను సిద్ధంచేస్తారు. ప్రశ్నపత్రాలన్నింటినీ సాఫ్ట్‌కాపీ రూపంలో భద్రపరుస్తారు. ప్రశ్నల పక్కనే వాటి జవాబులుంటాయి. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ప్రశ్నపత్రాన్ని తస్కరించే క్రమంలో.. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోని ప్రశ్నపత్రాల ఫోల్డర్‌ను నిందితులు డౌన్‌లోడ్‌ చేశారు. ఇందులో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు భవిష్యత్‌లో జరగాల్సిన పరీక్షలకు సంబంధించినవీ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో కాపీ చేసి భద్రపరిచిన ల్యాప్‌టాప్‌, హార్డ్‌డిస్క్​లను, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ నివేదిక వస్తే మరిన్ని విషయాలు బయటకి: ఈ క్రమంలోనే గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలూ లీక్‌ అయ్యాయా? అన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ఫిబ్రవరి 25 లేదా 28న ఫోల్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. నిందితుల కంప్యూటర్లు, హార్డ్​డిస్క్‌లను ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీకి పోలీసులు పంపించారు. ఆ నివేదిక వస్తే మరిన్ని విషయాలు బయటపడనున్నాయి. ఏరోజు ఫోల్డర్‌ను.. ఎప్పుడు డౌన్‌లోడ్‌ చేశారన్న ఆధారాలు లభిస్తే మరింత స్పష్టత రానుంది.

భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు: డౌన్‌లోడ్‌ చేసిన ఫోల్డర్‌లో.. భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఉన్నట్లు బయటపడటంతో.. వాటి స్థానంలో కొత్త ప్రశ్నాపత్రాలను కమిషన్‌ సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు కొంత సమయం తీసుకునే అవకాశాలున్నాయి. టీఎస్​పీఎస్సీ కార్యాలయంలోని కంప్యూటర్ల నెట్‌వర్క్‌ బలహీనంగా ఉందని పోలీసు దర్యాప్తులో తేలిందని తెలిసింది. ప్రత్యేక సర్వర్‌, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో కంప్యూటర్లను నిందితులు తేలికగా హ్యాక్‌ చేసినట్లు తేలింది .

ఏఈ పరీక్షను రద్దు చేయాలా? లేదా: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు నిందితుడు ప్రవీణ్‌ను సస్పెండ్ చేసి శాఖపరమైన విచారణ ప్రారంభించినట్లు టీఎస్​పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ తెలిపారు. మరో నిందితుడు.. పొరుగు సేవల ఉద్యోగి రాజశేఖర్​రెడ్డిని వెంటనే విధుల్లోంచి తొలగించాలని నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు జరిగిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు బయటపడటంతో టీఎస్​పీఎస్సీ.. ఇవాళ అత్యవసరంగా సమావేశం కానుంది. పరీక్షను రద్దు చేయాలా? లేదా.. ఇద్దరికే లీకైన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సాధ్యాసాధ్యాలను, న్యాయనిపుణుల సలహాలు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు కమిషన్‌ వర్గాలు తెలిపాయి.

టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలనూ రద్దు చేసినట్లు స్పష్టంచేశాయి. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో చేపడుతున్న నియామక సంస్థలు, టీఎస్​పీఎస్సీ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి తీసుకుంటున్న చర్యలతో పాటు భవిష్యత్‌లో లీకేజీలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

ఇవీ చదవండి: TSPSC ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో ట్విస్ట్... అసలు కథ ఇదేనట!

స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లు.. తుది వాదనలు ఆరోజే : సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.