ETV Bharat / state

భూపరిపాలన బలోపేతం.. ప్రధాన కమిషనర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌?

author img

By

Published : Sep 9, 2020, 7:50 AM IST

government
భూపరిపాలన బలోపేతం.. ప్రధాన కమిషనర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌?

భూ పరిపాలన సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం ఆ శాఖను పటిష్ఠం చేయడంపైనా దృష్టి సారిస్తోంది. మూడున్నరేళ్లుగా ఇన్‌ఛార్జీతో కొనసాగుతున్న భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) పోస్టులో సీనియర్‌ ఐఏఎస్‌ను నియమించాలని నిర్ణయించింది.

రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్‌కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సీసీఎల్‌ఏగా ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెవెన్యూ శాఖను బలోపేతం చేయడంపై దృష్టిసారించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవసరమైన ఉన్నతాధికారుల పోస్టులు భర్తీ చేయాలని సీఎస్‌కు సూచించినట్లు తెలిసింది. వాస్తవానికి భూ దస్త్రాల ప్రక్షాళన అనంతరం జిల్లాల్లో తలెత్తుతున్న సమస్యలకు క్లారిఫికేషన్‌ ఇవ్వాల్సిన సీసీఎల్‌ఏ లేకపోవడంతో జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర స్థాయి భూ పరిపాలన విభాగానికి మధ్య అంతరం ఏర్పడింది. దీనిని రెవెన్యూ సంఘాలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి.

క్షేత్రస్థాయిలో మౌలిక వసతులు

తహసీల్దార్లకు భూముల రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగిస్తున్నందున మండల కార్యాలయాలు రద్దీగా మారనున్నాయి. ప్రతి రిజిస్ట్రేషన్‌కు ఇరువర్గాల వారు, ఆరుగురు సాక్షులు హాజరవుతుంటారు. స్టాంపుల విక్రయం, వాటి నిల్వలకు స్ట్రాంగ్‌రూంలు అవసరం. వీటన్నింటిపైనా ప్రభుత్వం దృష్టిసారించనుంది. ఇటీవల తాము సీఎంతో చర్చించినపుడు తహసీల్దార్లు, సిబ్బందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చారని రెవెన్యూ సంఘం ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దారు కార్యాలయాలన్నింటికీ ఒకే రంగు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించినా అది పూర్తి కాలేదు. ఇప్పుడు పూర్తికావచ్చని సిబ్బంది చెబుతున్నారు.

సీసీఎల్‌ఏను నియమించకుంటే ఇబ్బందే

కొత్త చట్టాన్ని మేం స్వాగతిస్తున్నాం. చట్టం ఎంత పకడ్బందీగా చేసినా భూ పరిపాలన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) లేకపోతే ఇబ్బందులు తప్పవు. క్షేత్రస్థాయిలో దస్త్రాల్లో తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపేది సీసీఎల్‌ఏనే. ఈ కార్యాలయంలో ముగ్గురు డిప్యూటీ కమిషనర్లను కూడా నియమించాలి. రెవెన్యూ శాఖలో చాలా ఖాళీలు ఉన్నాయి. వీఆర్‌ఓలకు జూనియర్‌ అసిస్టెంటు పోస్టులు ఇస్తామని అంటున్నారు. వారికి రెవెన్యూలోనే పోస్టులు కల్పించాలి. అవసరమైతే సూపర్‌ న్యూమరీ పోస్టులు రూపొందించొచ్చు. కొత్త చట్టం, విధులతో సిబ్బందిపై పనిభారం పెరిగే అవకాశాలు ఉన్నందున అదనపు సిబ్బంది అవసరం ఉంటుంది.

- వంగ రవీందర్‌రెడ్డి, అధ్యక్షుడు, రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.