ETV Bharat / state

తెరాస ఆపరేషన్‌ ఆకర్ష్‌ వేగవంతం.. ప్రత్యర్థి పార్టీల్లో గుబులు

author img

By

Published : Oct 22, 2022, 10:52 AM IST

Trs Operation Akarsh
Trs Operation Akarsh

Trs Operation Akarsh: మునుగోడు ఉపఎన్నిక వేడికొనసాగుతుండగానే గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరం చేసింది. గతంలో పార్టీనుంచి బయటకు వెళ్లిన వారిని ఘర్‌వాపసీ అంటూ ఆహ్వానిస్తోంది. మునుగోడులోని వార్డు సభ్యులనుంచి రాష్ట్రస్థాయి నేతల వరకూ పార్టీలో చేర్చుకుంటూ ప్రత్యర్థుల్లో గుబులు రేకెత్తిస్తోంది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భాజపాలో చేరడంతో ఇతర పార్టీల్లోని బీసీ నేతలపై తెరాస ప్రత్యేక దృష్టి సారించింది. ఒకరు పోతే నలుగురు వస్తారనే సంకేతాలిచ్చేలా వ్యవహరిస్తున్న తెరాస త్వరలో మరికొందరు రాబోతున్నారని చెబుతోంది.

తెరాస ఆపరేషన్‌ ఆకర్ష్‌ వేగవంతం.. ప్రత్యర్థి పార్టీల్లో గుబులు

Trs Operation Akarsh: అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్ని సెమీ ఫైనల్‌గా భావిస్తుడటంతో సత్తా చాటేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డు స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆయారాం గయారాంలతో.. రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మునుగోడు పోలింగ్ సమయందగ్గర పడుతుండటంతో గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరంచేసింది. ఘర్‌వాపసీ అంటూ గతంలో పార్టీని వీడిన నేతల్నిఆహ్వానించి కండువా కప్పేస్తోంది.

తనదైన వ్యూహాల అమలు: భారాసగా మారుతున్న తెరాస జాతీయ రాజకీయాలు, మునుగోడు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తనదైన వ్యూహాలను అమలు చేస్తోంది. కాంగ్రెస్‌లో చేరిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో ఆపరేషన్ మొదలుపెట్టింది. ఓదెలు దంపతులను పార్టీలోకి ఆహ్వానించి సీఎం కేసీఆర్ గులాబీ కండువాకప్పారు. చేరికలపై ఆచితూచి వ్యవహరించిన గులాబీ పార్టీ.. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ భాజపాలో చేరడంతో వేగం పెంచింది.

ఆ వర్గం వారంతా తమవైపే: తెరాసలో బీసీలకు అవమానం జరుగుతోందన్న బూర నర్సయ్య వ్యాఖ్యలను తిప్పికొట్టేలా ముందుకెళ్తోంది. బీసీ నాయకులపై తొలుత దృష్టిపెట్టిన తెరాస ఆ వర్గం వారంతా తమవైపే ఉన్నారనే సంకేతమిచ్చేలా చర్యలు చేపట్టింది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించిన పల్లె రవికుమార్‌గౌడ్ దంపతుల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఒకరుపోతే నలుగురువస్తారనే సంకేతం ఇచ్చేలా దూకుడు పెంచింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ భాజపాకు రాజీనామా చేసి తెరాసలో చేరారు.

మరికొందరు నేతల పేర్లు ప్రచారం: శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, భాజపాలో ఉన్న దాసోజు శ్రవణ్‌కి ఒకేరోజు ఒకేవేదికపై గులాబీ కండువా కప్పేశారు. వారిద్దరు ఉద్యమ సమయంలో తెరాసలో కీలక పాత్ర పోషించిన నాయకులే. తెరాసలో బీసీలు, గతంలో బయటకు వెళ్లిన నేతల చేరికలు ఊపందుకోవడంతో మరికొందరు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. జితేందర్‌రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, తులఉమ, కూన శ్రీశైలం గౌడ్ తదితరుల భాజపా నాయకులు తెరాసలో చేరతారని సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వచ్చాయి.

ఏ పూట ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి: అయితే ఆ నాయకులంతా వాటిని ఖండించి తెరాసలో చేరట్లేదని స్పష్టంచేశారు. రాష్ట్రస్థాయిలో మరికొందరు నేతలు గులాబీ చెంతకు చేరబోతున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌పై ప్రత్యేక కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో నాయకులు ఏ పూట ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

ఇటీవల భాజపా, కాంగ్రెస్‌లో చేరిన పలువురు మండల, గ్రామ స్థాయి నాయకులను మంత్రి జగదీశ్‌రెడ్డి మళ్లీ పార్టీలోకి చేర్చుకున్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలతో పాటు రానున్న.. అసెంబ్లీ, పార్లమెంట్‌, శాసనమండలి ఎన్నికల్లో పదవులు, టికెట్లు కేటాయిస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: తెరాస అపరేషన్‌ ఆకర్ష్‌.. కమల దళంలో కలవరం

మళ్లీ తెరాస గూటికి దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్

'అగ్ని-ప్రైమ్‌' క్షిపణి ప్రయోగం సక్సెస్​.. 2వేల కి.మీ దూరంలోని లక్ష్యాలు ఉఫ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.