ETV Bharat / state

వర్షం పడితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు బంద్‌.. వారి సమస్యలు తీరేదెన్నడో..!

author img

By

Published : Jul 12, 2022, 11:56 AM IST

వర్షం పడితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు బంద్‌
వర్షం పడితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు బంద్‌

సుదూరాల్లో.. సౌకర్యాలకు దూరంగా.. అడవి తల్లినే నమ్ముకొని.. పొట్టనిండితే చాలనుకొని జీవించే గిరిజనులు వర్షాకాలంలో అత్యవసరాలైన వైద్య సేవలు సహా ఏ పనికీ ఎటూ కదల్లేక అవస్థలు పడాల్సిన దుస్థితి కొనసాగుతూనే ఉంది. గిరిజన ప్రాంతాల్లోని వేల తండాలు, గూడేలు, ప్రధాన గ్రామాలకు ఏళ్లు గడుస్తున్నా రహదారులు నిర్మించకపోవడంతో.. చినుకు పడితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. వాగుల్లో నీటి ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచిపోతున్నాయి.

ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వాగుల ప్రవాహాల కారణంగా వందలాది గ్రామాలు ఏటా అవస్థలు పడుతున్నాయి. మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా ఈ గ్రామాల్లోని గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఏక్షణంలో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందో.. ఎలా చేరుకోవాలో అనేదే వారి ఆందోళన. సకాలంలో వైద్యం అందక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో ఇటీవల నాలుగు నెలల బాబు మృతి చెందిన విషయం తెలిసిందే.

.

ఎక్కడెక్కడ..

*ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో లవ్వాల, బంధాల గ్రామాలకు రోడ్డు లేదు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపురం రోడ్డు మార్గం ఏళ్లతరబడి పూర్తికావడం లేదు. ఈ జిల్లాలో రంగాపురం నుంచి భద్రాద్రి జిల్లా సాయనపల్లి వరకు 2019లో 28 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.28 కోట్లు మంజూరవ్వగా కొంతమేర పూర్తయింది. ఇంతలో అటవీశాఖ అనుమతులు లేవని నిలిపివేశారు. వెంకటాపురం-దామరతోగు మధ్య కూడా ఇదే పరిస్థితి.

* భద్రాద్రి జిల్లా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని నదిపై వంతెనలు ఏళ్లతరబడి పూర్తికావడం లేదు. గుండాల నుంచి ములుగు జిల్లా పస్రా మార్గంలో 5 కిలోమీటర్ల మట్టి రోడ్డు నిర్మాణం కూడా ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో వాగులపై వంతెనలు చేపట్టాల్సి ఉంది. టేకులపల్లి- మర్రిగూడ మార్గంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.

* ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని పది మండలాల్లో 40కి పైగా గ్రామాలకు రోడ్లు లేవు. చాలా చోట్ల వంతెనలు నిర్మించాల్సి ఉంది.

* నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలో పది చెంచెగూడేలకు కనీస రహదారి లేదు.

* మహబూబాబాద్‌ జిల్లాలో పాకాల, గంగారం, గూడూరు మండలాల్లో కనీస రహదారులు లేని గ్రామాలు ఉన్నాయి.

5,300 కి.మీ. రహదారి నిర్మాణానికి ప్రణాళికలున్నా..

గిరిజన ప్రాంతాలన్నింటికీ నాలుగేళ్లలో బీటీ రహదారి నిర్మిస్తామని, ఏటా రూ.400 కోట్లు ఖర్చు చేస్తామని 2015లో ప్రభుత్వం చెప్పినా ఆచరణలో సాధ్యం కాలేదు. గిరిజన ఆవాసాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గిరిజన సంక్షేమశాఖలో ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగం, అధికారులున్నప్పటికీ.. నిధుల్లేక అడుగులు ముందుకు పడడంలేదు. 3 వేల గిరిజన గూడేల పరిధిలో 5,300 కి.మీ. మేర రోడ్డు మార్గం నిర్మాణానికి ఏళ్ల క్రితమే ప్రణాళిక రూపొందించారు. ఇందుకు రూ.1722.36 కోట్లు అవసరమని అంచనా వేశారు. రాష్ట్రంలోని మరో 496 ఆదిమ గిరిజన గూడేల్లో కనీస మౌలిక సదుపాయాలకు రూ.107.28 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిధులు మంజూరుకాక ఏ పనులూ ప్రారంభం కాలేదు.

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెం వాగు ఇది. వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తపల్లి, పొగుళ్లపల్లి, సాదిరెడ్డిపల్లి తదితర గ్రామాల వారు వాగు దాటితేనే బయటకు రాగలరు. ఈ ప్రాంతాల్లో 137 మంది గర్భిణులు ఉన్నారు.వీరంతా ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందో.. ఎలా వెళ్లాలోనని ఆందోళన చెందుతున్నారు.

ములుగు జిల్లా కన్నాయిగూడెం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐలాపురం గిరిజన గ్రామానికి వెళ్లే దారి ఇది. అయిదేళ్ల క్రితం రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరవగా 10 శాతం పనులే జరిగాయి. అటవీశాఖ అనుమతులు లేవని నిలిపివేశారు. ఏటా వానాకాలంలో ఇక్కడ నివసించే 530 మంది జనాభాకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. అటవీమార్గంలో మూడు వాగుల ప్రవాహం ప్రమాదకరంగా మారుతోంది.

ఇవీ చూడండి..

రెడ్ అలర్ట్​.. ఆ జిల్లాల్లో ఇవాళ, రేపు అత్యంత భారీ వర్షాలు

రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ.. లక్కీగా గార్డు స్పందించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.