గ్రీన్​ ఛానల్​ సక్సెస్​.. 14 నిమిషాల్లో గుండె తరలింపు

author img

By

Published : May 11, 2022, 6:00 PM IST

green channel in hyderabad

Heart Transportation by Green Channel: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను.. మలక్​పేట్​ యశోద ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు. దాదాపు 14 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 14 నిమిషాల్లోనే అధిగమించి అవయవాలను చేర్చారు.

Heart Transportation by Green Channel: ప్రజారోగ్యం, ప్రజల పట్ల హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసుల నిబద్ధత మరోసారి రుజువైంది. ట్రాఫిక్​ను నియంత్రించడంలోనే కాదు.. ప్రజల ప్రాణాలను కాపాడటంలోనూ వారి సేవలు ఎనలేనివి. గుండె సంబంధిత వ్యాధితో కొట్టుమిట్టాడుతున్న ఓ రోగికి.. హృదయ మార్పిడిలో తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి శభాష్​ అనిపించుకున్నారు. 24 గంటలూ వాహనాలతో రద్దీగా ఉండే హైదరాబాద్​ రోడ్లపై గ్రీన్​ ఛానల్​ ఏర్పాటు చేశారు. దాదాపు 14 కి.మీల దూరాన్ని కేవలం 14 నిమిషాల్లో అధిగమించారు. విజయవంతంగా అంబులెన్స్​లో గుండెను రవాణా చేశారు.

నగరంలోని మలక్‌పేట యశోదా ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి ఈ ఉదయం గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు జీవన్ దాన్ సంస్థ వెల్లడించింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌కి చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్‌కు బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. 32 ఏళ్ల విజయ్ నల్గొండ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేసేవారు. ఈ నెల 6 న రోడ్డు ప్రమాదానికి గురైన అతనికి మంగళవారం బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు తెలిపారు. విజయకుమార్‌ గుండెను అపోలోలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చనున్నారు.

ఈ మేరకు యశోదా ఆస్పత్రి నుంచి ఉదయం 10.27 నుంచి బయలుదేరిన అంబులెన్స్​.. గ్రీన్​ ఛానల్​ ద్వారా 10.41 కి జూబ్లీహిల్స్​ అపోలో ఆస్పత్రికి చేరింది. మలక్​పేట్, జూబ్లీహిల్స్​ మధ్య దూరం 13.46 కి.మీ ఉండగా.. కేవలం 14 నిమిషాల్లోనే గుండెను ఆస్పత్రికి చేర్చారు. కాగా ఈ ఐదు నెలల్లో గ్రీన్​ ఛానల్​ ద్వారా అవయవాలను తరలించడం ఇది పదిహేడో సారి. ట్రాఫిక్​ పోలీసులు చేస్తున్న సేవకు పలువురు అభినందనలు తెలిపారు.

ఇవీ చదవండి: రాష్ట్రంలో విస్తారంగా పెంచిన ఆ మొక్కలపై నిషేధం.. అవి అంత డేంజరా..?

బాలీవుడ్​పై నేనలా అనలేదే.. మీకలా అర్థమైందా: మహేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.