ETV Bharat / state

ts politics: లక్షమందితో దళిత, గిరిజన దండోరా: రేవంత్‌రెడ్డి

author img

By

Published : Jul 25, 2021, 8:27 PM IST

Updated : Jul 25, 2021, 8:38 PM IST

ఆగస్టు 9నుంచి సెప్టెంబర్ 17వరకు.. దళిత, గిరిజన దండోరా మోగిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉప ఎన్నికలొచ్చినప్పుడే... కేసీఆర్‌కు పథకాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. ఒక్క హుజూరాబాద్‌లోనే దళితబంధు ప్రకటిస్తే ఊరుకోబోమని, రాష్ట్రంలోని కోటి 35లక్షల మంది.. దళిత, గిరిజనులకు కూడా ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు.

tpcc-president-revanth-reddy-announced-dalith-girijana-dandora-from-august-ninth
ts politics: లక్షమందితో దళిత, గిరిజన దండోరా: రేవంత్‌రెడ్డి

ఆగస్టు 9న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి గడ్డపై లక్ష మందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ సాగర్‌రావును సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో... రేవంత్‌ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం చిరాన్ ఫోర్ట్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖతోపాటు మహిళా కాంగ్రెస్ నేతలు రేవంత్​కు ఘన స్వాగతం పలికారు.

దివాళా తీశారు

తనకు, ప్రేమ్‌సాగర్‌రావుకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని రేవంత్​ స్పష్టం చేశారు. ప్రేమ్‌సాగర్ రావు సోదర సమానులన్న ఆయన.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కదం తొక్కనున్నట్లు ప్రకటించారు. బంధుత్వానికి, రాగద్వేషాలకు అతీతంగా తాను పనిచేస్తానన్న రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్ జెండా దించకుండా మోసిన వారే తన బంధువులని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదన్న ఆయన.. ఏపీలో పార్టీని చంపుకొని ఇచ్చారని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ చేతిలో పెడితే దానిని దివాళా తెలంగాణగా మార్చారని ఆరోపించారు.

ఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్‌కు పథకాలు గుర్తొస్తాయి. ఎక్కడ ఉప ఎన్నికలుంటే అక్కడే పథకాలు తెస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితుల పరిస్థితి ఏంటి.? కోటి ముప్పై ఐదు లక్షల మంది దళిత, గిరిజనులకు కూడా దళిత బంధు ఇవ్వాలి. దళితులను మోసం చేసి ఓట్లు డబ్బాల్లో వేసుకుంటాం అంటే చూస్తూ ఊరుకోం. -రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

వారి పరిస్థితేంటి.?

ఉప ఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్‌కు పథకాలు గుర్తొస్తాయని, ఎక్కడ ఉప ఎన్నికలుంటే అక్కడే పథకాలు తెస్తారని రేవంత్​ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కోటి ముప్పై ఐదు లక్షల మంది దళిత, గిరిజనులకు కూడా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళితులను మోసం చేసి ఓట్లు డబ్బాల్లో వేసుకుంటాం అంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారని.. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

బాధిత కుటుంబాలను పరామర్శ

అనంతరం హైదరాబాద్​- శ్రీశైలం రహదారిపై ప్రమాదంలో మృతి చెందిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లకు చెందిన ముప్పిడి వంశీ కృష్ణ, నిజాంపేటకు చెందిన వెంకటేష్ కుటుంబాలను రేవంత్​ పరామర్శించారు. ఇరువురి కుటుంబాలకు పార్టీ తరపున చెరో రూ.1.25లక్షలు అందజేశారు. మృతుల కుటుంబాల గురించి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి డబల్ బెడ్​రూమ్ ఇల్లు, రూ. పది లక్షల చొప్పున అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత జాయింట్ కలెక్టర్, స్థానిక ఎమ్మార్వోలతో మాట్లాడి వారికి అందాల్సిన సాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. అంతకు ముందు జీడిమెట్లలోని ముప్పిడి వంశీ కృష్ణ కుటుంబాన్ని ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు.

ఇదీ చదవండి: uttam kumar reddy: 'హుజూరాబాద్​ ఎన్నికల కోసమే దళితబంధు'

Last Updated : Jul 25, 2021, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.