ETV Bharat / state

TSPSC: ఏఈ క్వశ్చన్ పేపర్ ఇంకెంత మందికి విక్రయించారు..?

author img

By

Published : Mar 28, 2023, 12:58 PM IST

TSPSC: ఏఈ క్వశ్చన్ పేపర్ ఇంకెంత మందికి విక్రయించారు..?
TSPSC: ఏఈ క్వశ్చన్ పేపర్ ఇంకెంత మందికి విక్రయించారు..?

TSPSC Paper Leakage Updates : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు నిందితులను రెండోసారి 3 రోజుల కస్టడీకి తీసుకున్న అధికారులు.. నేడు చివరి రోజు కావడంతో వీలైనంత మేర సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

TSPSC Paper Leakage Updates : టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. నలుగురు నిందితులను సిట్ అధికారులు రెండోసారి మూడో రోజు ప్రశ్నిస్తున్నారు. నేటితో కస్టడీ ముగియనుండటంతో నిందితుల నుంచి వీలైనంత మేర సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్, రాజేశ్వర్​లను పోలీసులు సీసీఎస్ నుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం వరకు ప్రశ్నించి.. ఆ తర్వాత కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

టీఎస్​పీఎస్సీలో పని చేస్తున్న ఏఎస్​వో ప్రవీణ్ ద్వారా ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన రేణుక.. దానిని ఆమె భర్త డాక్యా నాయక్, సోదరుడు రాజేశ్వర్ నాయక్​కు అందించింది. డాక్యా, రాజేశ్వర్ నాయక్​లు కలిసి ఈ పేపర్​ను చాలా మందికి విక్రయించేందుకు ప్రయత్నించారు. రేణుకకు తెలియకుండా పలువురితో బేరసారాలు కొనసాగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఉపాధి హామీలో పని చేస్తున్న డాక్యా.. తన విభాగంలో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో పని చేసే టెక్నికల్ అసిస్టెంట్లతో బేరం కుదుర్చుకున్నట్లు తేలింది. డాక్యా ఇచ్చిన సమాచారం ఆధారంగా రాజేందర్, తిరుపతయ్యతో పాటు ప్రశాంత్​లను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

TSPSC Paper Leakage Latest Updates: ఈ నలుగురు నిందితులను రెండోసారి మూడు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు.. విచారణలో భాగంగా తొలి రెండు రోజుల్లో కీలక సమాచారం సేకరించారు. నిందితులంతా ఒకరికి తెలియకుండా మరొకరు.. ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం మూడు పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను విక్రయించినట్లు తెలుసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన పలువురిని సైతం అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రూప్-1 పరీక్షలో 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులను సైతం సిట్ బృందం విచారిస్తోంది. తొలి రెండు రోజుల్లో పలువురిని కార్యాలయానికి పిలిపించిన అధికారులు.. 15 అంశాలతో ప్రశ్నావళిని రూపొందించి.. సమాధానాలు రాబట్టారు. నేడూ పలువురిని విచారించనున్నట్లు సమాచారం.

అవును.. పాస్​వర్డ్ కొట్టేశా..! ఇదిలా ఉండగా.. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రాజశేఖర్​రెడ్డి కాన్ఫిడెన్షియల్ విభాగంలో సూపరింటెండెంట్​గా విధులు నిర్వహిస్తున్న శంకరలక్ష్మి డైరీ నుంచి పాస్​వర్డ్ కొట్టేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లుగా తెలుస్తోంది. పాస్​వర్డ్ కొట్టేసిన రాజశేఖర్​రెడ్డి 2022 అక్టోబర్ నెలలోనే ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రాలను తన పెన్​డ్రైవ్​లోకి కాపీ చేసుకున్నట్లు విచారణలో తెలిపినట్లు సమాచారం.

ఇవీ చూడండి..

TSPSC పేపర్ లీకేజీ.. దర్యాప్తులో కీలక ఆధారం లభ్యం.. ఆమె డైరీ నుంచే పాస్​వర్డ్ చోరీ

మూడు కేటగిరీల వారీగా డేటా చోరీపై లోతుగా ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.