ETV Bharat / state

మూడో దశకు ముందే సిద్ధమవుతోన్న రాష్ట్ర సర్కారు

author img

By

Published : Jun 8, 2021, 4:12 AM IST

కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అంచనాతో కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం చిన్నారులకు ప్రత్యేక చికిత్స అందజేస్తున్న గాంధీ, నిలోఫర్‌, ఎంజీఎం వంటి బోధనాసుపత్రులను మరింత బలోపేతం చేస్తూనే.. జిల్లాల్లో పిల్లల జనాభా ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది.

మూడో దశకు ముందే సిద్ధమవుతోన్న రాష్ట్ర సర్కారు
మూడో దశకు ముందే సిద్ధమవుతోన్న రాష్ట్ర సర్కారు

కొవిడ్‌ మూడోదశ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అంచనాతో కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం చిన్నారులకు ప్రత్యేక చికిత్స అందజేస్తున్న గాంధీ, నిలోఫర్‌, ఎంజీఎం వంటి బోధనాసుపత్రులను మరింత బలోపేతం చేస్తూనే.. జిల్లాల్లో పిల్లల జనాభా ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. మొత్తం 6 వేల కొత్త పడకలను ఏర్పాటు చేయడంతో పాటు.. జిల్లాల్లో పిల్లల సంఖ్య ఆధారంగా ఆసుపత్రులకు పడకలను కేటాయించనున్నారు.

20 ఏళ్లలోపువారు 1.37 కోట్ల మంది
రాష్ట్ర మొత్తం జనాభా 3.5 కోట్లు కాగా.. ఇందులో 20 ఏళ్ల లోపు వయస్కులు 1.37 కోట్ల మంది ఉంటారని ఆరోగ్య శాఖ అంచనా. 15 శాతం మంది 0-10 ఏళ్ల మధ్య వయస్కులు, 17 శాతం మంది 11-20 ఏళ్ల మధ్య వయసువారు ఉంటారు. 20 ఏళ్లలోపు వారు అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 22 లక్షల మంది వరకూ ఉండగా.. అత్యల్పంగా ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో 10 లక్షల మంది చొప్పున ఉన్నట్లుగా రాష్ట్ర గణాంకాల సంస్థ, సెన్సస్‌ -2011 నివేదికలను ఆధారంగా చేసుకొని నిపుణులు అంచనా వేశారు. ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారనే ప్రాతిపదికన కూడా మౌలిక వైద్య సదుపాయాలను కల్పించుకోవచ్చని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికీ ఉపయోగపడుతుందని ఆరోగ్య శాఖ భావిస్తోంది.

.

ఒక్కో బోధనాసుపత్రిలో 200 పడకలు
రాష్ట్రవ్యాప్తంగా 0-20 ఏళ్ల వయసువారిలో ఇప్పటివరకు 14 శాతం మంది కొవిడ్‌ బారినపడ్డారు. రాష్ట్రంలో మొదటి నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌ ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో కలిపి 37 లక్షల మంది 0-20 ఏళ్లలోపు వారున్నారు. ఈ జిల్లాల్లో పిల్లల్లో పాజిటివ్‌లు అధికంగానే నమోదవుతున్నాయని గణాంకాలను బట్టి నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీని ఆధారంగా నిలోఫర్‌, గాంధీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిలోఫర్‌ ఆసుపత్రిని బహుళ వైద్యసేవల వైద్యాలయంగా తీర్చిదిద్దనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 200 పడకలతో పిల్లల వార్డు నెలకొల్పనున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో 100 పడకలతో వార్డులు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కలిపి 2 వేల ఐసీయూ వెంటిలేటర్‌ పడకలు, 4 వేల ఆక్సిజన్‌ పడకలను సిద్ధం చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు, ఔషధాలు, పరికరాల కోసం రూ.150 కోట్ల మేర నిధులు అవసరమవుతాయంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చిన్నపిల్లల వార్డులను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లల వైద్యానికి తగినట్లుగా ఆక్సిజన్‌ పైపులైన్లు, వెంటిలేటర్లను అందుబాటులోకి తెచ్చుకోవాలని సూత్రప్రాయంగా ప్రైవేటు వైద్యవర్గాలకు సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. ప్రైవేటు బోధనాసుపత్రుల సేవలనూ వినియోగించుకోనున్నారు. అన్ని ప్రైవేటు బోధనాసుపత్రుల్లోనూ పిల్లల వార్డులు, సంబంధిత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు కాబట్టి.. వీరందరి సేవలను అవసరాన్ని బట్టి వాడుకోవాలని సర్కారు భావిస్తోంది.

.

తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి

.

మూడో దశ కొవిడ్‌ ఉధ్ధృతి ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉండాలి. పిల్లలకు టీకా అందుబాటులోకి రాగానే.. విస్తృతస్థాయిలో పంపిణీ చేపట్టాలి. పల్స్‌ పోలియోను ఎంత పెద్దఎత్తున నిర్వహిస్తున్నామో.. కొవిడ్‌ టీకాను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి. పిల్లల్లో కొవిడ్‌ ప్రభావంపై ముందుగా తల్లిదండ్రులకు భరోసా, అవగాహన పెంపొందించాలి. రిజిస్ట్రేషన్‌ పొందిన ప్రతి చిన్నపిల్లల వైద్యుడిని, ఆసుపత్రిని భాగస్వాములను చేయాలి. అవసరమైన మేరకు పడకల సంఖ్య పెంచాలి. పిల్లల్లో వినియోగించే కొవిడ్‌ ఔషధాలను సమృద్ధిగా సమకూర్చుకోవాలి. పక్కా ప్రణాళికతో పిల్లల్లో కొవిడ్‌ను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. కరోనా ఉధ్ధృతి తగ్గుముఖం పట్టేవరకూ.. టీకాల లభ్యత పిల్లలకు చేరేవరకూ మరి కొద్దిరోజుల పాటు ఆన్‌లైన్‌ విద్యకే ప్రాధాన్యమివ్వాలి.-డాక్టర్‌ పారుపల్లి ఆంజనేయులు, సీనియర్‌ రీసెర్చీ అసోసియేట్‌, సెస్‌

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,933 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.