గర్భిణీలు ఈనెల 31లోపు డిక్లరేషన్ ఇవ్వాలి: పోలీసు నియామక మండలి

author img

By

Published : Jan 20, 2023, 7:19 PM IST

Updated : Jan 21, 2023, 12:03 PM IST

TSLPRB

TSLPRB on pregnant woman: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు నియామక పరీక్షకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ ఉద్యోగాలకు గర్బిణీలు, బాలింతలు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గర్భిణి, బాలింతలకు పోలీస్‌ నియామక మండలి సౌలభ్యాలు కల్పించింది. గర్భిణీలు ఈనెల 31లోపు డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపింది.

TSLPRB on pregnant woman: గర్భిణులు, బాలింతలు ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి శారీరక సామర్థ్య పరీక్షల్లో పాల్గొనకున్నా.. తుది రాతపరీక్ష అర్హత పొందాలంటే అండర్​ టేకింగ్​ సర్టిఫికేట్​ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి స్పష్టం చేసింది. తుది రాతపరీక్షలో అర్హత సాధిస్తే పరీక్ష ఫలితాలు వెల్లడైన నెల రోజుల్లోపు శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరవుతామని గర్భిణీలు, బాలింతలు లిఖితపూర్వకంగా ధ్రువీకరించాల్సి ఉంటుందని మండలి ఛైర్మన్​ వి.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఆ హామీపత్రాన్ని ధృవీకరించి.. ఈ నెల 31లోగా డీజీపీ కార్యాలయంలోని టీఎస్​ఎల్​పీఆర్​బీ ఇన్ వార్డ్‌ సెక్షన్​లో నేరుగా సమర్పించాలని పోలీస్ నియామక మండలి సూచించింది. తుది ఫలితాల్లో అర్హత సాధించి పోలీస్ ఉద్యోగానికి ఎంపికయ్యే గర్భిణీలు ధృవీకరణ పత్రంతో పాటు.. వైద్యులతో మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాలని తెలిపారు. తుదిఫలితాలు వెల్లడైన తేదీ నుంచి.. నెల రోజుల్లోపు దేహాదారుడ్య పరీక్షల్లో పాల్గొంటామని హామీ పత్రమివ్వాలని తెలిపారు.

దేహదారుడ్య పరీక్షలపై పలువురు గర్భిణిలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు గర్బిణీలకు పోలీసు నియామక మండలి కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రస్తుతం గర్బిణీ, బాలింతగా ఉంటే దేహదారుఢ్య పరీక్షలో అర్హత సాధించడం కష్టంకావడంతో ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారికి నేరుగా.. తుది రాతపరీక్షలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. మిగతా అభ్యర్థులంతా ప్రాథమిక, దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధిస్తేనే తుది రాత పరీక్షలో అవకాశం కల్పించారు.

గతంలో న్యాయస్థానాన్ని వ్యక్తిగతంగా ఆశ్రయించి ఉత్తర్వులు పొందిన అనంతరం వినతిపత్రాలు సమర్పించిన అభ్యర్థులూ అండర్ టేకింగ్ కచ్చితంగా ఇవ్వాలని మండలి సూచించింది. మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ప్రొఫార్మాలోనే ఈ ధ్రువీకరణ ఇవ్వాలని సూచించింది. అర్హత కలిగి ఉన్నప్పటికీ అండర్​ టేకింగ్​ ఇవ్వని వారిని మాత్రం తుదిరాతపరీక్షకు అనుమతించబోమని పోలీసు నియామక మండలి స్పష్టం చేసింది.

తుది పరీక్ష తేదీలు: తెలంగాణ పోలీసు నియామక మండలి తుది పరీక్షల తేదీలను ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పరీక్షల తేదీల్లో టీఎస్​ఎల్​పీఆర్​బీ మార్పులు చేసింది. ఎస్సై(ఐటీ విభాగం) పరీక్షను మార్చి 11 వతేదీన, ఏఎస్సై(ఫింగర్ ప్రింట్స్) పరీక్షను మార్చి 11వ తేదీకి మార్చింది. కానిస్టేబుల్(ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 30వ తేదీన నిర్వహిస్తారు. ఈసారి ఒక్కో విభాగంలో ఒక్కోరకమైన పోటీ ఉన్నది. ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. తుది పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు ప్రిపరేషన్​లో నిమగ్నమై ఉన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 21, 2023, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.