ETV Bharat / state

Piyush Goyal on Paddy Procurement: 'ఒప్పందం మేరకే కొంటాం... ఎందుకు రాజకీయం చేస్తున్నారు?'

author img

By

Published : Dec 3, 2021, 1:11 PM IST

Updated : Dec 3, 2021, 3:49 PM IST

Piyush Goyal, rajya sabha sessions
పీయూశ్ గోయల్ కామెంట్స్

13:06 December 03

ధాన్యం లెక్కలను తెలంగాణ సరిగ్గా నిర్వహించట్లేదు: గోయల్

Piyush Goyal on Telangana Paddy Procurement : బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ రాజ్యసభలో స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎంఓయూకు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ నుంచి అంచనాలకు, వాస్తవాలకు చాలా తేడా ఉంటోందని తెలిపారు. ధాన్యం సేకరణ విషయంలో కర్ణాటక నమూనా చాలా బాగుందన్న ఆయన....అదే నమూనాను అన్ని రాష్ట్రాలు అనుసరిస్తే బాగుంటుందని సూచించారు.

'ఎంత కొంటారు?'

KK On Paddy Procurement : బాయిల్డ్‌ రైస్‌ ఎంత కొంటారో స్పష్టం చేయాలంటూ తెరాస సభ్యుడు కె.కేశవరావు (కేకే) రాజ్యసభలో అడిగారు. ప్రతి గింజ కొంటామని గతంలో కేంద్రమంత్రి చెప్పారన్న కేశవరావు... గతేడాది 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారని అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 19 లక్షల టన్నులు కొన్నారని చెప్పిన కేకే... ఇంకా ఎంత కొంటారో కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందించారు.

తెలంగాణ నుంచి అన్ని రకాల ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తుందా? సంక్షేమ పథకాలు, రాష్ట్ర వినియోగం తర్వాత మిగిలిన ధాన్యాన్ని కస్టమ్ రైస్‌ మిల్లింగ్‌ ద్వారా కేంద్రానికి ఇవ్వటం జరుగుతుంది. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. గతేడాది 94 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకున్నారు. ఈఏడాది 19 లక్షల టన్నులను మాత్రమే తీసుకున్నారు. గతేడాది పరిమాణం మాదిరే తీసుకుంటారా?.

-కేశవరావు, రాజ్యసభ సభ్యుడు

'ఎందుకు రాజకీయం చేస్తున్నారు?'

Paddy Procurement issue in Rajya sabha : ధాన్యం కొనుగోలు విషయాన్ని రాజకీయం చేస్తున్నారని... రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే కొనుగోలు చేస్తామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో కేంద్రం స్పష్టం చేయాలన్న కేశవరావు ప్రశ్నకు ఈమేరకు సమాధానమిచ్చారు. వినియోగించే ధాన్యాన్నే కొనుగోలు చేస్తామన్న పీయూష్ గోయల్... ఈ మేరకు సీఎం కేసీఆర్​తో కూడా మాట్లాడానని తెలిపారు. వానాకాలం పంట పూర్తిగా కొంటామని చెప్పారు. దేశంలో ప్రతి ఏటా ధాన్యం సేకరణను పెంచుతున్నామన్న కేంద్రమంత్రి.... తెలంగాణ నుంచి ధాన్యం సేకరణను బాగా పెంచామని స్పష్టం చేశారు.

సెంట్రల్‌ పూల్‌ కోసం ప్రతి ఏటా ధాన్యం సేకరణను పెంచుతున్నాం. అందులో భాగంగానే తెలంగాణ నుంచి ధాన్యం సేకరణను బాగా పెంచాం. 2018-19లో 51.9 లక్షల టన్నులు,2019-20లో 74.5 లక్షల టన్నులు, 2020-21లో 94.5 లక్షల టన్నులను సేకరించాం. ఖరీఫ్‌లో 50 లక్షల టన్ను ఇస్తామని తెలంగాణ చెప్పింది. కానీ 32.66 లక్షల టన్నులే ఇచ్చింది. రబీలో 55 లక్షల టన్నులు అంచనాలున్నా 61.8 లక్షలు టన్నులు ఇచ్చింది. కేంద్రప్రభుత్వం తరఫున 94.5 లక్షల టన్నుల వరకూ సేకరిస్తామని చెప్పాం. అయినా ఇప్పటివరకూ 29 లక్షల టన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. ముందుగా ఇస్తామన్న పరిమాణంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఇవ్వలేదు.

-పీయూష్‌ గోయల్‌, కేంద్రమంత్రి

'పెండింగ్ ధాన్యం ఇవ్వకుండా భవిష్యత్ గురించి..'

రబీ కోసం రైతులు మళ్లీ సాగుకు సిద్ధమయ్యారని తెరాస ఎంపీ సురేష్‌ రెడ్డి తెలిపారు. పారాబాయిల్డ్‌ రైస్‌పై కేంద్ర మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పారాబాయిల్డ్‌ రైస్‌ను ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌... గతంలో పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ నుంచి 24లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కొనేందుకు ఒప్పందం జరిగిందని... దాన్ని 44లక్షల టన్నులకు పెంచామని తెలిపారు. ఇప్పటి వరకు 27లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ వచ్చిందన్న కేంద్రమంత్రి.. ఇంకా 17లక్షల టన్నులు పెండింగ్‌ ఉందని వెల్లడించారు. పెండింగ్‌ ధాన్యం పంపకుండా భవిష్యత్‌ గురించి తెరాస ప్రశ్నిస్తోందని అన్నారు.

ఎంవోయూకు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా. తెలంగాణ నుంచి అంచనాలకు, వాస్తవాలకు చాలా తేడా ఉంటోంది. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని ముందుగానే చెప్పాం. ఈ విషయాన్ని ఎంవోయూలో స్పష్టంగా పేర్కొన్నాం. అయినా భవిష్యత్‌ గురించి ప్రశ్నిస్తూ తెరాస గందరగోళం సృష్టిస్తోంది. ఇకపై బాయిల్డ్‌ రైస్‌ పంపబోమని అక్టోబర్‌ 4న తెలంగాణ లేఖ రాసింది. ఇప్పుడు మాత్రం బాయిల్డ్‌ రైస్‌ కొనాలని పదేపదే గొడవ చేస్తున్నారు. ధాన్యం విషయాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లేదు. భౌతిక తనిఖీల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు తెలంగాణకు వెళ్లారు. ఆ రాష్ట్రం ధాన్యం లెక్కలను సరిగా నిర్వహించడం లేదు. ధాన్యం సేకరణ కేంద్రానికి కొత్త కాదు. ఏళ్ల తరబడి ఓ పద్ధతి ప్రకారం జరుగుతన్న ప్రక్రియే. కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకూ తెలంగాణకు సహకరిస్తోంది.

-పీయూష్‌ గోయల్‌, కేంద్రమంత్రి

ఇదీ చదవండి: paddy procurement: ధాన్యం సేకరణపై పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన

Last Updated :Dec 3, 2021, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.