ETV Bharat / state

భారీగా పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా రాష్ట్రంలో విదేశీ పారిశ్రామిక పార్కులు

author img

By

Published : Dec 26, 2022, 8:42 AM IST

Foreign Industrial Parks : రాష్ట్రంలో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల పేరిట ప్రత్యేక విదేశీ పార్కులు ఏర్పాటు చేయనుంది. తొలిదశలో 10 దేశాల పార్కులను అందుబాటులోకి తెచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి భూముల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

industrial parks
industrial parks

విదేశీ పారిశ్రామిక పార్కులు

Foreign Industrial Parks : విదేశీ సంస్థలను ఆకట్టుకునేందుకు, భారీగా పెట్టుబడులను సమీకరించేందుకు ఆయా దేశాల పేరిట ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి భూములు కేటాయించడంతో పాటు రాయితీలు, ప్రోత్సాహకాలు, మానవ వనరులను అందించాలని, శిక్షణ కేంద్రాలను స్థాపించాలని భావిస్తోంది. తొలి దశలో 10 దేశాలకు చెందిన పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఫ్రాన్స్‌, కొరియా, తైవాన్‌, జపాన్‌, జర్మనీ, కెనడా, స్విట్జర్లాండ్‌, ఐర్లాండ్‌, ఇటలీ, ఇండోనేసియాలు ఈ జాబితాలో ఉన్నాయి.

విదేశాల పేరిట ప్రత్యేక పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించడం దేశంలో ఇదే ప్రథమం. రాష్ట్రంలో గత 8 ఏళ్లలో 156 పారిశ్రామిక పార్కులు ఏర్పాటయ్యాయి. నాలుగేళ్ల నుంచి ఏరోస్పేస్‌, ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌, హార్డ్‌వేర్‌ తదితర రంగాల వారీగా నెలకొల్పుతున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ పలు దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పారిశ్రామికవేత్తలు ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణకు వచ్చిన విదేశీ పారిశ్రామిక ప్రతినిధుల బృందాలూ ఇదే కోరుతున్నాయి. తాజాగా తైవాన్‌ ప్రతినిధుల బృందంతోనూ చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకొచ్చింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విదేశీ ప్రత్యేక పారిశ్రామిక పార్కుల స్థాపనకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దేశాల వారీగా ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. దీనికి అనుగుణంగా పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సంస్థల ఆసక్తి, సన్నద్ధత, రంగాల వారీగా పెట్టుబడుల అంచనాను బట్టి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది దేశాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. తాజాగా తైవాన్‌ను ఈ జాబితాలో చేర్చారు.

భూముల ఎంపికకు కసరత్తు: ప్రత్యేక పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు భూములను గుర్తించేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ కసరత్తు ప్రారంభించింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) ద్వారా శంషాబాద్‌ విమానాశ్రయానికి రాకపోకల అనుసంధానం ఉండే ప్రాంతాల్లో పార్కులను ఏర్పాటు చేయాలని ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనికి అనుగుణంగా రంగారెడ్డి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నల్గొండ, యాదాద్రి, జనగామ, సూర్యాపేట, సిద్దిపేట తదితర జిల్లాల్లోని భూములను ఎంపిక చేయాలని సంస్థ భావిస్తోంది.

ప్రత్యేక పార్కులెందుకు?: ప్రత్యేక పార్కుల్లో ఏర్పాటయ్యే సంస్థలన్నీ ఒకే దేశానికి చెందినవి కావడం వల్ల సహకారం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు రాయబారులు, దౌత్యవేత్తలు, ప్రతినిధి బృందాలు వచ్చినప్పుడు సమావేశాల నిర్వహణ తదితరాలకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. బ్యాంకింగ్‌, వీసాలు, అనుమతులు, ఇతర సౌకర్యాలతో పాటు మానవ వనరులను సులభంగా సమకూర్చుకోవచ్చనే భావన విదేశీ సంస్థల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆయా దేశాల పారిశ్రామిక పరిస్థితులకు అనుగుణంగా సహకారం అందించడంతో పాటు రాయితీలు, ప్రోత్సాహకాలివ్వాలని భావిస్తోంది. పార్కుల వారీగా పారిశ్రామిక, నైపుణ్య శిక్షణ, ఉమ్మడి సౌకర్యాల కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.