ETV Bharat / state

కూల్చివేత వేగవంతం... జూన్ 2 వరకు కొత్త సచివాలయం

author img

By

Published : Jul 7, 2020, 4:54 PM IST

నూతన సచివాలయ భవన నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలో ఉన్న భవనాల కూల్చివేత ప్రారంభించింది. కొత్త సచివాలయ భవన నమూనా కూడా ఖరారైంది. చారిత్రక కట్టడం తరహాలో ఆధునికహంగులతో సువిశాలమైన, పర్యావరణహిత సమీకృత సచివాలయ భవనాన్ని నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రానున్న రాష్ట్రావతరణ దినోత్సవం నాటికి భవనాన్ని పూర్తి చేసి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

telangana secretariat
telangana secretariat

సచివాలయ భవనాల కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఉన్నతన్యాయస్థానం కొట్టి వేసింది. దీంతో సర్కారు వేగం పెంచింది. హైకోర్టు తీర్పు వచ్చిన రోజే మిగిలిన కార్యాలయాలను తరలించి సచివాలయ భవనాలను పూర్తి స్థాయిలో ఖాళీ చేయించింది. ప్రాంగణంలో ఉన్న పాత వాహనాలు సహా సామగ్రి తరలించి కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తూ వచ్చింది.

రహదార్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులతో సంబంధిత అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్... పాత భవనాలను కూల్చివేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ అర్ధరాత్రి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌తోపాటు ఇతర అధికారులు అందుకు సంబంధించిన ప్రక్రియను పర్యవేక్షించారు.

పరిసరాల్లో ఆంక్షలు

తెల్లవారుజామునుంచి భవనాల కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. సచివాలయ ప్రాంగణంలో ఉన్న అతి పురాతనమైన జీ-బ్లాక్ సర్వహితను పూర్తిగా నేలమట్టం చేశారు. సీఎం కార్యాలయం ఉండే సీ-బ్లాక్ సమత కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. ప్రవేశద్వారం పక్కనున్న విద్యుత్ శాఖకు చెందిన పురాతన కట్టడాన్ని కూడా కూల్చివేసే పనులను చేపట్టారు.

కూల్చివేత కోసం వివిధ పద్ధతులను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషించింది. భవనం పూర్తిగా ఒకేమారు నేలమట్టమయ్యేలా ఇంప్లోజివ్ టెక్నాలజీ, పేలుడు పదార్థాలతో కూల్చివేత లాంటి విధానాలను పరిశీలించింది. అయితే హుస్సేన్ సాగర్ తీరాన ఉండడం, పరిసరాల్లో కార్యాలయాలు, ఇతర భవనాలు, ఖైరతాబాద్ ప్రాంతంలో నివాస గృహాలు తదితరాలను దృష్టిలో ఉంచుకొని అవన్నీ విరమించుకుంది.

చివరికి యంత్రాల సాయంతోనే భవనాలను కూల్చివేయాలని నిర్ణయించారు. సచివాలయం పరిసరాల్లో పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించారు. కూల్చివేత, ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతం సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ ఇవాళ సెలవు ప్రకటించారు.

ఆరు అంతస్తుల్లో...

నూతన సచివాలయ భవన నిర్మాణ నమూనా కూడా ఖరారైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ నమూనాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నమూనాకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. సచివాలయ భవనం కోసం పలువురు ఆర్కిటెక్ట్‌లు రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే నమూనాలు పంపారు.

ముంబయికి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్, తమిళనాడుకు చెందిన ఒకరితోపాటు పలువురు ఆర్కిటెక్ట్‌లు నమూనాలు పంపారు. వాటిలో నుంచి ప్రస్తుత నమూనాను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఆ నమూనాను హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించినట్లు తెలుస్తోంది. చారిత్రక కట్టడం తరహాలో సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉండేలా ఈ నమూనాకు మొగ్గు చూపినట్లు చెప్తున్నారు. ఆరు అంతస్తుల్లో సమీకృత సచివాలయ భవనాన్ని నిర్మించే అవకాశం ఉంది.

పర్యావరణహితంగా..

మొత్తం 25 ఎకరాల్లో విస్తీర్ణంలో సువిశాలమైన పచ్చికబయళ్లు ఉండేలా హుస్సేన్ సాగర్‌కు అభిముఖంగా కొత్త సచివాలయ భవనం రానుంది. సకల సౌకర్యాలు, ఆధునిక హంగులు, సమావేశ మందిరాలు, బహుళ అంతస్తుల పార్కింగ్, ధారాళంగా గాలి-వెలుతురు వచ్చేలా పూర్తి పర్యావరణహితమైన భవనాన్ని నిర్మించేందుకు సర్కార్ సిద్ధమైంది.

ఎలాంటి లోపాలు లేకుండా పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా గ్రీన్ బిల్డింగ్స్ నిబంధనలకు లోబడి భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులకు ఉత్తర దిశలో ప్రవేశద్వారం, ఉద్యోగులకు తూర్పువైపు, సందర్శకుల కోసం దక్షిణం వైపు నుంచి ప్రవేశద్వారాలను నిర్మించనున్నారు.

జూన్ 2 వరకు..

కొత్త సచివాలయ భవన నిర్మాణానికి 2019 జూన్ 27న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అదే ప్రాంతంలో ఆధునిక భవనాన్ని నిర్మించనున్నారు. వీలైనంత త్వరగా కూల్చివేతలు పూర్తి చేసి శ్రావణమాసంలో నూతన సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

షాపూర్ జీ పల్లంజీ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. వచ్చే రాష్ట్రావతరణ దినోత్సవమైన జూన్ రెండో తేదీ నాటికి నిర్మాణం పూర్తి చేసి నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఇదీ చదవండి : రాష్ట్ర నూతన సచివాలయం నమూనా విడుదల చేసిన సర్కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.