ETV Bharat / state

ప్రజల ప్రాణాలు గాలికొదిలేశారా..! కరోనా నివారణపై హైకోర్టు అసంతృప్తి..

author img

By

Published : Jun 17, 2020, 9:10 PM IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణను ప్రభుత్వం గాలికొదిలేసినట్లు కనిపిస్తోందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు.. కొవిడ్​ నియంత్రణపై ప్రభుత్వానికి ఆసక్తి, ఉత్సాహం తగ్గినట్లు కనిపిస్తోందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. తమ ఆదేశాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది.

telangana high court fire on government for covid-19 tests and facilitys in state
ప్రభుత్వానికి ఆసక్తి, ఉత్సాహం తగ్గినట్లు కనిపిస్తోంది: హైకోర్టు

రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు కరోనా విస్తరించిందని.. గతంలో లేని ప్రాంతాలకు కూడా పాకిందని ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. కొవిడ్​ నియంత్రణపై ప్రభుత్వానికి ఆసక్తి, ఉత్సాహం తగ్గినట్లు కనిపిస్తోందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రజలే ఎవరి జాగ్రత్తలు తీసుకోవాలని గాలికొదిలేసినట్లు ప్రభుత్వ ధోరణి ఉందని పేర్కొంది.

రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజు రోజుకి మరింత ఆందోళనకరంగా మారుతోందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని మూడు వారాలుగా సర్కార్​ను తాము కోరుతూనే ఉన్నామని ధర్మాసనం పేర్కొంది. కొవిడ్​ చికిత్సలు గాంధీ ఆస్పత్రికే ఎందుకు పరిమితం చేశారని.. నిమ్స్ వంటి ఆసుపత్రులను పూర్తిస్థాయిలో ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించింది.

ఆ ప్రాంతాల్లో పరీక్షలు ఎందుకు చేయట్లేదు...

రాష్ట్రంలో కరోనా పరీక్షలు కూడా తక్కువగా జరుగుతున్నాయని పేర్కొంది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇంటింటికి పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. పరీక్షలు చేయకుంటే కరోనా వ్యాప్తి తీవ్రత ఎలా తెలుస్తుందని హైకోర్టు పేర్కొంది. కరోనా గణాంకాలకు సంబంధించిన మీడియా బులిటెన్​లలో గణాంకాలు గజిబిజి లెక్కలతో గందరగోళంగా ఉంటున్నాయని పేర్కొంది. మీడియా బులిటెన్ తీరును మార్చాలని తాము పేర్కొన్నప్పటికీ మారడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తూనే ఉందని హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు మరింత కఠినంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటే.. అలాగే ఉంటామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సరిపడా పీపీఈ కిట్లు, మాస్కులు లేవు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందికి తగినంత పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వడం లేదన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్రంలో ఏడు లక్షల కిట్లు ఉన్నాయన్న పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు నివేదికపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎన్ని కిట్లు ఉన్నాయో తమకు అవసరం లేదని.. వైద్య సిబ్బందికి ఎన్ని చేరాయి అనేది ముఖ్యమని పేర్కొంది.

వైద్యులు సమ్మెతో పరిస్థితి అద్దం పడుతోంది...

గాంధీ ఆస్పత్రిలో ఇటీవల జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారంటే అక్కడి పరిస్థితి అద్దం పడుతోందని హైకోర్టు పేర్కొంది. ఓవైపు కిట్లు లేక మరోవైపు పేషెంట్ల బంధువుల దాడులు ఎదుర్కొంటూ వైద్య సిబ్బంది చికిత్సలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. కిట్లు ఎన్ని ఉన్నాయి సిబ్బందికి ఎన్ని ఇచ్చారో పూర్తి వివరాలను గురువారం సమర్పించాలని గాంధీ, నిమ్స్ , కింగ్ కోఠీ, ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్​లను ధర్మాసనం ఆదేశించింది. రేపటి విచారణకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: కరోనా పరీక్షలపై ప్రభుత్వానికి ఊరట.. స్టే విధించిన సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.