ETV Bharat / state

మహిళా దినోత్సవం స్పెషల్.. 'ఆరోగ్య మహిళ'కు ప్రభుత్వ శ్రీకారం

author img

By

Published : Mar 4, 2023, 9:22 PM IST

Arogya mahila program in telangana : మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. మార్చి ఎనిమిదో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 'ఆరోగ్య మహిళ' కార్యక్రమాన్ని ప్రారంభించి.. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు. మొదటి దశలో వంద ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించి.. దశల వారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు.

'ఆరోగ్య మహిళ'
'ఆరోగ్య మహిళ'

Arogya mahila program in telangana: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో మహిళా దినోత్సవ కానుకగా 'ఆరోగ్య మహిళ' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి హరీశ్​రావు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు.

ఉన్నతాధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకరరావు బీఆర్కే భవన్ నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ నెల 8న ప్రారంభించనున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే ఎనిమిది రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించనున్నారు. మొదటి దశలో వంద పీహెచ్​సీ, యూపీహెచ్​సీ, బస్తీ దవాఖానాల్లో ప్రారంభించి.. దశల వారీగా మొత్తం 1,200 ఆరోగ్య కేంద్రాలకు విస్తరించనున్నారు. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలతో పాటు ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు చేసి చికిత్స, ఔషధాలు అందిస్తారు.

ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడంతో పాటు ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షణ ఉంటుంది. తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారని.. రెఫరల్ సెంటర్లుగా ప్రభుత్వ పెద్దాసుపత్రులు ఉంటాయని చెప్పారు. సంబంధిత మహిళకు పూర్తిగా నయం అయ్యే వరకు వైద్య సేవలు అందుతాయన్న మంత్రి హరీశ్‌రావు.. రిఫరల్ ఆసుపత్రుల్లో మహిళలు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్​లు ఉంటాయని చెప్పారు.

కరోనా తర్వాత అకస్మాత్తుగా గుండెపోటు వస్తున్న కేసులు పెరిగినట్లు వైద్య నిపుణులు, పలు అధ్యయనాలు చెబుతున్నాయని.. వారికి సీపీఆర్​ చేస్తే పదిలో కనీసం ఐదుగురిని బతికించవచ్చని మంత్రి అన్నారు. సీపీఆర్​పై శిక్షణ ఇచ్చి జిల్లాకు ఐదుగురు చొప్పున మాస్టర్ ట్రైనర్లను పంపామని.. వారితో వైద్య, పోలీసు, మున్సిపల్, ఇతర విభాగాల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని తెలిపారు.

ఇందులో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అన్నారు. మొదటి దశలో రూ.18 కోట్లతో 1,200 ఏఈడీ పరికరాలు కొనుగొలు చేసి ఆటోమేటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డెఫిబ్రిలేటర్స్‌ పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లో అందుబాటులో ఉంచనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని.. ఇప్పటి వరకు 63 లక్షల 82 వేల మందికి కంటి పరీక్షలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. సగటున 14 శాతం మందికి కళ్లద్దాలు అవసరం పడుతున్నాయని చెప్పారు.

మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళ' కార్యక్రమం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.