ETV Bharat / state

ts government jobs : ఉద్యోగాల భర్తీకి.. కొత్త రోస్టర్‌.. జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా అమలు?

author img

By

Published : Jan 1, 2022, 5:57 AM IST

ts government jobs : రాష్ట్రంలో కొత్తగా భర్తీచేయబోయే ప్రత్యక్ష నియామకాల్లో కొత్త రోస్టర్‌ ప్రకారం పోస్టులను రిజర్వు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ విభాగాల వారీగా ఉద్యోగ ఖాళీలు గుర్తించే సమయంలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్లీజోన్ల వారీగా పోస్టులకు మొదటి పాయింట్‌ నుంచి దీన్ని అమలు చేయనుంది.

roster method
roster method

ts government jobs : రాష్ట్రపతి నూతన నిబంధనల ప్రకారం జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ ఉద్యోగుల కేటాయింపు త్వరలోనే పూర్తికానున్న నేపథ్యంలో ఆయా విభాగాల్లో ఏర్పడే ఖాళీలను సంబంధిత విభాగాలు త్వరలోనే గుర్తించనున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రోస్టర్‌ పట్టిక కీలకం. 1-100 వరకు పాయింట్లను రిజర్వేషన్ల వారీగా గుర్తించారు. ఇందులో భాగంగా గుర్తించిన ఖాళీలను రోస్టర్‌ పాయింట్‌ మేరకు (జనరల్‌, మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్‌ వారీగా కేటాయించి) రిజర్వు చేసి ఉద్యోగ ప్రకటనలు వెలువరించడం ఆనవాయితీగా వస్తోంది. తదుపరి ప్రకటన నాటికి గుర్తించిన ఖాళీలకు గతంలో ముగిసిన పాయింట్‌ నుంచి వరుస క్రమంలో తీసుకుని పోస్టులు రిజర్వు చేస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉమ్మడి రాష్ట్ర రోస్టర్‌ ముగించి, కొత్తగా గుర్తించిన ఖాళీల భర్తీకి కొత్త రోస్టర్‌ అమల్లోకి తెచ్చారు. తొలి పాయింట్‌ నుంచి లెక్కించారు.

తాజాగా రాష్ట్రపతి నూతన ఉత్తర్వులతో 10 జిల్లాలు 33 జిల్లాలుగా మారాయి. 7 జోన్లు, 2 మల్టీజోన్లు వచ్చాయి. ఈ కారణంగా పలు పోస్టుల కేటగిరీ స్థాయి మారిపోయింది. నూతన ఉత్తర్వుల ప్రకారం పలు విభాగాల్లోని జిల్లా స్థాయి పోస్టులు జోనల్‌గా, జోనల్‌వి మల్టీ జోనల్‌గా, జిల్లా స్థాయిగా మారాయి. రాష్ట్రస్థాయి పోస్టులు మల్టీజోనల్‌ కిందకు వచ్చాయి. పలు పోస్టుల కేటగిరీల్లో భారీ మార్పులు చోటుచేసుకోవడం, జిల్లాల సంఖ్య పెరగడం, కొత్త జోన్లు, మల్టీజోన్ల నేపథ్యంలో కొత్తగా గుర్తించే ఖాళీల భర్తీకి కొత్త రోస్టర్‌ పాటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాకే..

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ప్రస్తుతం తుదిదశకు చేరుకుంటోంది. ఇది పూర్తయితే ఆయా జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల పరిధిలో ఖాళీల సంఖ్యపై స్పష్టత వస్తుంది. గుర్తించిన ఖాళీలకు మంత్రి మండలి ఆమోదం తీసుకున్నాక ఆర్థికశాఖ భర్తీకి అనుమతులివ్వనుంది. కొత్త రోస్టర్‌ ప్రకారం సంబంధిత విభాగాలు, కార్పొరేషన్లు, సొసైటీలు ఆయా పోస్టులను రిజర్వుచేసి ఓపెన్‌, రిజర్వుడు కేటగిరీలతో కూడిన ప్రతిపాదనల్ని నియామక ఏజెన్సీలకు పంపిస్తాయి. అలా ఇప్పటికే 70వేలకుపైగా ఖాళీలు గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యాక, ఖాళీ పోస్టుల భర్తీ, కొత్త రోస్టర్‌ విధానంపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. మరోవైపు ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఉద్యోగ నియామకాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించిన కారణంగా రోస్టర్‌లోని పది ఓపెన్‌ కేటగిరీ పాయింట్లను ఈ వర్గాలకు కేటాయించారు.

ఇదీ చూడండి: Teacher Transfers in Telangana: టీచర్ల అప్పీళ్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.