ETV Bharat / state

Child labour: చిన్నారులతో పనిచేయించుకుంటే అంతే సంగతులు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

author img

By

Published : Dec 16, 2021, 4:56 PM IST

Child Labour Act: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా రాష్ట్ర సర్కారు కృషి చేస్తోంది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో బాలకార్మిక చట్టాన్ని సవరిస్తూ విధివిధానాలు ఖరారు చేస్తూ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఏళ్ల లోపు చిన్నారులతో ఎవరైనా, ఎక్కడైనా పనిచేయించుకుంటే కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Child labour: చిన్నారులతో పనిచేయించుకుంటే అంతే సంగతులు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Child labour: చిన్నారులతో పనిచేయించుకుంటే అంతే సంగతులు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Child Labour Act: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో బాలకార్మిక చట్టాన్ని సవరిస్తూ విధివిధానాలు ఖరారు చేసింది. ఈ మేరకు కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఏళ్ల లోపు చిన్నారులను ఎవరైనా, ఎక్కడైనా పనిచేయించుకుంటే కఠినచర్యలు తీసుకోనున్నారు. ఇందుకు ఆర్నెళ్ల నుంచి ఏడాది జైలుశిక్షతో పాటు 20 నుంచి యాభై వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు.

పిల్లలను పనికి పంపిస్తే శిక్షార్హులే..

  • ఒకవేళ చిన్నారులను తల్లిదండ్రులే పనికి పంపిస్తే వారు కూడా శిక్షార్హులేనని స్పష్టం చేసింది. అయితే చిన్నారుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనుల్లో చిన్నారులు తల్లిదండ్రులకు సహాయపడవచ్చు.
  • అది కూడా హానికరమైన పనులు, ఆదాయం వచ్చేలా తయారీ రంగం, ఉత్పత్తి, రిటైల్ చైన్ సరఫరా పనులకు వినియోగించరాదు.
  • పాఠశాల సమయాలతో పాటు రాత్రి ఏడు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు చిన్నారులు పని చేయరాదు.
  • బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్​ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు.
  • చిన్నారి ఎలాంటి అనుమతి లేకుండా 30 రోజుల పాటు పాఠశాలకు గైర్హాజరైతే సంబంధిత ప్రిన్సిపల్, ప్రధానోపాధ్యాయుడు ఆ విషయాన్ని నోడల్ అధికారి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

చిన్నారులు కళాకారులుగా పనిచేసేందుకు నిబంధనలివే..

  • కళాకారులుగా చిన్నారులు పనిచేసేందుకు కూడా కార్మికశాఖ నిబంధనలు రూపొందించింది.
  • సినిమాలు, ఇతర చిత్రీకరణలో చిన్నారులు నటించేందుకు కలెక్టర్ల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
  • నిర్మాత లేదా దర్శకులు ఈ మేరకు అనుమతి తీసుకోవాలి.
  • రోజుకు ఐదు గంటలకు మించి, విరామం లేకుండా మూడు గంటలకు మించి చిన్నారులను చిత్రీకరణలో పనిచేయించకూడదు.
  • చిత్రీకరణ సమయంలోనూ అన్ని రకాల జాగ్రత్తలు పూర్తి స్థాయిలో పాటించాల్సి ఉంటుంది.
  • చిన్నారుల పరిరక్షణ, విద్యాహక్కు చట్టం, లైంగిక వేధింపుల చట్టం ఉల్లంఘనలు లేకుండా చూడాలి.
  • చిన్నారుల విద్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు 27 రోజులకు మించి ఏ చిన్నారిని చిత్రీకరణకు అనుమతించబోరు.
  • ఐదు మందికి మించి చిన్నారులు చిత్రీకరణలో ఉన్నట్లైతే వారి పర్యవేక్షణ కోసం ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నియమించాల్సి ఉంటుంది.
  • చిన్నారులకు వచ్చే ఆదాయంలో కనీసం 25శాతం మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్​డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సదరు చిన్నారి మేజర్ అయ్యాక ఆ మొత్తం చిన్నారికి చెందేలా చూడాలి.
  • చిన్నారుల ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఎలాంటి చిత్రీకరణలోనూ ఉపయోగించరాదు.

ఇదీ చదవండి:

Inter results: ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.