ETV Bharat / state

Telangana fish brand : తెలంగాణ చేపలు.. ప్రత్యేక బ్రాండ్‌కు ప్రభుత్వ నిర్ణయం

author img

By

Published : Jan 3, 2022, 9:19 AM IST

Telangana fish brand : రాష్ట్రంలో త్వరలో సర్కారీ చేపలు అందుబాటులోకి రాబోతున్నాయి. మీరు విన్నది నిజమే. వినియోగదారులకు నాణ్యమైన చేపలను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ చేపలు అనే బ్రాండ్​ను సృష్టించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక ప్రణాళిక కూడా సిద్ధం చేసింది.

Telangana fish brand, GOVT fish in telangana
తెలంగాణ చేపలు

Telangana fish brand : రాష్ట్రంలో మత్స్య సంపద నుంచి ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా ‘తెలంగాణ చేపలు’ అనే బ్రాండ్‌ను సృష్టించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. చేపపిల్లల పెంపకంపై ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నందున ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగేలా చూడాలని ‘హబ్‌-స్పోక్‌’ అనే పేరుతో ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలోని నీటి వనరుల్లో వదిలిన చేపపిల్లలు పెరిగి వేసవి సీజన్‌లోని కొన్ని నెలల్లో మాత్రమే మార్కెట్లకు వస్తున్నాయి. మిగతా నెలల్లో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా కొర్రమీను, మేలురకం రొయ్యలు దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా చేపలు లభించేలా నీటివనరుల్లో పెంచాలని మత్స్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. మత్స్యకారులకు ఆదాయం పెంచడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన చేపలు అందించాలన్నది దీని లక్ష్యం. మిగులు చేపలను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకూ ఎగుమతి చేయనున్నారు.

ప్రత్యేక ప్రణాళిక

హబ్‌-స్పోక్‌ ప్రణాళిక

* సైకిల్‌ చక్రంలో మధ్యలో ఉండే హబ్‌: టోకు చేపల మార్కెట్‌

* చక్రంలో ఉండే చువ్వలు: వివిధ ప్రాంతాల మార్కెట్లు

* ప్రతి జిల్లా కేంద్రంలో టోకు మార్కెట్‌ హబ్‌ ఏర్పాటు చేస్తారు. దాని నుంచి జిల్లాలోని చిల్లర మార్కెట్లకు, ఇతర ప్రాంతాలకు పంపుతారు.

కోహెడలో చేపల హబ్‌ ఏర్పాటుకు నిర్ణయం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మార్కెట్లలో ఏటా లక్ష టన్నులకు పైగా చేపలు విక్రయమవుతున్నాయి. ఈ మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు నగర శివారులోని కోహెడ వద్ద 10 ఎకరాల్లో రూ.50 కోట్ల వ్యయంతో అత్యాధునిక చేపల హబ్‌ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏడాదిలోగా దీని నిర్మాణం పూర్తిచేయాలని ప్రతిపాదించారు. ఇందుకు స్థలం కేటాయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ హబ్‌ల ఏర్పాటుకు స్థలాలను అన్వేషిస్తున్నారు.

సర్కారీ చేవలోయ్

రూ.వెయ్యి కోట్లతో మార్కెటింగ్‌ వ్యవస్థ అభివృద్ధి

సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రూ.800 కోట్ల రుణం తీసుకుని రాష్ట్రంలో చేపల మార్కెటింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.56.10 కోట్లు ఇవ్వగా, మత్స్యకారుల వాటాగా మరో రూ.143.90 కోట్లు సేకరించి మొత్తం రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తున్నారు. తెలంగాణ చేపలను మంచినీటి వనరుల్లో పెంచుతున్నందున వీటి రుచి బాగుంటుందని మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాం బుక్యా తెలిపారు. తెలంగాణ చేపల బ్రాండు పేరుతో వ్యాపారం, ఆదాయం పెంచాలనేది లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇదీ పరిస్థితి (2020-21లో)

* ఏటా చేపల డిమాండ్‌: 3.50 లక్షల టన్నులు

* ఉత్పత్తి: 3.37 లక్షల టన్నులు

* కొరత: 13 వేల టన్నులు

* ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి: లక్ష టన్నులకు పైగా

(మన దగ్గర ఉత్పత్తవుతున్న చేపలు ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి అవుతున్నాయి.)

.

ఇదీ చదవండి: Rythu bandhu Celebrations: రాష్ట్రంలో ముందే సంక్రాంతి.. నేటి నుంచి రైతుబంధు సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.