ETV Bharat / state

ఆన్‌లైన్‌లోనూ అంతగా సాగని ప్రక్రియ.. ప్రైవేట్ సాయానికి అనుమతులు

author img

By

Published : Oct 3, 2020, 6:31 AM IST

తెలంగాణలో ఆస్తుల నమోదు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. పురపాలక సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన ప్రత్యేక యాప్‌ ద్వారా వివరాలను (ఈకేవైసీ) నమోదు చేయడంతో పాటు యజమానులు స్వయంగా ఆన్​లైన్​లో నమోదు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. అయితే ఈ ప్రక్రియ చాలా మందికి క్లిష్టతరమైన సమస్యగా మారింది.

telangana government agrees for private assistance in property registration through online
ఆన్‌లైన్‌లోనూ అంతగా సాగని ప్రక్రియ.. ప్రైవేట్ సాయానికి అనుమతులు

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల (నిర్మాణాలు, ప్లాట్లు) నమోదు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. తెలంగాణ నాన్‌ అగ్రిక్చలర్‌ పాస్‌పుస్తకం (టీఎస్‌ఎన్‌పీబీ) అందించే క్రమంలో భాగంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో పురపాలక సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన ప్రత్యేక యాప్‌ ద్వారా వివరాలను (ఈకేవైసీ) నమోదు చేస్తున్నారు. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య ఆధారంగా నిర్మాణాలు, ప్లాట్లకు సంబంధించి ఆధార్‌, ఇతర వివరాలను పొందుపరుస్తున్నారు. దీంతో పాటు యజమానులు కూడా స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే నేరుగా నమోదు చేసుకునేందుకు శుక్రవారం పలువురు ప్రయత్నించగా అదొక క్లిష్టతరమైన సమస్యగా మారింది. ఆస్తిపన్ను రికార్డుల్లోని పేరు, ఆధార్‌లోని పేరులో ఒక అక్షరం తేడా ఉన్నా నమోదు ప్రక్రియ ఆగిపోతుండటంతో గందరగోళానికి గురవుతున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో ‘ఈకేవైసీ’ పూర్తి చేయడం పెద్ద ప్రయాసగా మారింది.

telangana government agrees for private assistance in property registration through online
గ్రేటర్​లో ఇదీ లెక్క

మా ప్రాంతానికి ఎప్పుడు వస్తారు?

మూడు రోజులైనా నమోదు ప్రారంభం కాలేదని పలు ప్రాంతాలవారు పేర్కొన్నారు. సర్వేకు ఎవరు? ఎప్పుడు వస్తారు? సిబ్బంది ఇంటికొచ్చినప్పుడు తాము లేకుంటే ఎలా? తర్వాత ఎవరిని, ఎక్కడ సంప్రదించి వివరాలు అందించాలి? ఆస్తుల సర్వే పూర్తి చేసుకునేందుకు తుది గడువుందా? ఇలాంటి సందేహాలతో ఆస్తుల యజమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. యజమాని ఇంట్లో లేకుంటే ఫోన్‌ ద్వారా వివరాలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా.. అలా ఎక్కడో ఉండి చెప్పడం ఎలా సాధ్యమనేది కొందరి సందేహం. కొన్నిచోట్ల ఆస్తుల వివరాలు ఎందుకు చెప్పాలి; ఎన్నిసార్లు ఇవ్వాలి అంటూ యజమానులు బిల్‌ కలెక్టర్లను ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

ప్రైవేటు తోడ్పాటు

హైదరాబాద్‌లో నమోదు ప్రక్రియ మొదలై మూడు రోజులు గడుస్తున్నా 2,500 ఆస్తులే రికార్డుల్లోకి ఎక్కాయి. ఉన్నతాధికారులు నిర్దేశించిన సమయం సరిపోవడంలేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ వేగంగా సాగకపోవడంపై జీహెచ్‌ఎంసీ అధికారులపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రైవేటు సిబ్బందిని నియమించుకుని పని వేగవంతం చేయాలని సూచించింది. ఆ మేరకు గ్రేటర్‌ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ బిల్‌కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రైవేటు సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. వారు శనివారం నుంచి రంగంలోకి దిగనున్నారు. వారు బిల్‌ కలెక్టరు లేదా ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫోన్‌ నంబరుతో ప్రభుత్వం ఇచ్చిన మొబైల్‌ యాప్‌లోకి లాగిన్‌ అయి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ప్రైవేటు వ్యక్తులకు ఒక్కో నిర్మాణానికి రూ.30 చొప్పున చెల్లించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.

సందేహాల నివృత్తికి కాల్‌సెంటర్‌

పౌరులు స్వయంగా ఆస్తుల ఈకేవైసీని పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించింది. https://ts.meeseva.telangana.gov.in/TSPortaleef/UserInterface/CitizenevenueServicesMSSendOTP.aspx లింకును అనుసరించాలని సూచించింది. అయితే ఇందులో సమస్యలు ఎదురవుతున్నాయని కొందరు చెబుతున్నారు. మధ్యలో ఆగిపోతే ముందుకు వెళ్లడమెలాగో తెలిపే అవకాశాలేవీ లేవనేది వారి ఫిర్యాదు. ఎందుకు ఆగిపోయిందో కూడా తెలీని పరిస్థితి. ఈ విషయంలో ప్రజల సందేహాల నివృత్తి కోసం శనివారం నుంచి కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.