ETV Bharat / state

TELANGANA ASSEMBLY SESSION: రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతిపై చులకనగా మాట్లాడొద్దు: సీఎం కేసీఆర్​

author img

By

Published : Oct 8, 2021, 10:12 PM IST

అభివృద్ధి, సంక్షేమంతో పాటు పదివేల కోట్లతో వైద్యరంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో స్పష్టం చేశారు. దేశాన్ని సాకే నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉందని సీఎం అన్నారు. కేంద్రం నుంచి పైసా రావడం లేదన్న కేసీఆర్​.. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతిపై చులకనగా మాట్లాడి మలినం చేయొద్దని విపక్షాలకు చురకలు అంటించారు. రాష్ట్రంలో అద్భుతమైన విద్య, వైద్యం, విద్యుత్‌, ఉపాధి అవకాశాలు ఉన్నందునే రాష్ట్రానికి వలసలు పెరిగాయని వివరించారు.

TELANGANA ASSEMBLY SESSION
TELANGANA ASSEMBLY SESSION

అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చను తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రారంభించారు . ఎంఐఎం నుంచి ఆ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి పింఛన్లు మంజూరు చేయాలని ప్రస్తావించారు. భాజపా నుంచి మాట్లాడిన రాజాసింగ్‌ కొంతమంది దళారులు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకంలోనూ వసూళ్లకు పాల్పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియగా కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు . గ్రామాల్లో అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులనే వాడుతున్నారని... రాష్ట్రం ప్రత్యేకంగా నిధులేమీ ఇవ్వడంలేదని భట్టి స్పష్టం చేశారు.

రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతిపై చులకనగా మాట్లాడొద్దు: సీఎం కేసీఆర్​

ఉచిత విద్య కలల ప్రాజెక్టు..

స్వల్పకాలిక చర్చలో విపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఏడున్నరేళ్లలో స్వరాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, వాటి ఫలాలు, ఖర్చు చేసిన నిధుల వివరాలను గణాంకాల రూపంలో ముఖ్యమంత్రి సభకు వెల్లడించారు. అభివృద్ధితో పాటు మూలధన వ్యయం ఖర్చులోనూ ముందున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి పైసా సాయం రావడం లేదని ఘాటుగా విమర్శించారు. కేజీ నుంచి పీజీ ఉచిత విద్య తన కలల ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. విద్యా నిపుణుల సూచన మేరకే ఐదో తరగతి నుంచి గురుకుల విద్యను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రగతి బాటన రాష్ట్రం..

ఉపాధిహామీ క్షేత్ర సహాయకులను విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించారు. భట్టి విక్రమార్క వినతిపై స్పందించిన సీఎం.. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించలేదని వాళ్లే వెళ్లిపోయారని స్పష్టం చేశారు. గృహరంగం మీద విశేషంగా ఖర్చుచేస్తున్నట్లు సీఎం కేసీఆర్​ వివరించారు. సొంత జాగాలున్నవారికి త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లు నిర్మించే పథకం అమలుచేస్తామని అసెంబ్లీలో వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్‌పై క‌ఠినంగా వ్యవహ‌రించాల‌ని యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్‌, కొత్త రేష‌న్ కార్డుల‌కు మ‌ళ్లీ దరఖాస్తులు స్వీక‌రిస్తామని సీఎం వెల్లడించారు. ఏడున్నరేళ్లలో అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి బాటన పయనిస్తోందని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.

37 గంటలా ఐదు నిమిషాలు..

శాసనసభ వర్షాకాల సమావేశాలు ఏడు రోజుల పాటు జరిగాయి. ఏడు రోజుల్లో 37 గంటలా ఐదు నిమిషాల పాటు సభ సమావేశమైంది. ఈ సమావేశాల్లో 27 ప్రశ్నలకు మంత్రులు మౌఖికంగా సమాధానం ఇవ్వగా... మరో 12 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. 76 అనుబంధ ప్రశ్నలు అడిగిన సభ్యులు... 41 ప్రసంగాలు చేశారు. శూన్యగంటలో 170 అంశాలను సభ్యులు ప్రస్తావించారు. బీసీ కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కోరుతూ తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశాల్లో ఏడు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.

వీటిపైనే చర్చ...

గృహనిర్మాణ, ఉద్యాన విశ్వవిద్యాలయం, నల్సార్, పంచాయతీరాజ్, జీఎస్టీ, స్టాంపు చట్టం సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. పర్యాటకులపై దళారీతనం, దుష్ప్రవర్తన నిరోధించే టౌటింగ్ చట్టం బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఆరు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. పరిశ్రమలు-ఐటీ రంగం పురోగతి, హరితహారం, మైనార్టీ సంక్షేమం - పాతబస్తీ అభివృద్ధి, దళిత బంధు, పల్లె పట్టణ ప్రగతి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సభలో విస్తృతంగా చర్చించారు.

ఎవరెవరూ ఎంత సమయమంటే..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు గంటలా ఏడు నిమిషాల సమయం తీసుకోగా.. మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ నాలుగు గంటలా 25 నిమిషాలు, కాంగ్రెస్ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క రెండు గంటలా 15 నిమిషాల సమయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కలిపి 16 గంటలా 55 నిమిషాల సమయం ప్రసంగించారు. పార్టీల పరంగా చూస్తే తెరాస తొమ్మిది గంటలా రెండు నిమిషాలు, మజ్లిస్ ఐదు గంటలా 35 నిమిషాలు, కాంగ్రెస్ మూడు గంటలా 24 నిమిషాల సమయం తీసుకొన్నాయి. భాజపా రెండు గంటలా మూడు నిమిషాల సమయం తీసుకొంది.

ఈ ఏడు రోజులు మండలిలో..

శాసన మండలి వర్షాకాల సమావేశాలు ఏడు రోజులు జరిగాయి. ఈ ఏడు రోజుల్లో 23 గంటలా 32 నిమిషాలపాటు సభ సమావేశమైంది. ఈ సమావేశాల్లో 30 ప్రశ్నలకు, 61 అనుబంధ ప్రశ్నలకు మంత్రులు మౌఖికంగా సమాధానాలు ఇచ్చారు. మరో ఆరు ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఏడు బిల్లులకు ఈ సమావేశాలు ఆమోదం తెలిపాయి. తెలంగాణ హౌసింగ్‌ బోర్డు సవరణ బిల్లు-2021, కొండా లక్ష్మణ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ సవరణ బిల్లు-2021, తెలంగాణ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు 2021, నేషనల్‌ అకాడమీ లీగల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ సవరణ బిల్లు 2021, తెలంగాణ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ సవరణ బిల్లు, తెలంగాణ స్టేట్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ ట్యూటింగ్‌ అండ్‌ మాల్‌ప్రాక్టీస్‌ అగెయినెస్ట్‌ ట్యూరెస్ట్స్‌ అండ్‌ ట్రావెల్లర్స్‌ బిల్లు, ఇండియన్‌ స్టాంపు సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది.

36 ప్రత్యేక అంశాలను మంత్రులు ప్రస్తావించారు. పరిశ్రమలు ఐటీ రంగం, హరితహారం, మైనార్టీల సంక్షేమ, అబివృద్ధి, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. బీసీ కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కోరుతూ ప్రభుత్వ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మంత్రులు 13 గంటలా నాలుగు నిమిషాలు ప్రసంగించారు. పార్టీల పరంగా తీసుకుంటే తెరాస సభ్యులు అయిదు గంటలా 5 నిమిషాలు, మజ్లిస్ గంటా 23 నిమిషాలు, కాంగ్రెస్ రెండు గంటలా 23 నిమిషాలు, ఇండిపెండెంట్‌, పీఆర్టీయు సభ్యులు దాదాపు రెండు గంటలు మాట్లాడారు.

ఇదీచూడండి: Huzurabad by election: ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల​ ఘట్టం.. ప్రచారాలపై ఈసీ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.