ETV Bharat / state

Telangana Budget Sessions: నేటి నుంచే బడ్జెట్ సమావేశాలు.. సంక్షేమానికి పెద్దపీట!

author img

By

Published : Mar 7, 2022, 5:00 AM IST

Telangana Budget Sessions: రాష్ట్ర ఉభయసభలు ఇవాళ కొలువు తీరనున్నాయి. వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం ఈరోజు నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత సమావేశాలకు కొనసాగింపుగా జరుగుతున్న తరుణంలో ఉభయసభల సభ్యులనుద్దేశించి ఈ మారు గవర్నర్ ప్రసంగం లేదు. నేరుగా బడ్జెట్ సమర్పణతోనే సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశాల ఎజెండా బడ్జెట్ అనంతరం ఖరారు కానుంది.

Assembly
Assembly

Telangana Budget Sessions: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2022-23 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ, మండలి ఇవాళ్టి నుంచి సమావేశం కానున్నాయి. ఉభయసభలు ప్రొరోగ్ కానందున గత అక్టోబర్​లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగానే అసెంబ్లీ, కౌన్సిల్ భేటీ అవుతున్నాయి. దీంతో వీటిని ఏడాదిలో మొదటి సమావేశాలుగా పరిగణించనందున ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండటం లేదు. నేరుగా బడ్జెట్ సమర్పణతోనే సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం శాసనసభ, మండలి ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సమావేశం కానున్నాయి.

పదిరోజుల పాటు సమావేశాలు...

సమావేశాల ప్రారంభంతోనే ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రసంగం ఈ మారు కాస్త సుదీర్ఘంగానే ఉందని సమాచారం. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఉభయసభలు వాయిదా పడనున్నాయి. అనంతరం శాసనసభ, మండలి సభా వ్యవహారాల సలహా సంఘాలు విడివిడిగా సమావేశంకానున్నాయి. బీఏసీ భేటీల్లో బడ్జెట్ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు. పనిదినాలు, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. మొత్తంగా పది రోజుల పాటు సమావేశాలు జరగవచ్చని సమాచారం.

వాడివేడిగా జరిగే అవకాశం...

రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, భాజపాలు ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలను ప్రస్తావించి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమయ్యాయి. అటు పాలకపక్షం సైతం విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. వారి విమర్శలను తిప్పికొట్టడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను సభ ద్వారా అందరికీ వివరించేందుకు సిద్ధమైంది. రైతుల సమస్యలు, ధాన్యం సేకరణ, సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాలు, ఆర్థికపరమైన అంశాలు, కేంద్రం నుంచి నిధులు, విభజన చట్టం హామీలు, ఉద్యోగ నియామకాలు, హామీల అమలు తదితర అంశాలు ఈ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఛైర్మన్లు ఎన్నిక...

అటు మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక అంశం ఆసక్తి రేపుతోంది. గత సమావేశాలను ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డితోనే నిర్వహించారు. ఆయన పదవీకాలం పూర్తి కావడం వల్ల జాఫ్రీని మరో ప్రొటెం ఛైర్మన్​గా నియమించారు. ఆయన నియామకం సమయంలోనే గవర్నర్ అభ్యంతరం చెప్పారు. ప్రస్తుతం సభ సమావేశమవుతున్న నేపథ్యంలో మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక చేపడతారా... లేదా... అన్న విషయం తేలాల్సి ఉంది. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తే మండలికి చీఫ్ విప్​తో పాటు మరికొందరు విప్‌లను కూడా నియమించే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.