ETV Bharat / state

'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'

author img

By

Published : Jul 19, 2020, 9:14 AM IST

కొవిడ్ ఆస్పత్రిలో తనువు చాలించిన వ్యక్తి మృతదేహం తరలింపు దృశ్యాలు హృదయాలను కలచివేశాయి. అందరూ ఉన్నా అనాథ శవంలా అంత్యక్రియలు నిర్వహించారు. పగిలిన గుండెలు, చెదిరిన మనసులతో కుటుంబ సభ్యులు నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

tearful-scenes-at-funeral-of-corona-bodies
'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'

కడసారి చూపులు లేవు. అంతిమ సంస్కారాలూ లేవు. బంధాలూ హోదాలూ అన్నీ వ్యర్థమే. అయిన వారు చూస్తుండగానే, అంబులెన్సులో అనాథశవంగా తరలిపోవాల్సిన విషాదం. పచ్చని కుటుంబాల్లో కల్లోలం రేపుతూ, కరోనా మహమ్మారి లిఖిస్తున్న విషాద చిత్రమిది. కరోనా కాటుకు కడతేరిపోయిన వారు... అందరూ ఉన్నా అభాగ్యులుగానే కాటికి చేరాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. భార్యాబిడ్డలు, ఆత్మీయులకు చివరి చూపైనా దక్కడం కష్టంగా మారింది. ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కొవిడ్ ఆస్పత్రిలో తనువు చాలించిన వ్యక్తి మృతదేహం తరలింపు దృశ్యాలే దీనికి నిదర్శనం.

రాజానగరంలో ఉన్న జిల్లా కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలిన వ్యక్తి మృతదేహం తరలింపునకు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా చివరి చూపు కోసం భార్యాబిడ్డలు పరితపించారు. దగ్గరికి వెళ్లేందుకు అవకాశం లేని పరిస్థితుల్లో కనీసం ఒక్కసారి చూపించమంటూ ప్రాధేయపడ్డారు. సిబ్బంది సహకారంతో కొన్ని క్షణాల పాటే దూరం నుంచి చూసుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. భార్యాబిడ్డల ఎదుటే అనాథశవంలా మిగిలిన ఆ అభాగ్యుడిని సిబ్బంది అంబులెన్సులో అక్కడి నుంచి తరలించారు. పగిలిన గుండెలు, చెదిరిన మనసులతో కుటుంబ సభ్యులు నిస్సహాయులుగా మిగిలిపోయారు.

ఇదీ చదవండి: మాఫీ అయితేనే.. మంజూరు చేస్తరట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.