ETV Bharat / state

ఒడిసి పడితే వాననీరు.. అడుగంటదు ఏ బోరు

author img

By

Published : Sep 19, 2020, 7:38 AM IST

భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ఇంకుడు గుంతల ఏర్పాటుతో ఏటా ఎండాకాలం ఎదురయ్యే నీటి సమస్యకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇప్పటికే పలు కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేశారు. ఇదే విధంగా అడుగులు వేయగలిగితే లక్షల రూపాయలు కుమ్మరించి నీటిని కొనుగోలు చేసే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

awareness to store water to get rid of water problem
ఒడిసి పడితే వాననీరు.. అడుగంటదు ఏ బోరు

భారీ వర్షాలతో అంతటా జలమయం.. వేసవి వచ్చిందంటే మళ్లీ నీటి ఎద్దడి.. ఇటువంటి దుస్థితి నుంచి బయటపడేందుకు ఒక్కటే మార్గం. భూగర్భ జలాలను కాపాడుకోవాలి. ఇంకుడు గుంతల ఏర్పాటుతో ఏటా ఎండాకాలం ఎదురయ్యే నీటి సమస్యకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇప్పటికే పలు కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేశారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే విధంగా అడుగులు వేయగలిగితే లక్షల రూపాయలు కుమ్మరించి నీటిని కొనుగోలు చేసే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

ట్యాంకర్లు కావాలి

ఏటా ఎండాకాలం గ్రేటర్‌ వ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటుతుంటాయి. ఆ సమయంలో కొత్తబోరు కోసం 1000-1500 అడుగుల లోపలకు వెళ్లినా నీటి జాడ కష్టతరమవుతోంది. ఏటేటా నీటి సమస్య సవాల్‌ విసురుతోంది. సాధారణ రోజుల్లో వందల్లో జలమండలికి ఫోన్‌కాల్స్‌ వస్తాయి. వేసవిలో 4-5 వేల కాల్స్‌ వరకూ ట్యాంకర్లు కావాలంటూ అడుగుతుంటారు.

ఎండిపోకుండా చేయవచ్చు

మహానగరంలో మార్చి ప్రారంభం నుంచే చాలా అపార్ట్‌మెంట్లలో నీటికోసం గొడవలు మొదలవుతాయి. అదనంగా వందలాది రూపాయలు ట్యాంకర్ల నీటి కోసం వసూలు చేస్తుంటారు. వేసవిలో కూడా బోరులో పుష్కలంగా నీళ్లు ఉండేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న/ ఇప్పటికే ఎండిపోయిన బోరు చుట్టూ ఇంజక్షన్‌ వెల్‌ నిర్మించి అందులోకి వర్షపు నీటిని మళ్లించాలి. తద్వారా బోరును ఎండిపోకుండా చూసుకోవచ్ఛు ఇప్పటికే నగరంలో చాలా అపార్ట్‌మెంట్లలో ఇలాంటి విధానం పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందారు. సాధారణ వర్షపాతం కురిస్తే 100 చదరపు మీటర్ల పై కప్పుపై దాదాపు రెండు వేల లీటర్ల నీళ్లు చేరుతాయి. ఈ మొత్తం నీటిని ఒడిసి పట్టి ఈ ఇంజక్షన్‌ వెల్‌లోకి పంపిస్తే బోరు బావి ఏ కాలంలో కూడా ఇంకే పరిస్థితే తలెత్తదు.

ఇలా చేయాలి

  • తొలుత పనిచేస్తున్న లేదంటే ఇంకిపోయిన బోరు బావికి కొద్ది దూరంలో సమాంతరంగా 60 మీటర్ల లోతులో ఒక బోరు తవ్వాలి. బోరు బావి కూలిపోకుండా దానిలోకి 6 నుంచి 10 మీటర్ల లోతు వరకు పీవీసీ పైపును చొప్పించాలి.
  • ఆ బోరు చుట్టూ రెండు మీటర్ల వెడల్పు, రెండు మీటర్లు పొడవుతో చుట్టూ ఒక కందకం తవ్వాలి. గుంత అడుగు భాగం నుంచి ఒక మీటరుపై వరకు ఆ పీవీసీ పైపునకు చుట్టూ 10 మిల్లీమీటర్ల నుంచి 20 మిల్లీమీటర్ల పరిమాణం వరకు చిన్న రంధ్రాలు చేయాలి. అవి ఉన్న ప్రాంతాన్ని ఒక స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ జాలితో చుట్టాలి.
  • గుంత సగభాగం వరకు 40 మిల్లిమీటర్ల పరిమాణం గల కంకరతో నింపాలి. ఆపైన పావు వంతు భాగం 20 మిల్లీమీటరు పరిమాణం గల కంకర వేయాలి. కందకం చుట్టూ ఇటుకతో గోడను నిర్మించాలి.
  • గోడలోపల సగం వరకు దొడ్డు ఇసుకతో నింపి మిగిలిన సగభాగాన్ని ఖాళీగా ఉంచాలి. ఇంటి పై కప్పు నుంచి వర్షపు నీటి గొట్టాన్ని ఈ గుంతలోకి పంపాలి. వర్షం పడినప్పుడల్లా వర్షపు నీరు పైపు ద్వారా ఈ గుంతలోకి చేరి బోరు రీఛార్జ్‌ అవుతుంది.
  • ఇంజక్షన్‌ వెల్‌ నిర్మించలేక పోయినట్లయితే అపార్ట్‌మెంట్‌ చుట్టూ తప్పనిసరిగా ఇంకుడు గుంతలు శాస్త్రీయబద్ధంగా ఏర్పాటు చేయాలి. టెర్రస్‌పై పడే వర్షపు నీటిని ఇలా ఇంకుడు గుంతల్లోకి మళ్లించడం ద్వారా భారీగా వర్షపు నీటిని ఒడిసిపట్టవచ్ఛు

ఏటా 15 టీఎంసీలు

ఒక అంచనా ప్రకారం హెచ్‌ఎండీఏ పరిధిలో ఏటా 15 టీఎంసీల వర్షం పడుతోంది. ఏటా గ్రేటర్‌ నీటి వాడటం 30 టీఎంసీలు వరకు ఉంది. అంటే వర్షపు నీటిని ఒడిసి పట్టడం ద్వారా నగరంలో సగం నీటి అవసరాలు తీరినట్లే. ఆ దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే నీటి కొరత ఎదురయ్యే పరిస్థితి తలెత్తదు.

ఇదీ చూడండి: మనుషులకే కాదు.. శునకాలకూ ఓ 'బ్లడ్ బ్యాంక్'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.