ETV Bharat / state

niranjan reddy: వానాకాలం సాగు పురోగతిపై మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్ష

author img

By

Published : Aug 24, 2021, 10:52 PM IST

రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో పత్తి సాగు విస్తీర్ణం తగ్గి.. వరి సాగు 55 లక్షల ఎకరాలకు పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (minister niranjan reddy) తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్​లోని మంత్రుల నివాస సముదాయంలో వానా కాలం - 2021 పురోగతిపై సమీక్షించారు.

niranjan reddy
niranjan reddy

రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడం వల్ల పత్తి సాగు విస్తీర్ణం తగ్గి... వరి పంట సాగు 55 లక్షల ఎకరాలకు పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో వానాకాలం - 2021 పురోగతిపై మంత్రి సమీక్షించారు (minister niranjan reddy review). రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తాజా ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంట సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి అంచనా, కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ, రవాణా, మిల్లింగ్, గోదాముల సన్నద్ధత, ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎకరానికి సరాసరి 27 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాల మేరకు కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేసినట్లు వ్యవసాయ శాఖ... మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. వానాకాలం ఉత్పత్తిలో ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐ అంగీకరించిన దృష్ట్యా... మరో 15 నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని మంత్రి తెలిపారు.

రాష్ట్ర అవసరాల అంచనా..

ఇతర రాష్ట్రాలకు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వెళ్తుందని అంచనా వేయగా... రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల ఆహార అవసరాల నిమిత్తం ఏడాదికి సరాసరి వినియోగించే బియ్యం 56 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేసినట్లు చెప్పారు. అందుకోసం 83.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ధాన్యం సేకరించే కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వరి పంట ఉత్పత్తి పెరుగుతూ వస్తుందని... పంజాబ్‌లో పెద్ద ఎత్తున వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నా స్థానికంగా వినియోగం లేదని అన్నారు.

ధాన్యం నిల్వలు ఖాళీ చేసుకోండి..

వానాకాలం ధాన్యం ఉత్పత్తులు చేతికొచ్చే సమయానికి రాష్ట్రంలో ఇప్పటికే నిల్వ ఉన్న గత యాసంగి ధాన్యం నిల్వలు ఖాళీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎఫ్‌సీఐకి సూచించారు. ఇబ్బందులు రాకుండా అవసరమైతే ఉత్తర భారతదేశం మాదిరిగా బహిరంగ ప్రదేశాల్లో ధాన్యం స్టోరేజికి గల అవకాశాలు పౌరసరఫరాల శాఖ పరిశీలించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ అనిల్ కుమార్, స్పెషల్ కమిషనర్ హన్మంత్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి, ఎఫ్‌సీఐ జీఎం దీపక్ శర్మ, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Niranjan reddy: 'డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి'.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.