ETV Bharat / state

Over Speed: హైదరాబాద్​ రోడ్లపై స్పోర్ట్స్​ బైక్​ల జోరు.. రెట్టింపు వేగంతో..!

author img

By

Published : Sep 12, 2021, 7:56 AM IST

స్పోర్ట్స్​ బైక్స్(SPORTS BIKES)​ అంటే యువతకు చాలా క్రేజ్​. హై స్పీడ్​తో మజా చేస్తూ ఖాళీగా ఉన్న రోడ్లపై రేస్​ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఆ ఆశ హద్దు దాటి.. జనారణ్యంలోకి ప్రవేశించింది. పట్టణాలు, నగరాల్లో పరిమిత వేగంతోనే వాహనాలు నడపాలి. కానీ అంత ఖరీదు పెట్టి కొన్న బండితో మామూలు స్పీడ్​తో వెళ్తే ఏం థ్రిల్​ వస్తుంది అనుకుంటారో ఏమో.. రోడ్డుపై ఎన్ని వాహనాలు వెళ్తున్నా.. అతివేగంతో దూసుకెళ్తున్నారు. దాని ఫలితంగా ఎన్నో పర్యవసానాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్​ మహానగరంలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి అంటున్నారు రవాణా శాఖ అధికారులు. వాటిపై ఈటీవీ భారత్​ అధ్యయనం.

Sports bikes are traveling at double speed on the Hyderabad roads
హైదరాబాద్​లో స్పోర్ట్స్​ బైక్​లు

రాజధాని రోడ్లపై ద్విచక్ర వాహనాలు 50 కి.మీ. వేగానికి మించి తిరగకూడదు. కానీ...ఇంజిన్‌ ఆన్‌ చేసిన నాలుగు సెకన్లకే వంద కి.మీ., ఎనిమిది సెకన్లకు 200 కి.మీ. వేగంతో పరుగెత్తే బైకులు మహానగరంలో వందల సంఖ్యలో ఉన్నాయి. స్పోర్ట్స్‌ ద్విచక్రవాహనాల(SPORTS BIKES) ఖరీదు కనిష్ఠంగా రూ.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.1.10 కోట్ల వరకు ఉందని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పరిధిలో స్పోర్ట్స్‌ బైక్‌ల కొనుగోళ్లు ఇతరత్రా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వ్యవహారాలను ‘ఈనాడు- ఈటీవీ భారత్’ పరిశీలించినపుడు అనేక విషయాలు వెలుగులోనికి వచ్చాయి.

కొనేది ముంబయిలో.. రిజిస్ట్రేషన్‌ ఇక్కడ

కేంద్ర మోటారు వాహనాల నిబంధనల ప్రకారం దేశంలో, విదేశాల్లో తయారైన ద్విచక్ర మోటారు వాహనాలకు ముందుగా కేంద్రం ఆమోదించిన టెస్టింగ్‌ సెంటర్‌ నుంచి అనుమతి తీసుకోవాలి. అక్కడి నుంచి అనుమతి వస్తే అధిక ఇంజిన్‌ అశ్విక సామర్థ్యం (హార్స్‌పవర్‌) గల స్పోర్ట్స్‌ ద్విచక్ర వాహనాలను నియంత్రించే అధికారం రవాణాశాఖకు లేదు. అయితే వాహన ఖరీదులో తొమ్మిది శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జిగా వసూలు చేస్తారు. ఒకరి పేరుతో మరో వాహనం కూడా ఉంటే 14 శాతం పన్ను చెల్లించాలి. రాజధాని పరిధిలో స్పోర్ట్స్‌ బైక్‌ల వినియోగం బాగా పెరిగింది. కరోనా సమయంలో వీటి కొనుగోళ్లు తగ్గడంతో విదేశీ బైక్‌ల విక్రయ సంస్థలు హైదరాబాద్‌లో షోరూంలను మూసివేశాయి. చాలా స్పోర్ట్స్‌ బైక్‌లను అనేక మంది ముంబయిలో కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ఖరీదైన కార్లు, బైక్‌లను కొనడం సంపన్న వర్గాల పిల్లలకు ఫ్యాషన్‌గా మారింది. ఇటీవల ఓ సినీనటుడు రూ.5 కోట్ల ఖరీదైన కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారును చూసి మోజుపడిన మరో నటుడు ఇదే కారును నెలల వ్యవధిలో కొన్నారు. కొంతమంది సినీనటులు, ప్రముఖుల ఇళ్లలో ఖరీదైన స్పోర్ట్స్‌ బైక్‌లు రెండు నుంచి ఆరు వరకు ఉన్నాయని రవాణా అధికారులు చెబుతున్నారు.

రెప్పపాటులో రయ్‌మంటూ..

మహానగరంలో ట్యాంక్‌బండ్‌తో పాటు అన్ని ఫ్లైఓవర్ల మీద వాహనాల గరిష్ఠ వేగం 40కి.మీ. మిగిలిన రోడ్లపై 50 కి.మీ. మాత్రమే. పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే మీద మాత్రం 80 కి.మీ. వేగంతో వెళ్లొచ్చు. ఓఆర్‌ఆర్‌ మీద వంద కి.మీ. వేగంగా నిర్ణయించారు. ఇదే సమయంలో నగరంలోని అన్ని రోడ్ల మీద బైకుల గరిష్ఠ వేగం 50 కి.మీ. కానీ స్పోర్ట్స్‌ వాహనాల కనీస వేగం వంద కి.మీ.గా ఉందని చెబుతున్నారు. వీటి ఇంజిన్‌ హార్స్‌పవర్‌ 600 - 1,200 సీసీ వరకు ఉంటోంది. నగర రోడ్ల పరిస్థితికి.. స్పోర్ట్స్‌ వాహనాల అతి వేగానికి లంకె కుదరడం లేదు. ప్రమాద సమయంలో సాయిధరమ్‌ తేజ్‌(SAI DHARAM TEJ) బైక్‌ వేగం కూడా 76 కి.మీ.వరకు ఉందని పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా స్పోర్ట్స్‌ వాహనం నడిపే కుర్రకారు రోడ్డు బాగుంటే 100 కి.మీ. కంటే అధిక వేగంతో నడుపుతున్నారు. చలానాలను విధిస్తున్నా వీరిలో మార్పు లేదు. గతంలో నటుడు బాబూమోహన్‌ కుమారుడు పవన్‌, కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్‌, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కుమారుడు అయాజుద్దీన్‌లు కూడా అతివేగం కారణంగానే మృతిచెందారు.

ఇదీ చదవండి: NEET EXAM: నేడే నీట్​ 2021 పరీక్ష.. ఫాలో కావాల్సిన రూల్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.