ETV Bharat / state

గేరు మార్చిన కారు.. భాజపాను బలహీనపర్చేందుకు తెరాస వ్యూహం

author img

By

Published : Jul 1, 2022, 9:11 AM IST

special story on trs new strategy
కారు.. మార్చింది గేరు

trs new strategy: రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. భాజపాను బలహీనపర్చేందుకు తెరాస ప్రణాళికలు చేస్తోంది. ఇందులో భాగంగా భాజపాకు చెందిన నలుగురు కార్పొరేటర్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గురువారం తెరాసలో చేరారు. మరింతమంది కార్పొరేటర్లను చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

trs new strategy: రాజధానిలో మరింత పట్టుకోసం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దృష్టిసారించింది. క్షేత్రస్థాయిలో మరింత బలపడటానికి ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడంపై కారు పార్టీ నేతలు ప్రణాళికను రూపొందించారు. హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో అనేక డివిజన్లను కైవసం చేసుకున్న భాజపాను బలహీనపర్చేందుకు తెరాస అగ్రనేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా భాజపాకు చెందిన నలుగురు కార్పొరేటర్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గురువారం తెరాసలో చేరారు. మరింతమంది కార్పొరేటర్లను చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. దీనివల్ల క్షేత్రస్థాయిలో భాజపా బలహీనపడుతుందన్న భావనలో తెరాస వర్గాలు ఉన్నాయి.

మరికొంత మందితో మంతనాలు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైన భాజపా తరువాత జరిగిన బల్దియా ఎన్నికల్లో సత్తా చాటింది. మొత్తం 150 డివిజన్లు ఉంటే తెరాస 56 చోట్ల, భాజపా 48 చోట్ల, ఎంఐఎం 44 చోట్ల, కాంగ్రెస్‌ రెండుచోట్ల గెలుపొందాయి. భాజపా లింగోజిగూడ కార్పొరేటర్‌ మరణించడంతో అక్కడ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందారు. తెరాస తరఫున గెలుపొందిన ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌ బలం పెరిగింది.
గురువారం కేటీఆర్‌ సమక్షంలో భాజపా కార్పొరేటర్లు సుజాతనాయక్‌, అర్చనా ప్రకాష్‌, వెంకటేష్‌, సునీతా ప్రకాశ్‌గౌడ్‌ తెరాసలో చేరారు. దీంతో తెరాస బలం 60కు చేరింది. భాజపా బలం 43కు తగ్గింది. ఈ నెల 2, 3 తేదీల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు నగరంలో జరగనున్నాయి. ఇందులో భాగంలో 3వ తేదీన లక్షలమంది జనంతో పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు అనేకమంది అగ్రనేతలు పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఈ ఉత్సాహానికి బ్రేక్‌ వేయాలన్న ఉద్దేశంలో తెరాస నేతలు ఉన్నారని చెబుతున్నారు. నలుగురు భాజపా కార్పొరేటర్లు తెరాసలో చేరడానికి నెల కిందటే అంగీకరించారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. సరైన సమయం కోసం ఎదురుచూసి.. చేరికలకు ముహూర్తంగా గురువారం నిర్ణయించారు. మరికొంతమంది భాజపా కార్పొరేటర్లతో తెరాస నాయకులు మంతనాలు చేస్తున్నారని తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.