ETV Bharat / state

నూతన చట్టంతో.. వినియోగదారులకు మరింత బాసట..

author img

By

Published : Oct 7, 2020, 2:13 PM IST

special story on revised  new Consumer Protection Bill
నూతన చట్టంతో.. వినియోగదారులకు మరింత బాసట..

నూతనంగా అమల్లోకి వచ్చిన వినియోగదారుల పరిరక్షణ చట్టంతో వస్తు సేవల రంగంలో జరిగే నాణ్యతా లోపాలకు వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు, ఉత్పత్తిదారులు ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే. వినియోగదారులకు అందించే సేవల్లో లోపాలు కలిగిస్తున్న వ్యాపార సంస్థలకు చురకలు అందించేలా కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. మధ్యవర్తిత్వం, ఉత్పత్తి బాధ్యత, తయారీదారులకు శిక్షలు, కల్తీ వస్తువుల అమ్మకంలాంటి విషయాల్లో పొందుపరిచిన నిబంధనలు వినియోగదారుడిని మరింత బలవంతున్ని చేస్తున్నాయి. కొత్త చట్టంలో పొందుపరిచిన అంశాల ద్వారా వినియోగదారుల కమిషన్లకు విస్తృత అధికారాలు లభించనున్నాయి.

వినియోగదారులు వారు కొన్న వస్తువుల వల్ల వారికి నష్టం కలిగితే.. ఆ వస్తువులను తయారు చేసిన కంపెనీ లేదా డీలర్ లేదా డిస్ట్రిబ్యూటర్ లేదా అమ్మకందారులకు గరిష్ఠంగా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుంది. లేదా ఒక లక్ష జరిమానా విధిస్తారు. కొత్త చట్టంలో ఈ- కామర్స్ సంస్థలను చేరుస్తూ వినియోగదారుడికి మరో 4 హక్కులను కల్పించారు. నాణ్యతలేని వస్తువుల విషయంలో ఆరు నెలల జైలు శిక్ష విధించే అధికారం జిల్లా వినియోగదారుల కమిషన్లకు ఉంది.

వారం రోజుల్లోనే సమస్యకు పరిష్కారం

సత్వర పరిష్కారానికి మీడియా సెల్​ను ఏర్పాటు చేసే అధికారం జిల్లా కమిషన్లకు వచ్చింది. వినియోగదారులు, ప్రతివాదులు విచారణకు ముందుగానే సమస్యలను ఇక్కడ పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుంది. మీడియెషన్ సెల్ ద్వారా కేవలం వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించుకోవచ్చు. గడువులోగా పరిష్కారం కాకపోతే యథావిధిగా బెంచ్ విచారణ చేపడుతుంది. ఇందులో తీవ్రత ఉండే కేసులు (వైద్యం, సైబర్, బ్యాంకు మోసాలు) మీడియేషన్ సెల్​లో పరిష్కరించుకునే వీలు లేదు. ఈ క్లాజ్​ను అడ్డుపెట్టుకుని చాలా మంది వినియోగదారుల కమిషన్ పరిధికి తాము రామంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

బిల్లులు ఉంటేనే పరిహారం లభిస్తుంది..

వినియోగదారుడు తమ హక్కులను పరిరక్షించుకునేందుకు కొనుగోలు సమయంలో కొన్ని విధిగా గుర్తుపెట్టుకోవాలని కొత్త చట్టం చెబుతోంది. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు కొనుగోలు దారులు విధిగా బిల్లు తీసుకోవాలి. గ్యారెంటీ, వారేంటీ బిల్లులను భద్రపరుచుకోవాలి. ఐఎస్ఐ, అగ్ మార్క్, హాల్ మార్క్ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి. డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ప్రకటనలతో మోసపోవద్దు. వస్తువు తయారీ తేదీ గడువు తేదీ ధర తదితర వివరాలను సరి చూసుకున్న తర్వాత వస్తువులను కొనుగోలు చేయాలి.

మోసపోయినప్పుడు వెంటనే వినియోగదారుల సేవా కేంద్రాల ద్వారా సరైన సమాచారం తెలుసుకొని ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చు. కొత్త చట్టం ప్రకారం నాసిరకం విత్తనాలను అమ్మిన విక్రేతలపై ఫిర్యాదు చేసి పరిహారం లభిస్తుంది. వినియోగం కన్నా అధికంగా టెలికాం, విద్యుత్ బిల్లులు వస్తే వినియోగదారులు కమిషన్లో ఫిర్యాదు చేసే వెసులుబాటు ఈ చట్టం కలిగిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.