ETV Bharat / state

అమ్మాయిలూ.... ఐఎఫ్‌ఎస్‌... మీరూ చెప్పొచ్చు ఎస్‌!

author img

By

Published : Nov 11, 2020, 12:02 PM IST

దట్టమైన అడవుల్లో తిరగాలి... శారీరక శ్రమ ఎక్కువ! ఇంకో ప్రయత్నం చేస్తే ఐపీఎస్‌ కొట్టేస్తావ్‌ అంటూ చాలా మంది సలహాలు ఇచ్చారు. అయినా తనకిష్టమైన ఐఎఫ్‌ఎస్‌ (ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌) శిక్షణని ఎన్నో సవాళ్ల మధ్య పూర్తిచేసుకుంది మహారాష్ట్ర క్యాడర్‌కి చెందిన శ్వేతా బొడ్ఢు శిక్షణలో తాను చేసిన సాహసాలని ట్విటర్‌లో పోస్టుచేయడంతో అవి వైరల్‌గా మారి ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. ఈ సందర్భంగా ఆమెతో ‘వసుంధర‘ మాట్లాడింది..

special chichat with IFS Shweta Boddu
అమ్మాయిలూ.... ఐఎఫ్‌ఎస్‌... మీరూ చెప్పొచ్చు ఎస్‌!

సివిల్‌ సర్వీసులని సాధించాలని యువత ఎన్నెన్నో కలలు కంటుంది. నేనూ అలానే నా కలని నిజం చేసుకున్నాను. ప్రస్తుతం నాసిక్‌లో ఐఎఫ్‌ఎస్‌ ప్రొబేషనరీ ఆఫీసరుగా పనిచేస్తున్నా. సర్వీసులో చేరినప్పుడు కన్నా.. శిక్షణ సమయంలోనే ఈ ఉద్యోగంతో ఎక్కువగా ప్రేమలో పడ్ఢా నేను ఇటు వెళ్లాలనుకుంటున్నానన్న విషయం తెలిసి... చాలామంది ‘కొండలూ, గుట్టలూ ఎక్కాలి. దట్టమైన అడవుల్లో తిరగాలి. విపరీతమైన శారీరక శ్రమ ఉంటుంది. ఇవన్నీ ఎందుక్కానీ ఇంకోసారి ప్రయత్నించి వేరే సర్వీస్‌కి వెళ్లిపో’ అంటూ సలహా ఇచ్చారు. నాకు మాత్రం చేస్తే ఫారెస్ట్‌ సర్వీసే చేయాలని బలంగా అనిపించింది. 2018లో శిక్షణలో చేరా. మా బ్యాచ్‌లో 72 మంది అబ్బాయిలు ఉంటే...ఎనిమిది మంది మాత్రమే అమ్మాయిలం. ఒక్కసారి ఇష్టం ఏర్పడితే... అది ఏ రంగమైనా హద్దుల్లేకుండా దూసుకుపోవచ్చనడానికి నేనే ఉదాహరణ. ఇక్కడిచ్చే కఠోర శిక్షణ, సాహసాలు నాకు సవాలుగా అనిపించాయి. అందుకే ఈ నా ప్రయాణంలో ఎదురైన సందర్భాలను తోటి అమ్మాయిలతో పంచుకోవాలని అనుకున్నాను. ‘అమ్మాయిలూ ఒక్కసారి ఇటు చూస్తే మీరూ ఈ రంగాన్ని ఇష్టపడతారు’ అంటూ నా శిక్షణ సమయంలో తీసుకున్న చిత్రాలు కొన్నింటిని ట్విటర్‌లో పోస్ట్‌ చేశా. నేను ఊహించలేదు అవి అంతగా వైరల్‌ అవుతాయని. వేలల్లో రీట్వీట్‌లు చేశారు. ‘మీలాగే మేమూ ఈ రంగాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాం’ అంటూ చాలామంది ఆడపిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లలో వందలాది మెసేజ్‌లు పంపిస్తున్నారు.

అమ్మ కోసం వచ్చేశా... అన్నీ మనం ఊహించినట్లు జరగకపోవడమే జీవితం. చేస్తున్న కార్పొరేట్‌ ఉద్యోగాన్ని కాదనుకుని ఇటువైపు రావడానికి కారణం అమ్మ. మాది వైజాగ్‌. ఇంటర్మీడియట్‌ వరకూ అక్కడే చదువుకున్నా. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ పూర్తి చేశా. ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో ఇదీ ఒక భాగం. అదయ్యాక ఓ కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరా. రెండు మూడు నెలలు గడిచాయో లేదో అమ్మకి క్యాన్సర్‌ అని తెలిసింది. తన చికిత్స కోసం ఉద్యోగం వదులుకుని ఇంటికి తిరిగి వచ్చేశా. తరువాత కార్పొరేట్‌ రంగంలోకి వెళ్లాలని అనుకోలేదు. ఇంటిపట్టునే ఉండి సివిల్స్‌కి ప్రిపేర్‌ అవడం ప్రారంభించా. దిల్లీ వెళ్లి కొన్నాళ్లు కోచింగ్‌ తీసుకున్నా. అమ్మకు వ్యాధి తిరగబెట్టడంతో మధ్యలోనే తిరిగి వచ్చేశా. ఓ పక్క తనని చూసుకుంటూనే చదువుకున్నా. చివరికి సివిల్స్‌లో ర్యాంకు సాధించా. మావారు ఆనంద్‌రెడ్డి కూడా ఐఎఫ్‌ఎస్‌నే. ఆయనది సిద్ధిపేట. మాకు ముందే పరిచయం ఉంది. ఇద్దరం కలిసి పరీక్షలకు సిద్ధమయ్యాం. ఎలా చదవాలి.. ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి? వంటివి చర్చించుకునేవాళ్లం. తన ప్రోత్సాహం వల్లే సివిల్స్‌ సాధించగలిగా.

ఇన్వెస్టిగేషన్‌ చేస్తాం... ఈ ఉద్యోగానికి ముందు సీఏపీఎఫ్‌ సర్వీస్‌లో గ్రేడ్‌-ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ పడితే దరఖాస్తు చేశా. ప్రిలిమ్స్‌, రాతపరీక్షల్లో అర్హత సాధించినా... 800 మీటర్ల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పరుగెత్తలేక ఆ ఉద్యోగాన్ని కోల్పోయాను. కానీ ఇప్పుడు.. ఆ పరుగు నాకు లెక్కేకాదు. బంగీ జంప్‌లు, స్కూబా డైవింగ్‌లు, గుర్రపు స్వారీ, రైఫిల్‌ షూటింగ్‌, రోజుల తరబడి కొండ కోనల్లో ట్రెక్కింగ్‌... లాంటివెన్నో సునాయాసంగా చేసేస్తున్నా. ఇవే కాదు...మా శిక్షణలో భాగంగా దేశంలో 65 నగరాలు, మరో రెండు దేశాలు చుట్టేశా. చాలామంది అడుగుతుంటారు మీ వృత్తి ఎలా ఉంటుందీ అని.. మేం కూడా ఐపీఎస్‌ల మాదిరిగా క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్లు చేస్తాం. ఛార్జిషీట్లు రాస్తాం. ఐఏఎస్‌ల్లా అభివృద్ధి పనుల్లోనూ భాగం అవుతాం. ముఖ్యంగా గిరిజన జాతుల రక్షణకు, వారి పురోగతికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. నీటి సంరక్షణ పద్ధతులు, పర్యావరణ పరిరక్షణ వంటివన్నీ మేమే చూస్తాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.