ETV Bharat / state

డేటా చోరీ కేసులో 19 మంది అరెస్ట్.. కేంద్ర హోంశాఖ వద్ద నివేదిక

author img

By

Published : Apr 11, 2023, 10:01 PM IST

data theft case
data theft case

19 People Arrested In Data Theft Case: వ్యక్తిగత వివరాలు బయటికి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై సైబరాబాద్ పోలీసులు అధ్యయనం చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్​తో కలిపి అధ్యయనం చేసిన సైబరాబాద్ పోలీసులు ఓ నివేదికను రూపొందించారు. ఈ రిపోర్టును ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించారు. డేటా చోరీ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై సైబరాబాద్ పోలీసులు విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

19 People Arrested In Data Theft Case: డేటా చోరీ కేసులో ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అధికారులు తెలిపారు. గూగుల్ క్లౌడ్​లో వ్యక్తిగత వివరాలు పెట్టి విక్రయాలు చేస్తున్నారని.. క్లౌడ్​లో వివరాలు పెట్టిన వాళ్ల గురించి చెప్పాలని గూగుల్​కు లేఖ రాసినట్లు వివరించారు. గూగుల్ నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా దర్యాప్తు ముందుకు వెళుతుందని.. ఈ క్రమంలోనే దర్యాప్తులో కాస్త ఆలస్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు.

బిగ్ బాస్కెట్​కు చెందిన 3 కోట్ల మంది ఖాతాదారుల వివరాలు బయటికి వెళ్లాయని.. ఈ మేరకు బిగ్ బాస్కెట్ ప్రతినిధులు సైతం ఒప్పుకున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. పాలసీబజార్ వినియోగదారుల వివరాలు బయటికెళ్లిన విషయాన్ని గుర్తించిన సంస్థ ప్రతినిధులు గతేడాది అక్టోబర్​లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేలిందన్నారు. హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారులకు చెందిన 7.5 జీబీ డేటా బయటికి వెళ్లినట్లు గుర్తించామని.. బ్యాంకు ప్రతినిధులు మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని పేర్కొంది.

హెచ్​డీఎఫ్​సీ ప్రతినిధులు విచారణకు వస్తే దీనికి సంబంధించి మరింత స్పష్టత వస్తుందని సిట్ అధికారులు వ్యాఖ్యానించారు. వ్యక్తిగత వివరాలు కొనుగోలు చేసిన 26 సంస్థలను గుర్తించామని ప్రకటించారు. వ్యక్తిగత వివరాలు కొనుగోలు చేసిన వాళ్లు.. వాటిని మార్కెటింగ్, ప్రచురణ కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఓ వ్యక్తి అయితే ఏకంగా రోజుకు 3 కోట్ల మంది గంపగుత్త సందేశాలు పంపిస్తున్నాడని.. డేటా కొనుగోలు చేసి ఇలాంటి సందేశాలు పంపిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలిందన్నారు. బ్యాంకులు వినియోగదారులకు అందించే సేవలను ఇతర సంస్థలకు అప్పగిస్తున్నాయని.. సదరు సంస్థలకు చెందిన సిబ్బంది నుంచి డేటా చోరీ జరిగినట్లు గుర్తించామని వివరించారు.

డేటా చోరీ చేసే సాఫ్ట్​వేర్లను వినయ్ భరద్వాజ్ ఉపయోగించినట్లు సిట్ అధికారులు తేల్చారు. ఈ సాప్ట్​వేర్​ను పెరూ, నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు వినయ్ భరద్వాజ్ విక్రయించినట్లు గుర్తించారు. వ్యక్తిగత వివరాలు చోరీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని విషయాలపై సైబరాబాద్ పోలీసులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్​తో కలిపి అధ్యయనం చేశారు. ఓ నివేదిక రూపొందించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించారు. ప్రస్తుతం ఆ నివేదికను హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధులు పరిశీలిస్తున్నారన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉండే అవకాశం ఉంటుందని సిట్ అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.