ETV Bharat / state

SEASONAL FEVERS: ముసురుతో పాటు ముంచుకొస్తున్న సీజనల్ వ్యాధులు

author img

By

Published : Jul 23, 2021, 12:41 PM IST

గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఫలితంగా వీధుల్లో, ఇంటి పరిసరాల్లో నీరు చేరి... ఈగలు, దోమలు పెరిగి వ్యాధి కారకాలుగా మారుతున్నాయి. సీజనల్ మార్పులతో రాష్ట్రంలో వేలాది మంది జ్వరం బారిన పడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా డెంగీ కేసులు ఇటీవల భారీగా నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఓ వైపు కరోనా, మరోవైపు సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న సీజనల్ జ్వరాలు... ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.

seasonal-fevers-increase-in-telangana
ముసురుతోపాటు ముంచుకొస్తున్న సీజనల్ వ్యాధులు

కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. నిత్యం ఆరు నుంచి ఏడు వందల మంది వైరస్ బారిన పడుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో రాష్ట్రం ముసురేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు జ్వరంతో వచ్చే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వర్షాకాలంలో డెంగీ, మలేరియా కేసులు సర్వసాధారణమే అయినా... ఇటీవల డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

ఉస్మానియాకు పెరుగుతున్న భారం

ఒక్క ఫీవర్ ఆస్పత్రిలోనే 102 మంది డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి సుమారు ఐదు వందల వరకు డెంగీ కేసులు నమోదైనట్లు చెబుుతున్నారు. మలేరియా కేసులు కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలిస్తోంది. ఇటీవల తీవ్ర జ్వరంతో ఉస్మానియా ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. ఉస్మానియాకి సాధారణంగా వెయ్యి నుంచి 1200 వరకు ఓపీ ఉంటుంది.. అయితే ఇటీవల మాత్రం ఆ సంఖ్య 1800 వరకు పెరిగినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అటు గాంధీలో సాధారణ వైద్య సేవలు అందుబాటులో లేకపోవటం... అంతకంతకీ సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఉస్మానియాపై భారం పెరుగుతోంది. ఫలితంగా కులీ కుతుబ్ షాహీ భవంతిలో అదనంగా 300 పడకలు ఏర్పాటు చేసినా... అవీ చాలని పరిస్థితి నెలకొందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

దోమల వల్లే వ్యాధులు...

వర్షాకాలంలో రోడ్లు, కాలనీల్లో నీరు నిల్వ ఉండటంతో సాధారణంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తుంటాయి. వీటికి తోడు నాళాలు పొంగటంతో తాగు నీరు కలుషితం అయ్యి ఏటా ఈ సీజన్​లో డయేరియా బారిన పడుతున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు మాస్కులు ధరిస్తున్న విధంగానే సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకునేందుకు ఇళ్లు, ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. బలమైన ఆహారం తీసుకోవటంతోపాటు... కాచి చల్లార్చిన నీటిని తాగటం వల్ల వ్యాధుల బారిన పడకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.

వ్యక్తిగత శుభ్రత, పోషకాహారమే శ్రీరామరక్ష

ఇళ్లు, కార్యాలయాల్లో దోమలు లేకుండా చూసుకోవటంతో పాటు.. వ్యక్తిగత శుభ్రత, మంచి ఆహారమే సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సీజన్​లో జలుబు, జ్వరం వంటివి సర్వ సాధారణమే కాబట్టి వాటిని కొవిడ్​గా భావించి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. వైరస్ లక్షణాలు కనిపిస్తే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: KTR Birthday: 'బొకేలు, కేకులొద్దు.. ఈసారి దివ్యాంగులకు బైకులిస్తా..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.