ETV Bharat / state

వనస్థలిపురంలో శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌

author img

By

Published : Jul 17, 2020, 6:13 AM IST

హైదరాబాద్​ నగర శివారులో అత్యాధునిక హంగులతో శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సన్నద్ధమవుతోంది. రూ.18 కోట్ల అంచనా వ్యయంతో వనస్థలిపురం మహావీర్‌ హరిణ వనస్థలి జింకల పార్కు సమీపంలో 1.2 కి.మీ. పరిధిలో నిర్మించేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాంతం ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధిలోకి ఉండటంతో.. అనుమతులు రాగానే పనులను పట్టాలెక్కించనుంది.

Satellite bus terminal at Vanasthalipuram, hyderabad
వనస్థలిపురంలో శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌

హైదరాబాద్​ ఎల్బీనగర్‌లో ట్రాఫిక్‌ తిప్పలు.. ఎల్బీనగర్‌ బస్టాప్‌ నుంచి నుంచి రోజూ 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణికులు నల్గొండ, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. 600 నుంచి 700 వరకు ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు వెళ్తుంటాయి. ఇక్కడ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల ప్రారంభించిన పైవంతెనపై నుంచి వచ్చే వాహనాలూ బస్సులు ఆగే చోటే దిగుతున్నాయి. దీంతో రద్దీ మరింత పెరిగింది. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఈ సమస్యను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అధునాతన శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ను ప్రతిపాదించారు.

సమస్యలు తలెత్తకుండా.. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు హరిణ వనస్థలి జింకల పార్కుకు సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని అనువైందిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకుని గణేష్‌ విగ్రహాలను తయారు చేసే వారితో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ అధికారులు మాట్లాడి ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించారు. 1.2 కి.మీ. విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి డిజైన్లను రూపొందించారు. వచ్చే నెలలోనే పనులు మొదలు పెట్టాలని భావించారు.

ప్రత్యేకతలివే..

మొత్తం ఆరు బస్‌ బేలు ఉంటాయి. ప్రతిదానిలో ఏసీ, నాన్‌ ఏసీ నిరీక్షణ గదులు. కొవిడ్‌-19 మార్గదర్శకాల ప్రకారం ఏసీ నిరీక్షణ గదిలో 21 మంది, నాన్‌ ఏసీ దాంట్లో 48 మంది కూర్చునేలా ఏర్పాట్లు.

  1. సిటీ బస్సుల కోసం ప్రత్యేకంగా బస్‌బే
  2. ప్రయాణికుల సామర్థ్యం 16,650 మంది (రోజుకు అంచనా)
  3. 490 కిలోవాట్స్‌ సౌర విద్యుత్‌ ఉత్పత్తి
  4. ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం
  5. నీటిని శుద్ధి చేసి పునర్వినియోగించుకునేలా ఎస్టీపీ నిర్మాణం
  6. నాలుగు టాయిలెట్స్‌ బ్లాక్స్‌
  7. ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‌
  8. ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రం, భారీ కెఫెటేరియా
  9. ప్రతి బస్‌బేలో రెండు ఏటీఎంలు, బుక్‌స్టాల్స్‌, ఫుడ్‌ కోర్టులు

ఇవీచూడండి: అధ్యాపకుడితో ఫోన్​లో మాట్లాడిన సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.