ETV Bharat / state

సంక్రాంతి వేళ.. గోదావరి జిల్లాల్లో కోడి పందేల కళ

author img

By

Published : Jan 12, 2023, 9:58 AM IST

Sankranthi Cock Fight
Sankranthi Cock Fight

Sankranti Cock Fights in AP : సంక్రాంతికి పెట్టింది పేరు ఏపీలోని గోదావరి జిల్లాలు. ఈ పండుగలో కోడి పందేలది ప్రత్యేక స్థానం. రైతుల పండుగగా పిలుచుకునే సంక్రాంతికి.. కోడి పందేలు నిర్వహించడం ఈ జిల్లాల్లో సంప్రదాయంగా కొనసాగుతోంది. కోడి పందేలు లేకపోతే.. అసలు సంక్రాంతే సంపూర్ణం కాదు అనేంతగా ఇక్కడ పందేలు జరుగుతాయంటే ఆశ్చర్యం లేదు. ఇంతగా ప్రాచుర్యం పొందిన కోడి పందేల్లో.. కోళ్లు ఎలా ఉంటాయి?వాటి ఆహారం ఏంటి? పందేల కోసం వాటిని ఎలా సిద్ధం చేస్తారో తెలుసుకోవాలనుందా..? అయితే చూద్దాం పదండి.

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి వేళ.. కోడి పందేలతో కళ కళ

Sankranti Cock Fights in AP : సంక్రాంతి పండుగ అంటేనే ముందుగా గుర్తొ‌చ్చేది ఏపీలోని గోదావరి జిల్లాలు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ.. ఈ పండుగ వేళ కోడి పందేలది ప్రత్యేక స్థానంగా చెప్పుకోవాలి. అంతలా ఈ జిల్లాల్లో కోడి పందేలు ప్రాచుర్యం పొందాయి. కోడి పందేలు ఇక్కడ వ్యసనంగా కాకపోయినా, పండుగకు మాత్రం పందెం కోడిని బరిలో దింపాల్సిందే. ఇక్కడ ఏడాది పొడవునా కొందరు కోడి పుంజులను పందేల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తుంటారు.

Sankranti Kodi Pandelu in AP : "ముందుగా పొదిగించిన తర్వాత పిల్లల తీరును బట్టి వాటిని పందేల కోసం ఎంపిక చేసి.. వేరుగా పెంచుతారు. వీటికి ప్రతి రోజూ ప్రత్యేక ఆహారం అందిస్తారు. ఉడకబెట్టిన గుడ్డు, బాదం పిక్కలు, పిస్తా పప్పులు, మటన్, నానబెట్టిన రాగులు, వడ్లు, ఉడకబెట్టిన గుడ్డు, మటన్ ఖైమా లేదా ఉడకబెట్టిన మాంసాన్ని కోళ్లకు ఆహారంగా ఇస్తారు. పందెం కోడిగా ఎంపిక చేసిన నాటి నుంచి బరిలో దింపే వరకు దాదాపు రెండేళ్ల పాటు వీటిని కంటికి రెప్పలా చూసుకుంటారు. ఎండ బాగా తగిలే సమయంలో ఆరు బయట ఉంచుతారు. కాస్త చలిగా ఉన్నా, తేమ వాతావరణం ఉన్నా వీటిని తొట్టెల్లో పెట్టి షెడ్లలో ఉంచేస్తారు. రంగుల విషయానికి వస్తే... పందెం కోళ్లను వాటి రంగు, రూపు ఆధారంగా వాటికి కొన్ని పేర్లు నిర్ణయిస్తారు. కాకి డేగ, కోడి కాకి, పచ్చకాకి, అబ్బరాసు, నెమలి, నెమలి పింగలి.... పలు పేర్లతో వీటిని పిలుస్తుంటారు. వీటిలో నెమలి పింగలి రకం కోడి.... పందేల్లో బాగా రాణిస్తుందనే నమ్మకం పెంపకందారుల్లో ఉంది." -శ్రీనివాసరావు, కోళ్ల పెంపకందారు, ఏలూరు జిల్లా


" పందెం కోళ్లు పెంచే తోటలు, షెడ్లలోకి ఎవరిని పడితే వారిని అనుమతించరు. పందెం కోళ్లకు అనుక్షణం కాపలా ఉండేలా కుక్కలను పెంచుతారు. అంతేకాదు కొన్ని తోటల్లో సీసీ కెమెరాలు సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి... కోళ్ల పెంపకాన్ని పర్యవేక్షిస్తుంటారు. కోడి పందేలు వేయాలంటే... కచ్చితంగా ఆ కోడి నిర్ణీత బరువు ఉండాల్సిందే. అందుకోసం కోళ్లను నాలుగు నుంచి నాలుగున్నర కేజీల మధ్య ఉండేలా అవసరమైతే బరువు పెంచే ఆహారం అందివ్వడం... లేదంటే బరువు తగ్గించే కసరత్తులు చేయిస్తారు. పందెంలో దిగిన కోడి చివరి వరకు పోరాడేలా.... దెబ్బతిన్నా తిరిగి ఎగిరి దెబ్బ కొట్టేంత కండ బలం వచ్చేలా వీటికి తర్ఫీదునిస్తారు. ఇలా పెంచిన పందెం కోళ్ల ధర సుమారు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఇక పండుగ సమయంలో ఐతే దీనికి రెండు, మూడు రెట్లు అధికంగా ఉంటుందని చెబుతున్నారు నిర్వాహకులు." - ఫణి, కోళ్ల పెంపకందారు, ఏలూరు జిల్లా

కోడి పందేలను ప్రోత్సహించడం, దాని ద్వారా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కాకుండా, పండుగ రోజులు సరదాగా గడపాలనే ఉద్దేశంతోనే కోళ్లను తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో షెడ్డులో దాదాపు 100 నుంచి 200 వరకు పందెం కోళ్లను సిద్ధం చేస్తుంటారు. ఏలూరు జిల్లా దెందులూరు, పెదపాడు, పెదవేగి మండలాల్లో దాదాపు 40కుపైనే ఇలాంటి షెడ్లు ఉండగా, వాటిలో పందెం కోళ్లను సిద్ధం చేస్తున్నారు. వీటిలో 5 నుంచి 10 కోళ్లను నిర్వాహకులు తమ సొంత పందేల కోసం ఉంచుకోగా, మిగిలిన కోళ్లను అమ్మకానికి ఉంచుతారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో కోళ్లను పందేల కోసం నిర్వాహకులు విక్రయించారు.


ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.