ETV Bharat / state

Covid Cases: పండగవేళ విజృంభిస్తున్న వైరస్... ఆస్పత్రుల్లో పెరుగుతున్న చేరికలు

author img

By

Published : Jan 15, 2022, 8:37 AM IST

Covid Cases in AP: ఏపీలో కొవిడ్‌ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. కేసుల ఉద్ధృతికి తగ్గట్టే ఆస్పత్రుల్లో చేరుతున్న వారూ పెరుగుతున్నారు. పండగ సమయంలో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ స్వీయరక్షణ పాటించాల్సిన అవసరాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తోంది. గతంలో డెల్టా వైరస్‌ ఊపిరితిత్తులపై ప్రభావం చూపి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో పోలిస్తే ఒమిక్రాన్‌ తీవ్రత కాస్త   తక్కువగా ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరణాలు తక్కువగా నమోదవడం ఉపశమనాన్నిస్తోంది.

Covid Cases
విజృంభిస్తున్న వైరస్

Covid Cases in AP: సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్న తరుణంలో కొవిడ్‌ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. కేసుల ఉద్ధృతికి తగ్గట్టే ఆస్పత్రుల్లో చేరుతున్న వారూ పెరుగుతున్నారు. పండగ సమయంలో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ స్వీయరక్షణ పాటించాల్సిన అవసరాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తోంది. గతంలో డెల్టా వైరస్‌ ఊపిరితిత్తులపై ప్రభావం చూపి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో పోలిస్తే ఒమిక్రాన్‌ తీవ్రత కాస్త తక్కువగా ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరణాలు తక్కువగా నమోదవడం ఉపశమనాన్నిస్తోంది. ఒమిక్రాన్‌ మరింత విస్తరించి ప్రమాదకరంగా మారినట్లయితే ఆస్పత్రుల్లో పడకలు సరిపోని పరిస్థితులేర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గత డిసెంబరులో ఏపీలో 1,381 మంది కొవిడ్‌ ఆస్పత్రుల్లో చేరారు. జనవరి ఒకటి నుంచి 14వ తేదీవరకు 2వారాల్లోనే 1400 మంది ఆస్పత్రుల్లో చేరడం గమనార్హం. గతేడాది జూన్‌ తరువాత ఈ స్థాయిలో కేసుల నమోదు ఇదే తొలిసారి. ఈ లెక్కన నెలాఖరునాటికి ఆస్పత్రుల్లో చేరే కేసులు రెండు రెట్ల వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. జనవరి 1నుంచి 14వరకు 19,610 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ప్రస్తుతం 7.14% (డిశ్ఛార్జిలు మినహాయిస్తే) మంది ఆస్పత్రుల్లోనే ఉన్నారు. గరిష్ఠంగా చిత్తూరు జిల్లాలో 362 మంది చికిత్స పొందుతున్నారు. విశాఖ జిల్లాలో వీరి సంఖ్య 172 వరకుంది. గుంటూరు జిల్లాలో 129 మంది బాధితులు దవాఖానాల్లో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 49, విజయనగరం జిల్లాలో 18 మంది చొప్పున చికిత్స పొందుతున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో ప్రస్తుతానికి 56 మంది చొప్పున ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 1400 మందిలో ఐసీయూలో 238, ఆక్సిజన్‌ పడకలపై 783, వెంటిలేటర్లపై 58, ఇతరులు జనరల్‌ వార్డుల్లో ఉన్నారు.

14 రోజుల్లో 13 మంది మృతి

ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం క్రియాశీల కేసులు 18,313 ఉన్నాయి. ఈనెల 1నుంచి శుక్రవారం వరకు కొవిడ్‌తో మరణించినవారు 13 మంది వరకున్నారు. డిసెంబరు31 నుంచి జనవరి 13లోగా 18ఏళ్లలోపు ఉండి ఆస్పత్రుల్లో చేరినవారు 61 మంది ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ భారీగా కేసులు

పట్టణాలు/నగరాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తొలి, మలివిడతలోకంటే ఈసారి వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. గురువారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో గరిష్ఠంగా 27.88% కేసులు నమోదయ్యాయి.

తాడేపల్లిలో 21.63% కేసులు

ముఖ్యమంత్రి జగన్‌ నివాసమున్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో 21.63%, నెల్లూరు జిల్లా ముత్తుకూరులో 21.61%, విశాఖ జిల్లా పరవాడ 20.33%, తిరుపతి 20.33%, మంగళగిరి 19.53%, కొత్తవలస (విజయనగరం) 18.70%, పాడేరు (విశాఖపట్నం) 18.49%, సబ్బవరం (విశాఖపట్టణం) 18.07%, భీమునిపట్నం (విశాఖపట్నం) 17.73%, రేణిగుంట (చిత్తూరు) 17.71% చోడవరం (విశాఖపట్నం) 17.56%, కాకినాడ (తూర్పుగోదావరి) 17.51%, ఆనందపురం (విశాఖపట్నం)లో 17.27% చొప్పున కేసులొచ్చాయి. ప్రకాశం జిల్లా పామూరులో 16.67%, కడప జిల్లా ఎర్రగుంట్ల ప్రాంతంలో 16.67%, రాజానగరం(తూర్పుగోదావరి)లో 15.19%, పెనమలూరు(కృష్ణా)లో 13.55%, కె.కోటపాడు (విశాఖ)లో 13.47% చొప్పున కేసులొచ్చాయి. మున్సిపాలిటీలపరంగా చూసినా సూళ్లూరుపేటలోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

కొత్తగా 4,528 కేసులు

గురువారం ఉదయం 9నుంచి శుక్రవారం ఉదయం 9గంటల మధ్య 39,816 నమూనాలను పరీక్షించగా, 4,528 మందికి పాజిటివ్‌గా తేలింది. జనవరి ఒకటిన పాజిటివిటీ 0.57%గా ఉంది. 2వారాల వ్యవధిలో అదనంగా 10.8% పెరిగి 11.37శాతానికి పెరిగింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,027 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు ఎక్కువగా తిరుపతిలోనే వస్తున్నాయి. అక్కడ ఇటీవల జాతీయస్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. క్రీడాకారులు, పోటీల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది పలువురు కరోనా బారినపడ్డారు. దీనికితోడు యాత్రికుల రద్దీ ఉన్నందున వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. చిత్తూరు జిల్లా తర్వాత విశాఖ జిల్లాలో 992 కేసులు రికార్డయ్యాయి. అనంతపురం జిల్లాలో 300, తూర్పుగోదావరి-327, గుంటూరు-377, నెల్లూరు-229, శ్రీకాకుళం-385, కడప-236 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ వందకుపైబడే కేసులొచ్చాయి. ప్రకాశం జిల్లాలో కొవిడ్‌తో ఒకరు ప్రాణాలు విడిచారు.

జాగ్రత్తలు అవసరం

సంబరంగా జరుపుకొనే సంక్రాంతి, కనుమ సందర్భంగా చాలాచోట్ల గ్రామస్థులంతా ఒక్కచోట గుమిగూడే అవకాశాలెక్కువే. ఈ సమయంలో మాస్కు ధరించడం, ఇతర కరోనా మార్గదర్శకాలను తప్పక పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

వైద్యం కోసం..!

వైద్యశాల బయట ఆక్సిజన్‌ ఏర్పాటుచేసి

చిత్రంలోని మహిళ పేరు సుశీలమ్మ. ఊరు చిత్తూరు జిల్లా ఏర్పేడు. 3రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆయాసంగా ఉండటంతో గురువారం కొవిడ్‌ పరీక్ష చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శుక్రవారం ఉదయం తిరుపతి స్విమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రికి తెచ్చారు. ఆసుపత్రిలో చేర్చుకునే వరకు వైద్యశాల బయట ఆక్సిజన్‌ ఏర్పాటుచేసి ఇలా ఉంచారు. కొవిడ్‌ కేసులు పెరిగిపోతున్నాయడానికి ఈ చిత్రం సాక్ష్యంగా నిలుస్తోంది. వైరస్ మళ్లీ విజృంభిస్తున్నందున రుయా, స్విమ్స్‌లలో తిరిగి జర్మన్‌షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఇదీ చదవండి: మహారాష్ట్రలో స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 43,211 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.