ETV Bharat / state

Revanthreddy on Dharani Portal : 'కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ధరణిని రద్దు చేస్తాం'

author img

By

Published : Jun 9, 2023, 3:38 PM IST

Updated : Jun 9, 2023, 6:03 PM IST

Revanthreddy
Revanthreddy

Revanthreddy fires on BJP and BRS : బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్​ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ చేసిన సవాల్‌ను స్వీకరించినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.

Revanthreddy Comments on BRS : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ధరణి పోర్టల్ను బరాబర్‌ రద్దు చేసి తీరతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్​ సోమాజిగూడలోని ఓ హోటల్​లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రేవంత్​.. తనదైన శైలిలో బీజేపీ, బీఆర్​ఎస్​లపై తీవ్ర ఆరోపణలు చేశారు.

దేశాన్ని దోచుకోవడమే డబుల్ ఇంజిన్ పని : బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్​ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని... ఎన్నికల్లో గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ నేతలంతా కష్టపడాలన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినమని... తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలన్నారు. పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని... నాయకుడిగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక వేదిక లాంటిదన్నారు. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​ఛార్జ్ మాణిక్ రావ్‌ ఠాక్రేనే దానికి ఉదాహరణగా రేవంత్​ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్‌ అంటే అదాని, ప్రధానిగా పేర్కొన్న రేవంత్ రెడ్డి... దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజిన్ పనిగా ఆరోపించారు. వన్ నేషన్.. వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని విమర్శించారు.

'గడీల పాలన పునరుద్ధరించేందుకే కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు. కొద్ది మంది భూస్వాముల కోసమే ధరణి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్‌ను కచ్చితంగా రద్దు చేస్తాం. రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి భూముల్లో అవకతవకలు జరిగాయి. వేల ఎకరాల భూమిని కేసీఆర్‌.. బినామీలకు కట్టబెట్టారు. అవకతవకలకు పాల్పడ్డ అధికారులను ఊచలు లెక్కబెట్టిస్తాం. ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన సమాచారం దళారుల చేతికి వెళ్లిపోయింది. ధరణి అవకతవకలపై కేసీఆర్ కుటుంబం చర్లపల్లి జైలుకెళ్లడం ఖాయం. ధరణి రాకముందు రైతు బంధు రాలేదా?'-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

కేటీఆర్‌, హరీశ్‌ చర్చకు సిద్ధమా ? : మంత్రి కేటీఆర్‌ చేసిన సవాల్‌ను స్వీకరించినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న రేవంత్​... 2014 తర్వాత జరిగిన అభివృద్ధిపై కేటీఆర్‌, హరీశ్‌ చర్చకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ చేయనిది ఏదైనా మీ ప్రభుత్వం చేసి ఉంటే తాము క్షమాపణ చెప్పడానికి కూడా సిద్దమని వెల్లడించారు. తండ్రి కొడుకులు నిప్పుతొక్కిన కోతుల్లా ఎగురుతున్నారని ఆరోపించిన రేవంత్‌ రెడ్డి... కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్‌ మాదిరి రాష్ట్రాన్ని కొల్టగొట్టమని, దోపిడీలు చేయమని స్పష్టం చేశారు.

'2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి.. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలి. దీనికి అవసరమైన కార్యాచరణపై యూత్‌ కాంగ్రెస్‌కు దిశా నిర్దేశం చేశాం. క్షేత్ర స్థాయిలో కీలకంగా పని చేసిన వారు.. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులవుతారని చెప్పాం. మోదీ, కేసీఆర్‌లను గద్దె దించాలంటే యూత్‌ కాంగ్రెస్‌ క్రియాశీలకంగా పని చేయాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. అగ్రనాయకులు అందుబాటులో ఉండే అవకాశాన్ని బట్టి బహిరంగ సభలు ఉంటాయి. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది.'-రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

సెప్టెంబరు 17న మేనిఫెస్టో విడుదల : అమరవీరుల స్తూపం, అంబేడ్కర్‌ విగ్రహం, సచివాలయ నిర్మాణాలల్లో బీఆర్​ఎస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారని రేవంత్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే దొంగల పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని వెల్లడించారు. అయిదు అత్యంత కీలక అంశాలతో ప్రజల ముందుకు వెళ్తామని, బీసీ, ఎస్టీ, ఎస్సీ డిక్లరేషన్లు కూడా ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్‌ను అడ్డుకోవడానికి కేసీఆర్‌ చిల్లరమల్లర రాజకీయలు చేస్తారని... ఇప్పటికే కాంగ్రెస్‌ వైపు ప్రజలు ఓ నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు శంకరగిరి మాన్యాలకు పోతారో సీఎం కేసీఆర్ చూస్తార్నారు. సెప్టెంబరు 17న మేనిఫెస్టో విడుదల చేయాలని పార్టీ పెద్దలతో చర్చిస్తున్నట్లు వివరించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం: రేవంత్

ఇవీ చదవండి:

Last Updated :Jun 9, 2023, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.