ETV Bharat / state

పట్నం వీడి... శివారు ప్రాంతాలకు పాకిన రేవ్ పార్టీ కల్చర్

author img

By

Published : Mar 12, 2021, 7:03 PM IST

Updated : Mar 12, 2021, 8:37 PM IST

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కొన్ని ఫామ్​హౌస్​లు రేవ్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని నిర్వాహకులు రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ముందే ఎంపిక చేసుకున్న వాళ్లను ఆహ్వానించి... మందుతో విందు చేసుకుని చిందులేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అయితే పోలీసుల నిఘా ఉండదనే ఉద్దేశంతో రెచ్చిపోతున్నారు. కంపెనీల ప్రచారం, ఏజెంట్లలో వినోదం నింపడానికి నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.

పట్నం వీడి... శివారు ప్రాంతాలకు పాకిన రేవ్ పార్టీ కల్చర్
పట్నం వీడి... శివారు ప్రాంతాలకు పాకిన రేవ్ పార్టీ కల్చర్

విత్తనాలు, పురుగుల మందుల కంపెనీలు, ఫార్మా సంస్థలకు చెందిన డీలర్లు లక్ష్యాన్ని అధిగమిస్తే... వారికి ప్రోత్సాహాకాలు ఇవ్వడం, వినోదం పంచడం కోసం ఆయా యాజమాన్యాలు రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫామ్​హౌస్​లను ఎంపిక చేసుకుంటున్నారు. పోలీసు నిఘా లేని, జన సంచారం లేని ఫామ్​హౌస్​లలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి, విందులు, చిందులతో డీలర్లను ఉత్సాహపర్చేందుకు పలు సంస్థల ప్రతినిధులు నిబంధనలను అధిగమిస్తున్నారు.

ఆన్​లైన్​లో ప్రవేశాలు...

ఈ పార్టీలలో కొంత మంది మత్తు పదార్థాలను వినియోగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సంస్థాన్ నారాయణపూర్ గిరీశ్​, శ్రీకర్ అనే స్నేహితుల మరికొంత మంది స్నేహితులతో కలిపి డబ్బులు సంపాదించడానికి రేవ్ పార్టీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల ప్రచారం నిర్వహించారు. ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి ప్రవేశం కోసం రూ. 500 వసూలు చేశారు. మద్యం, మత్తు పదార్థాలకు అదనపు డబ్బులు వసూలు చేశారు.

యువతులతో చిందులు...

శివరాత్రి, దసరా, షబ్బే బరాత్ లాంటి పండగలున్నప్పుడు పోలీసుల దృష్టంతా బందోబస్తుపైనే ఉంటుందనే ఉద్దేశంతో రేవ్ పార్టీ నిర్వాహకులు ఇదే అదునుగా భావించి పార్టీలు నిర్వహిస్తున్నారు. అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఒక్కొక్కరికి రూ. 3 వేల నుంచి రూ. 10వేల వరకు చెల్లిస్తున్నారు. కొన్నిసార్లు యువతులతో ఏకాంతంగా గడిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

పబ్బులు, స్టార్​ హోటళ్లలో...

రెండేళ్ల కిందట వరకు హైదరాబాద్​లోని పబ్బులు, స్టార్ హోటళ్లలోనే ఎక్కువగా రేవ్, ముజ్రా పార్టీలు జరిగేవి. గతేడాది జనవరిలో జూబ్లీహిల్స్​లోని ఓ పబ్​లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఓ ఫార్మా సంస్థ తన వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో వైద్యులు, సేల్స్​మెన్​ల కోసం పబ్​లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు.

ఏపీ నెల్లూరు నుంచి 20 మంది యువతులను రప్పించి వారితో అశ్లీల నృత్యాలు చేయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు... యువతులతో పాటు రేవ్ పార్టీ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. సంస్థ డైరెక్టర్, పబ్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. ఫార్మా సంస్థ ఏటా ఆర్గనైజర్ సాయంతో రేవ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రేవ్ పార్టీకి వేదికైన పబ్​ను సైతం పోలీసులు సీజ్ చేశారు.

పోలీసుల నిఘా...

కొంతమంది బడా వ్యక్తుల జన్మదినాలు, ఇతర వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. పబ్బులలో రేవ్ పార్టీలు జరుగుతున్నా... పట్టించుకోవడంలేదనే విమర్శలు ఎక్కువైన నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు.

ప్రస్తుతం రేవ్ పార్టీలు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. శామీర్​పేటలోని ఓ ఫామ్​హౌస్​పై పోలీసులు దాడి చేశారు. నలుగురు యువతులతో పాటు ఏడుగురు యువకులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వాళ్లలో 7మంది వైద్యులూ ఉన్నారు.

కఠిన చర్యలు..

కీసర ఠాణా పరిధిలోని తిమ్మాయిపల్లిలో గేటెడ్ కమ్యూనిటీ విల్లాల్లోనూ మూడు నెలల కిందట రేవ్ పార్టీని కీసర పోలీసులు బట్టబయలు చేశారు. ఓ విత్తన కంపెనీకి చెందిన మేనేజర్... తన పరిధిలోని డీలర్ల కోసం రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. 40 మంది పాల్గొన్న ఈ రేవ్ పార్టీలో 5 మంది యువతులు అర్ధనగ్న నృత్యాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శివారు ప్రాంతాల్లోనూ నిఘా పెంచిన పోలీసులు... రేవ్ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: పిల్లికి పాలుపోయాలంటూ... పక్కాగా ప్లాన్‌

Last Updated : Mar 12, 2021, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.