రాష్ట్రంలో ముసురు పట్టింది. చాలాచోట్ల చిరుజల్లులు .. కొన్నిచోట్ల మోస్తరు వానలు పడుతున్నాయి. ముసురుతో హైదరాబాద్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్రవాహనాలపై కార్యాలయాలకు .. ఇతర అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లేవాళ్లు తడిసి ముద్దవుతున్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రార్థనలకు వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఏకధాటిగా వర్షం
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ముసురుతో ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో నగరవాసులు ఉదయం నుంచి ఎవ్వరూ బయటకు రావడం లేదు. బయటకు వచ్చిన వారు తడిసి ముద్దయ్యారు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. వర్షం పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో పనులకు ఆటంకం ఏర్పడింది. 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 28 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీతకు ఆటంకం ఏర్పడింది.
కోట్ల రూపాయల నష్టం
మంచిర్యాల జిల్లాలో 4 సింగరేణి ఉపరితల గనుల్లో వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని, రామకృష్ణాపూర్ ఉపరితల గనుల్లో 12 వేల టన్నుల బొగ్గు, శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం, శ్రీరాంపూర్ ఓసీల్లో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉపరితల గనుల్లోని ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో సుమారు మూడు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడింది. దీంతో సంస్థకు సుమారు 7 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్న జనం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతోంది. ముసురుతో లోతట్టు ప్రాంతాల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షంతో ఈద్గాల్లో ప్రార్థనలకు అంతరాయం కలగగా.. ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్‌లో మసీదుల్లో ప్రార్థనలు చేశారు.
జగిత్యాల జిల్లాలో..
జగిత్యాల జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.. జిల్లాలో అత్యధికంగా కథలాపూర్‌లో 94.6 మిల్లీమీటర్లు, మల్లాపూర్‌లో 91.2, మెట్‌పల్లి 64, కోరుట్ల 66.4, జగిత్యాలలో 50.6, గొల్లపల్లిలో 52.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అన్ని మండలాల్లో ముసురు పట్టింది. వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ముసురు పట్టడంతో జనజీవనానికి ఇబ్బందిగా మారింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు జగిత్యాల గ్రామీణ మండలం మోరపల్లిలో పురాతన ఇల్లు కూలింది. ఏటా అట్టహాసంగా జరిగే జగిత్యాల పట్టణంలోని ఈద్గా, ఖిల్లాల్లో ఈ సారి వర్షం కారణంగా ప్రార్థనలు జరపలేదు. పట్టణంలో 24 మసీదుల్లో ప్రార్థనలు చేశారు.
ఇదీ చదవండి: Ts weather report: రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వర్షాలు