ETV Bharat / state

తెరాస, భాజపాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి: రాహుల్​ గాంధీ

author img

By

Published : Oct 27, 2022, 8:36 PM IST

Rahul Gandhi
Rahul Gandhi

Bharat Jodo Yatra in Telangana: కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెరాస ఎమ్మెల్యేల కొనుగోళ్లతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. 8 ఏళ్లుగా భాజపా తెచ్చిన అన్ని బిల్లులను తెరాస సమర్థించిందన్న ఆయన.. రెండు పార్టీలను నాణేనికి బొమ్మ-బొరుసుగా అభివర్ణించారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా యేలిగండ్ల సమీపంలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్‌ మాట్లాడారు. దేశానికి నిరుద్యోగం, ధరల పెరుగుదల శాపంగా మారాయని.. తెరాస ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంలో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు.

Bharat Jodo Yatra in Telangana: రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర రెండో రోజు ముగిసింది. మూడ్రోజుల విరామం తర్వాత నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభించిన రాహుల్‌.. 26 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా రాష్ట్ర నాయకులు, వేలాది మంది కార్యకర్తలు ఆయనతో కదం కదిపారు.

పాదయాత్రలో భాగంగా విభిన్న వర్గాలతో రాహుల్ సమావేశమయ్యారు. బీడీ కార్మికులు రాహుల్‌ను కలిసి.. తమ సమస్యలు విన్నవించారు. పీఎఫ్​, కనీస వేతన అమలు, కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలను వారు వివరించారు. రాహుల్‌గాంధీతో సమావేశమైన మత్స్యకారులు.. తమ గోడు వెళ్లబోసుకున్నారు. భోజన విరామంలో రాహుల్‌తో కౌలు రైతులు, పంట నష్టపోయిన కర్షకులు, ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబసభ్యులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వకపోవడం, పంటల బీమా పథకం అమలు కాకపోవడం, మద్దతు ధరలపై ఈ సందర్భంగా వారు చర్చించారు.

సాయంత్రం తిరిగి జక్లేర్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన రాహుల్ గుడిగండ్లకు చేరుకున్నారు. ఎమనోనిపల్లి 'కూడలి సమావేశం'లో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. భాజపా, తెరాస ప్రభుత్వాల తీరుపై విమర్శలు గుప్పించారు. రెండు పార్టీలు అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆరోపించారు.

మియాపూర్‌ భూముల్లో తెరాస ప్రభుత్వం రూ.15 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందన్న రాహుల్‌.. అడ్డగోలుగా అవినీతి చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. ఎలిగండ్లలో రాత్రి బస చేస్తున్న రాహుల్‌గాంధీ.. ఉదయం ఈ క్యాంప్ నుంచే యాత్ర ప్రారంభించనున్నారు. రేపు భోజన విరామంలో చేనేత కార్మికులు, పోడు రైతులతో ఆయన భేటీ కానున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.