ETV Bharat / state

దూర ప్రయాణాలకు ప్రజా రవాణా లేక ప్రైవేటుదోపిడీ!

author img

By

Published : Oct 10, 2020, 9:13 AM IST

నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌కు చెందిన జహీర్‌ ఇటీవల ఖాతార్‌ నుంచి వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బస్సుల్లేకపోవడంతో రూ.5 వేల అద్దెతో ప్రైవేటు వాహనం తెప్పించుకోవాల్సి వచ్చింది. కొవిడ్‌కు ముందు ఎయిర్‌పోర్టు నుంచి ఆర్మూర్‌కు బస్సు ఉండేదని, ఛార్జీ రూ.ఐదొందలలోపే ఉండేదని వాపోయారు.

lack of public transport in telangana
దూర ప్రయాణాలకు ప్రజారవాణా లేక ప్రైవేటుదోపిడీ!

లాక్‌డౌన్‌ అన్‌లాక్‌తో దాదాపుగా పూర్తిస్థాయి సడలింపులు వచ్చినప్పటికీ అంతర్రాష్ట్ర, దూర ప్రయాణాలు ప్రజలకు తీవ్ర భారంగా మారుతున్నాయి. రైళ్లు అరకొరగా తిరుగుతుండటం, తెలుగురాష్ట్రాల మధ్య ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో ఇదే అదనుగా ప్రైవేటు వాహన యజమానులు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో తప్పనిసరై ప్రయాణాలు చేస్తున్నవారి జేబులకు చిల్లు పడుతోంది.

రెండు, మూడింతల భారం

దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నప్పటికీ అతి తక్కువగా ఉన్నాయి. ఉన్నవాటిలో ఎక్కువ దిల్లీ, ఒడిశా, బెంగాల్‌, బిహార్‌వైపే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లేవారికి రోడ్డుమార్గం తప్పట్లేదు. ప్రైవేటు బస్సులు రాత్రి తిరుగుతుండగా..పగలు ప్రయాణం చేయాల్సినవారు చిన్న, పెద్ద ప్రైవేటు కార్లను ఆశ్రయించాల్సి వస్తోంది. దూరప్రయాణికుల వ్యయప్రయాసలపై హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘ఈనాడు’ పరిశీలించింది.

దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌, కూకట్‌పల్లి వంటిచోట్ల పెద్దసంఖ్యలో ప్రయాణికుల రోడ్లపై వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. కార్లలో ఆర్టీసీ ఛార్జీల కంటే 2, 3 రెట్లు వసూలుచేస్తుంటే..ప్రైవేటు బస్సుల్లో రెట్టింపు ఛార్జీ వసూలుచేస్తున్నారు. దసరా, దీపావళి పండగల సమయంలో ఇంకెంత వసూలుచేస్తారోనన్న ఆందోళన ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది.

  • విశాఖపట్నం-హైదరాబాద్‌ మధ్య ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ ఛార్జీ రూ.870 ఉంటే..ప్రైవేటు నాన్‌ఏసీ బస్సుల్లో రూ.1,600 వరకు తీసుకుంటున్నారు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి తెలంగాణలో ప్రధాన నగరాలు, పట్టణాలకు..ఏపీలో నగరాలు, పట్టణాలకు నేరుగా బస్సులుండేవి. ఇప్పుడు ఆ సర్వీసుల్లేక విమానం దిగాక కార్లను అద్దెకు తీసుకుని వెళ్లాల్సి వస్తోంది.
  • హైదరాబాద్‌-విజయవాడ మధ్య కొవిడ్‌కు ముందు రోజుకు 15 వేల వరకు చిన్న,పెద్ద కార్లు తిరిగేవి. ఇప్పుడు ఆ సంఖ్య 17,000-18,000కి పెరిగింది. గతంలో బస్సులు, రైళ్లలో వెళ్లినవారిలో కొందరు ఇప్పుడు సొంతవాహనాల్లో వెళ్తున్నారు. డిమాండ్‌ ఉండటంతో కొందరు సొంత వాహనాల్ని ప్రయాణికుల్ని చేరవేసేందుకు వాడుతుండటంతో దూరప్రాంతాల మధ్య తిరిగే కార్ల సంఖ్య పెరిగింది.

ఇదీ చదవండిః వేగం పుంజుకుంటున్న జనజీవనం.. మెరుగవుతున్న రవాణా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.