ETV Bharat / state

ప్రధాని మోదీ హైదరాబాద్​ పర్యటన ఖరారు.. ఆరోజునే మరో వందేభారత్​ రైలు ప్రారంభం

author img

By

Published : Apr 1, 2023, 4:39 PM IST

Narendra Modi Hyderabad tour
Narendra Modi Hyderabad tour

Narendra Modi Hyderabad tour: ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 8వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని పలు రైల్వే అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్దమవుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్-తిరుపతి వరకు నడిచే రెండో వందేభారత్ రైలును అదేరోజు ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఎంఎంటీఎస్ రెండో దశ పనులను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునఃఅభివృద్ది పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Narendra Modi Hyderabad tour: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల 8వ తేదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. అదే రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండో వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. దీంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలులో ప్రయాణికులు కేవలం 8:30 గంటల్లో చేరుకుంటారని దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఎంఎంటీఎస్​ రెండో దశ సేవలు ప్రారంభం: అనంతరం నగరంలో ఎంఎంటీఎస్​ రెండో దశ సేవలను ప్రధాని ప్రారంభిస్తారని రైల్వే అధికారులు తెలిపారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న మేడ్చల్-సికింద్రాబాద్-ఉందానగర్, మేడ్చల్ -సికింద్రాబాద్-తెల్లాపూర్ మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు ఈనెల 8వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రకటించింది. 2003లో ఎంఎంటీఎస్ మొదటి దశ పనులు అందుబాటులోకి వచ్చాయి. 2014లో ఎంఎంటీఎస్ రెండవ దశ పనులు ప్రారంభమయ్యాయి. రూ.816 కోట్ల వ్యయంతో 95కి.మీల మేర పనులు చేపట్టాలని రైల్వేశాఖ ప్రతిపాదనలు చేసింది.

రెండవ దశలో సికింద్రాబాద్ -మేడ్చల్ మార్గంలో 28 కి.మీల వరకు ఉంటుంది. ఈ మార్గంలో లాలాగూడ గేట్, మల్కాజ్ గిరి, దయానందనగర్, సఫిల్ గూడ, ఆర్.కే.పురం, అమ్ముగూడ, కావర్లీ బ్యారెక్స్, అల్వాల్, బొల్లారం బజార్, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఫలక్​నుమా-ఉందానగర్ మధ్య శివరాంపల్లి, బుద్వేల్ స్టేషన్లు అందుబాటులోకి వస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అభివృద్ది పనులకు ప్రధాని నరేంద్రమోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు. సుమారు రూ.700ల కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

సికింద్రాబాద్​ స్టేషన్ ఆధునికరణ పనులకు శ్రీకారం: ఆధునిక సౌకర్యాలు, మెరుగైన నిర్మాణ డిజైన్‌తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా దశలవారీగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రాబోయే 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో విమానాశ్రయం తరహాలో పునరాభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పునరాభివృద్ధి పనులు 3 దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశ పనులు 16 నెలల్లో, రెండో దశ 28 నెలల్లో, మూడో దశ 36 నెలల్లో పూర్తి చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ వెల్లడించింది. కొత్త స్టేషన్ భవనంలో 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, స్టేషన్‌లో ప్రయాణికులను సులభంగా రాకపోకలు సాగించేoదుకు అనుగుణంగా ట్రావెలేటర్ల సదుపాయాలు ఉండనున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉత్తరం వైపున జీ+3 అంతస్తులతో కొత్త స్టేషన్ భవనం ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ కొత్త డిజైన్ ప్రయాణీకుల కదలికను ఒక మోడ్ నుంచి మరొక మోడ్‌కు నిర్ధారిస్తుందని అధికారులు తెలిపారు.

ప్రయాణికుల కదలికలు, వాహనాల కదలికలను నివారించడానికి ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ బ్లాక్‌ల వంటి ప్రత్యేక సదుపాయాలు ఉండేట్లు నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనాలు సాఫీగా వెళ్లేందుకు స్టేషన్‌లో మల్టీ లెవల్, అండర్ గ్రౌండ్ కార్ పార్కింగ్ సౌకర్యాలు ఉండనున్నాయి. కొత్త స్టేషన్ బిల్డింగ్​లో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ఎలక్ట్రానిక్ సైన్ బోర్డులతో సహా ఆధునికీకరించిన సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే స్టేషన్​కు అవసరమైన విద్యుత్​ను ఉత్పత్తి చేసేందుకు 5వేల కేడబ్లూపీ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ అవసరాల నిమిత్తం 16 లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యంగల నాలుగు జీఎల్​ఆర్​ సంప్​లు ఏర్పాటు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

తెలుగు రాష్ట్రాల మధ్య పరుగు తీయనున్న మరో 'వందేభారత్​'​.. ఈసారి ఆ మార్గంలో..

త్వరలో అందుబాటులోకి ఏసీ స్లీపర్ బస్సులు.. వందేభారత్​ను తలపించేలా ప్రత్యేకతలు

ప్రధాని హైదరాబాద్ పర్యటన ఖరారు.. ఆ పనులకు మోదీ శంకుస్థాపన..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.