ETV Bharat / state

PHCS in TS: అక్కరకురాని కేంద్రాలు.. వైద్యులు లేక నిరుపయోగంగా సబ్‌సెంటర్లు..!

author img

By

Published : Dec 15, 2021, 5:54 AM IST

వైద్యుల సదుపాయం లేక ఆరోగ్య ఉపకేంద్రాలు వెలవెలబోతున్నాయి. పల్లె జనం గోస పడుతున్నారు. కేవలం టీకాలు, అధిక రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నెలనెలా మందులివ్వడానికే ఇవి పరిమితమవుతున్నాయి. ఏఎన్‌ఎంలు మాత్రమే అందుబాటులో ఉండడంతో.. వైద్యం కోసం ప్రజలు సుదూరంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దకో లేదంటే ఆర్‌ఎంపీల దగ్గరకో వెళ్లాల్సి వస్తోంది. పాత భవనాల్లో కొనసాగుతున్న 889 కేంద్రాలను కొత్తగా నిర్మించేందుకు శ్రీకారం చుట్టగా.. సుమారు 200కుపైగా భవనాల నిర్మాణం పూర్తయింది. వాటిని వాడుకోవడంలోనూ ఆరోగ్యశాఖ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య ఉపకేంద్రాల పనితీరుపై ‘ఈటీవీ భారత్’  క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

Primary health centers in telangana
వైద్యులు లేక నిరుపయోగంగా సబ్‌సెంటర్లు

రాష్ట్రంలో మొత్తం 4,744 ఆరోగ్య ఉపకేంద్రాలు(సబ్‌ సెంటర్లు) ఉన్నాయి. ఏ ఉపకేంద్రం పరిధి నుంచి వైద్యుడి వద్దకు వెళ్లాలన్నా.. సగటున 15-30 కి.మీ. ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుడు లేకపోవడం ఉపకేంద్రాల్లో పెద్దలోటు. 14రకాల పరీక్షలు చేయాలని సంకల్పించినా.. కొన్నిచోట్ల.. అదీ మధుమేహ నిర్ధారణ పరీక్ష మాత్రమే నిర్వహిస్తున్నారు.

ములుగు జిల్లా ఎదిర పీహెచ్‌సీ పరిధిలోని తిప్పాపూర్‌ ఆరోగ్య ఉపకేంద్రం నుంచి 14 కి.మీ. ప్రయాణిస్తే గానీ వైద్యసేవలు లభించవు. ఇక్కడే నూగూరు ఆరోగ్య ఉపకేంద్రం నుంచి 25 కి.మీ. ప్రయాణం చేస్తే తప్ప ప్రభుత్వ వైద్యుడి దర్శనం దొరకదు. అలాగే కొడిశెల పీహెచ్‌సీకి రావాలంటే.. కాల్వపల్లి ఆరోగ్య ఉపకేంద్రం నుంచి 15 కి.మీ. ప్రయాణించాల్సిందే. ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి.

పోస్టులూ ఖాళీ..
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలో ఇద్దరు ఏఎన్‌ఎంలు ఉండాలి. కానీ, దాదాపు 1000కిపైగా ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యంలో శిక్షణనిచ్చిన స్టాఫ్‌నర్సును నియమించి.. ‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు’గా తీర్చిదిద్దాలనే కేంద్ర ప్రభుత్వ పథకానికి అతీగతీ లేదు.

ది మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లిలో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం. దీని పరిధిలో మరో గ్రామం, ఏడు తండాలూ ఉన్నాయి. ఇద్దరు ఏఎన్‌ఎంలకు గాను ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ముగ్గురు ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. కొత్త భవనాన్ని ప్రారంభించకపోవడంతో.. గత్యంతరం లేక తాత్కాలికంగా పురాతన భవనంలో కొనసాగిస్తున్నారు. ఇక్కడి వారు ప్రభుత్వ వైద్యుడి కోసం సుమారు 15 కి.మీ. ప్రయాణించి తొర్రూరులోని పీహెచ్‌సీకి చేరుకోవాల్సిందే. ఉపకేంద్రంలో వైద్యుడు లేకపోవడం పెద్దలోటుగా మారిందని గ్రామానికి చెందిన మార్త వీరయ్య(55) ఆవేదన వెలిబుచ్చారు.

యన పేరు పొయిలి రాజం(70). పశువుల కాపరి. తొర్రూరు పీహెచ్‌సీ పరిధిలోని గంట్లకుంట్ల గ్రామం. ఇక్కడ ఏడాది కిందట నిర్మాణం ప్రారంభించిన ఆరోగ్య ఉపకేంద్రం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక్కరే ఏఎన్‌ఎం, ముగ్గురు ఆశాలు సేవలందిస్తున్నారు. ఏ చిన్న అనారోగ్యమెదురైనా 25 కి.మీ. ప్రయాణించి తొర్రూరుకు వెళ్లాల్సి వస్తోందని రాజం చెబుతున్నారు. తమ గ్రామానికి చెందిన గర్భిణికి ఆపరేషన్‌ చేయాల్సి వస్తే దాదాపు 50 కి.మీ. ప్రయాణించి వర్ధన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలనీ, తొర్రూరులో సహజ కాన్పులే చేస్తారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. వైద్యుడి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రాజం కోరుతున్నారు.

ఏడు నెలలు దాటింది..!

హబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో దాతలు ఇచ్చిన స్థలంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం ఇది. ఈ ఏడాది మార్చిలోనే నిర్మాణం పూర్తయింది. మే 20న ప్రారంభోత్సవానికి శిలాఫలకం సహా సర్వం సిద్ధం చేశారు. కానీ, ఇప్పటికీ ఈ ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభానికి నోచుకోలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారోనని ఏడు నెలల నుంచి గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు. స్థానికంగా అద్దె భవనంలో కొనసాగుతున్న కేంద్రానికి అద్దె చెల్లించలేక.. ఇటీవలే ఆరోగ్య సిబ్బంది అనధికారికంగా ఈ భవనంలోకి సామగ్రిని మార్చుకున్నారు. వైద్యసిబ్బంది అందుబాటులో ఉండరనీ, కనీసం నొప్పి మాత్రలూ ఇవ్వడం లేదని మాటేడుకు చెందిన చర్లపల్లి ఎల్లమ్మ(70) తెలిపారు.

మరికొన్ని పరిశీలనలు..

* రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఒక్క దాంట్లో కూడా మహిళలు, పురుషులకు వేర్వేరు మరుగుదొడ్డి సౌకర్యం లేదు.

* ఆరోగ్య ఉపకేంద్రాల్లో 1,273 ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తుండగా.. 2,694 అద్దె భవనాల్లో ఉన్నాయి. మరో 777 పంచాయతీ, ఇతర స్వచ్ఛంద సంస్థల భవనాల్లో నిర్వహిస్తున్నారు. కొత్తగా 3,471 కొత్త భవనాలను నిర్మించాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 250 నిర్మాణాలకు అనుమతి లభించిందనీ, దశలవారీగా నూతన భవన నిర్మాణాలు చేపడతామని వైద్యవర్గాలు తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.