ETV Bharat / state

వాహకులకు ముందుగా టీకా

author img

By

Published : May 21, 2021, 7:06 AM IST

‘సూపర్‌ స్ప్రెడర్లు’.. తమకు తెలియకుండానే ఏదైనా వ్యాధిని తన ద్వారా ఎక్కువమందికి వ్యాప్తి చేసే వాహకులను ఇలా పిలుస్తారు. రాష్ట్రంలో ఈ తరహా సుమారు 7-8 కేటగిరీలకు చెందిన సూపర్‌ స్ప్రెడర్లు (వైరస్‌ వాహకులు) సుమారు 15 లక్షలమంది ఉంటారని అంచనా. ఇందులోనూ 18-44 ఏళ్ల మధ్యవయస్కులు వీరిలో అత్యధికులు ఉంటారని భావిస్తున్నారు. ‘సూపర్‌ స్ప్రెడర్లు’గా భావిస్తున్న వ్యక్తులకు తొలుత టీకాలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana news
సూపర్​ స్పైడర్లకు వ్యాక్సినేషన్​

ఏదో పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వినియోగించే వాహనచోదకులు మొదలుకొని.. మనింటికి వేర్వేరు రూపాల్లో ఆహార పదార్థాలనో, వస్తువులనో పార్శిళ్ల రూపంలో తీసుకొచ్చే వ్యక్తుల వరకూ పలు వృత్తులవారు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు కూడా సూపర్‌ స్ప్రెడర్లుగా ఉంటారని ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఇటువంటి వారికి తొలుత రెండు డోసుల టీకాలను వేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువగా బయట తిరుగుతుంటారు కనుక వారికి ముందుగా వ్యాక్సిన్‌ ఇస్తే కొవిడ్‌ బారినపడే అవకాశాలు తక్కువ ఉంటాయని.. ఒకవేళ కరోనా సోకినా వైరస్‌ లోడ్‌ తక్కువ ఉంటుంది కనుక వ్యాప్తి తగ్గుతుందని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించగా.. ఈ సూచన బాగుందంటూ ప్రధాని మోదీ అభినందించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇటీవల రాష్ట్రంలోని ఉన్నతస్థాయి అధికారులు చర్చించారు. త్వరలోనే 18-44 ఏళ్ల మధ్యవయస్కులకు టీకాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుండడంతో.. ఆ సమయంలో ‘సూపర్‌ స్ప్రెడర్లు’గా భావిస్తున్న వ్యక్తులకు తొలుత టీకాలందించడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దీనివల్ల వ్యాప్తిని చాలావరకూ అరికట్టవచ్చని భావిస్తున్నట్టు తెలియవచ్చింది.

వ్యాప్తి తెలియకుండానే..

తొలిదశలో కంటే రెండోదశలో వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇంట్లో ఒక్కరికొస్తే మొత్తం కుటుంబమంతా పాజిటివ్‌గా మారుతోంది. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఎవరో ఒకరిపైన ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న వాటిలో దాదాపు 80 శాతానికి పైగా కేసుల్లో ఎటువంటి లక్షణాలు లేకుండానే నిర్ధారణ అవుతున్నవే ఉంటున్నాయి. దీంతో ఎవరిలో వైరస్‌ ఉందో.. ఎవరిలో లేదో తెలియని గందరగోళం నెలకొంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంటి నుంచి కార్యాలయానికి క్యాబ్‌లో వెళ్లాడు. క్యాబ్‌ డ్రైవర్‌ మాస్కు పెట్టుకున్నా.. దాన్ని గడ్డం కిందకు వేలాడేసుకున్నాడు. తనలో కరోనా వైరస్‌ ఉన్నట్లు ఆ డ్రైవర్‌కు తెలియదు. కారు నడుపుతూ మధ్యమధ్యలో ఫోన్‌ మాట్లాడుతున్నాడు. ఒకట్రెండుసార్లు చిన్నగా దగ్గాడు. క్యాబ్‌లో ఎక్కిన వ్యక్తి మాస్కు పెట్టుకున్నాడు కాని.. ఆయనకు తెలియకుండానే వైరస్‌ వ్యాప్తి చెందింది. ఆ వ్యక్తి ద్వారా కార్యాలయంలో సహచరులకు, ఇంట్లో కుటుంబ సభ్యులకూ సోకింది. అదే కారులో ఆ రోజు సుమారు 30 మంది వరకూ ప్రయాణం చేశారు. వీరిలో సగంమందికి పైగా కొవిడ్‌ బారినపడ్డారు. ఇలా ఎటువంటి లక్షణాల్లేకుండా ప్రయాణం చేసే వారు తమకు తెలియకుండానే అత్యధికులకు వైరస్‌ వ్యాప్తి చేస్తున్నారు. మరికొందరు కొరియర్‌లో ఏదో ఒక వస్తువును తెప్పించుకోవాల్సి వస్తోంది. లేదా తప్పనిసరి పరిస్థితుల్లో బయట హోటల్‌ నుంచి ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయాల్సి వస్తోంది. మార్కెట్‌కెళ్లి కూరగాయలూ కొనాల్సిందే! ఇటువంటి సందర్భాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొనుగోలుదారుల ద్వారా వారికో లేదా వారి ద్వారా కొనుగోలుదారులకో వైరస్‌ సోకే ప్రమాదముంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వృత్తిలో భాగంగా ఎక్కువమందిని కలుస్తూ సూపర్‌ స్ప్రెడర్లుగా మారడానికి అవకాశం ఉన్నవారికి ముందుగా టీకా వేయడం ద్వారా.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని సర్కారు నిర్ణయించినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

బ్యాంకు ఉద్యోగులకూ ప్రాధాన్యం

18-44 ఏళ్ల మధ్య వయస్కులకు టీకాలను పంపిణీ చేసే క్రమంలో బ్యాంకు ఉద్యోగులు, న్యాయవాదులు, పాత్రికేయులకు కూడా ప్రాధాన్యమివ్వాలని ఉన్నతాధికారుల భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. నిత్యం ఎక్కువమందిని కలవాల్సిన పరిస్థితులు వీరికి ఉంటాయని ఈ మేరకు చర్చించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

అమలు ఎలా?
క్యాబ్‌, ఆటో డ్రైవర్లు, పార్శిల్‌ ఉద్యోగాలు చేసే వారిలో అత్యధికులకు వారు పనిచేసే సంస్థకు సంబంధించిన గుర్తింపు కార్డులుంటాయి. సంబంధిత సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించి అర్హులకు టీకాలను పంపిణీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే కొన్ని వృత్తుల వారికి గుర్తింపు కార్డులుండవు. ఉదాహరణకు వీధి వ్యాపారులు, కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారికి గుర్తింపు కార్డులుండే అవకాశాల్లేవు. ఇటువంటి వారిని గుర్తించి వారికి కూడా స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు ఇప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టీకా పొందడం ద్వారా సూపర్‌ స్ప్రెడర్లలో వైరస్‌ నిరోధకత పెరుగుతుంది. తద్వారా వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 3,660 కరోనా కేసులు.. 23 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.