ETV Bharat / state

పోస్టల్​​ ఓట్ల లెక్కింపులో భాజపా ఆధిక్యం..

author img

By

Published : Dec 4, 2020, 8:42 AM IST

Updated : Dec 4, 2020, 3:38 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తైంది. 85 చోట్ల భాజపాకు ఆధిక్యం లభించగా.. తెరాస 29, ఎంఐఎం 17, కాంగ్రెస్ 2 చోట్ల ఆధిక్యం సంపాదించాయి. మరో 17 డివిజన్లలో ఎవరికీ ఆధిక్యం దక్కకపోగా.. కొన్ని డివిజన్లలో పార్టీలకు సరిసమానంగా ఓట్లు వచ్చాయి. కొన్ని డివిజన్లలో అసలు పోస్టల్​ ఓట్లే నమోదు కాలేదు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తవడంతో.. సాధారణ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభించారు.

postal-ballots-counting-completed
బ్యాలెట్​ ఓట్లలో భాజపా ఆధిక్యం.. కొనసాగుతున్న లెక్కింపు

గ్రేటర్ హైదరాబాద్ పీఠం ఎవరిదో తేల్చే 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. డివిజన్ల వారీ కౌంటింగ్ హాళ్లలో.. మొత్తం 166 కౌంటింగ్ టేబుళ్లలో లెక్కింపు జరుగుతోంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. వీటిలో భాజపాకు అధికంగా ఓట్లు లభించాయి. అనంతరం బ్యాలెట్ పత్రాల మడతలు విప్పకుండా 25 చొప్పున కట్టలుగా కడుతున్నారు. వెయ్యి ఓట్ల చొప్పున ఉన్న 40 కట్టలను 14 టేబుళ్లకు ఇచ్చి లెక్కిస్తారు. ఒక్కో రౌండులో 14,000 ఓట్లు లెక్కిస్తారు. ప్రతి రౌండు అనంతరం కౌంటింగ్ ఏజెంట్ల సంతృప్తి మేరకు.. వారి సంతకాలు సేకరించాల్సి ఉంటుంది. సందేహాత్మక బ్యాలెట్ పత్రాలను రిటర్నింగ్ అధికారి స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఇందుకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పరిశీలకుని అనుమతి తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారు.

  • పర్యవేక్షణల మధ్య..

ఒక్కో హాల్​లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరా సౌకర్యం ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల సాయంతో ఎస్​ఈసీ ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

  • 3 గంటల్లోపు మెజార్టీ డివిజన్ల లెక్కింపు..

మెజార్టీ డివిజన్ల పూర్తి లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల్లోపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మెహిదీపట్నంలో మొదటి ఫలితం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఈ డివిజన్​లో 11 వేల 818 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 14 నుంచి 28 వేల మధ్య ఓట్లు పోలైన 136 డివిజన్ల ఫలితాలు రెండో రౌండ్​లో తేలిపోనున్నాయి. ఉప్పల్, కంచన్​బాగ్, మైలార్​దేవ్ పల్లి, అంబర్ పేట, రహ్మత్ నగర్, కొండాపూర్, అల్లాపూర్, ఓల్డ్ బోయిన్ పల్లి, సుభాశ్ నగర్ , గాజుల రామారం, తార్నాక, సీతాఫల్ మండి, బన్సీలాల్ పేట డివిజన్ల మాత్రమే మూడో రౌండ్ వరకూ వెళ్లే అవకాశముంది.

ఇదీ చూడండి: లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ సజ్జనార్

Last Updated :Dec 4, 2020, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.