ETV Bharat / state

Ponds Shrinking: ఈ చెరువులను రక్షించే వారే లేరా..?

author img

By

Published : Oct 28, 2021, 9:03 AM IST

భాగ్యనగరం జలవనరులకు స్వర్గధామం.. ఇది ఒకప్పటి మాట. నగరం అభివృద్ధి చెందుతున్న క్రమంలో చెరువులు, కుంటలు ఆక్రమణల బారిన పడి చిక్కి శల్యమవుతున్నాయి. చెరువు శిఖం, బఫర్‌జోన్‌లో అక్రమ కట్టడాలు పుట్టుకొచ్చి విస్తీర్ణం తగ్గిపోయింది. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా చుట్టుపక్కల కాలనీలు మునుగుతున్నాయి. చెరువుల సుందరీకరణ పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. చుట్టుపక్కల కాలనీల మురుగునీరు తటాకాల్లో చేరి కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. మురుగు శుద్ధి చేయకుండా నేరుగా కలుపుతుండటంతో సమస్య ఉత్పన్నవుతోంది. నగరంలోని 185 చెరువుల్లో ప్రధాన తటాకాల పరిస్థితిపై ప్రత్యేక కథనం.

Ponds Shrinking
కుంచించుకుపోతున్న చెరువులు

మైసమ్మ కాపాడేదెవరమ్మా

మూసాపేట
  • ప్రాంతం: మూసాపేట
  • విస్తీర్ణం: 84.02 ఎకరాలు
  • ఆక్రమణలు: 9.38 ఎకరాలు
  • పరిస్థితి: ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ ఆక్రమణలకు గురైంది. ఏకంగా కాలనీయే ఏర్పాటైంది. మురుగు వచ్చి చేరుతోంది.
  • ఏం చేయాలి: చెరువు కట్టను బలోపేతం చేసి, చుట్టూ రక్షణ కంచె నిర్మించాలి. మురుగునీటిని శుద్ధి చేసి వదలాలి.

బండ్లగూడ బాధలివి

బండ్లగూడ
  • ప్రాంతం: బండ్లగూడ
  • విస్తీర్ణం: 36 ఎకరాలు
  • ఆక్రమణలు: 20 ఎకరాలు
  • పరిస్థితి: ఎఫ్‌టీఎల్‌లో ఏకంగా మూడు కాలనీలు వెలిశాయి. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా 300 ఇళ్లు మునిగిపోతున్నాయి. అయ్యప్పకాలనీ, మల్లికార్జున్‌నగర్‌ ఫేజ్‌-1, 2, త్యాగరాయనగర్‌కు ముప్పు ఏర్పడుతోంది.
  • ఏం చేయాలి: చెరువు కట్టను బలోపేతం చేయాలి. అలుగు పారేందుకు ప్రత్యేక కాల్వ తవ్వాలి. మురుగునీరు నేరుగా కలవకుండా ఎస్టీపీ నిర్మించాలి.

నల్ల తాచులు

ఉప్పల్‌
  • ప్రాంతం: ఉప్పల్‌
  • విస్తీర్ణం: 100 ఎకరాలు
  • ఆక్రమణలు: 40 ఎకరాలు
  • పరిస్థితి: ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ ఆక్రమణకు గురైంది. నాచారం చెరువు నుంచి వచ్చే నాలా కబ్జాకు గురైంది. సుందరీకరణ పేరిట కట్ట నిర్మించి చెరువుకు మరింత ఇబ్బందికరంగా మార్చారన్న ఆరోపణలున్నాయి.
  • ఏం చేయాలి: మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేశాకే చెరువులోకి వదలాలి. చెరువు ప్రాంతాన్ని కొంతమేర వదిలేసి కట్ట నిర్మించారు. కొత్తగా ఆక్రమణలు పుట్టుకురాకుండా ఆ ప్రాంతాన్ని పరిరక్షించాలి.

ఈస్ట్‌ఆనంద్‌బాగ్‌

ఈస్ట్‌ఆనంద్‌బాగ్‌
  • ప్రాంతం: ఈస్ట్‌ఆనంద్‌బాగ్‌
  • విస్తీర్ణం: 60 ఎకరాలు
  • ఆక్రమణలు: 40 ఎకరాలు
  • పరిస్థితి: మురుగు చేరి, దుర్వాసన వెలువడుతోంది. ఆక్రమణల వల్ల, దిగువున ఉన్న షిర్డీనగర్‌ తదితర ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి.
  • ఏం చేయాలి: ఎస్టీపీ నిర్మాణ ప్రతిపాదన పట్టాలెక్కించాలి. అలుగు పారేందుకు వీలుగా బాక్స్‌ డ్రెయిన్‌ నిర్మించాలి.

పల్లె సమస్య పట్నానికి

మైలార్‌దేవ్‌పల్లి
  • ప్రాంతం: మైలార్‌దేవ్‌పల్లి
  • విస్తీర్ణం: 39 ఎకరాలు
  • ఆక్రమణలు: 24 ఎకరాలు
  • పరిస్థితి: క్రిస్టల్‌ గార్డెన్‌ కాలనీ, బండ్లగూడ, అలీనగర్‌ ముంపు బారిన పడుతున్నాయి. కట్ట బలహీనంగా ఉంది. గతేడాది వరదనీరు ముంచెత్తి అలీనగర్‌కు చెందిన 9 మంది కొట్టుకుపోయారు.
  • ఏం చేయాలి: కట్టడాలు నిర్మించకుండా చర్యలు తీసుకోవాలి. కట్టను బలోపేతం చేయాలి.

సున్నం మిగిలింది

  • ప్రాంతం: అల్లాపూర్‌
  • విస్తీర్ణం: 24.12 ఎకరాలు
  • ఆక్రమణలు: 9.11 ఎకరాలు
  • పరిస్థితి: ఎఫ్‌టీఎల్‌లో 68 నివాసాలున్నాయి. వర్షాలొస్తే అల్లాపూర్‌లోని ఇళ్లు మునుగుతున్నాయి.
  • ఏం చేయాలి: చెరువు కట్టను పటిష్ఠం చేయాలి. గతంలో కొంతమేర వేసి వదిలేసిన రక్షణ కంచెను పూర్తి చేయాలి.

అప్పా.. అవస్థ తీరేదెప్పుడప్పా

గగన్‌పహాడ్‌
  • ప్రాంతం: గగన్‌పహాడ్‌
  • విస్తీర్ణం: 14 ఎకరాలు
  • ఆక్రమణలు: 10 ఎకరాలు
  • పరిస్థితి: చెరువులో లేఅవుట్‌ వేసి ఇళ్లు నిర్మించారు. గతేడాది చెరువు నీరు పొంగి బెంగళూరు జాతీయ రహదారిని ముంచెత్తింది. నలుగురు కొట్టుకుపోయి చనిపోయారు. రెండు వారాల కిందట చెరువుకు గండి పడి నీరు హైవేను ముంచెత్తింది.
  • ఏం చేయాలి: చెరువులో ఆక్రమణలు తొలగించాలి. అలుగు పారే నీరు హైవేపైకి రాకుండా భూగర్భ వరదకాల్వ తవ్వాలి.

చినరాయుని కష్టం

అల్వాల్‌
  • ప్రాంతం: అల్వాల్‌
  • విస్తీర్ణం : 17.25 ఎకరాలు
  • ఆక్రమణలు : 5 ఎకరాలు
  • పరిస్థితి: చెరువు నిండితే ఆనందరావునగర్‌, జానకీనగర్‌, జోషినగర్‌, దినకర్‌నగర్‌లో ముంపునకు గురవుతున్నాయి. మురుగు నేరుగా చెరువులో కలుస్తోంది.
  • ఏం చేయాలి: చెరువుకు అనుసంధాన నాలాలు పునరుద్ధరించాలి. బాక్స్‌ డ్రెయిన్లు నిర్మించాలి.

జల్‌పల్లి ఇబ్బంది మళ్లీ మళ్లీ

జల్‌పల్లి
  • ప్రాంతం: జల్‌పల్లి
  • విస్తీర్ణం: 299 ఎకరాలు
  • ఆక్రమణ: 100 ఎకరాలు
  • పరిస్థితి: చెరువు ఎఫ్‌టీఎల్‌లోనే 1800 వరకు అక్రమ కట్టడాలు పుట్టుకొచ్చాయి. నాలాను ఆక్రమించి నిర్మించడంతో నీరు పారడం లేదు. కాల్వలు కుంచించుకుపోయాయి.
  • ఏం చేయాలి: చెరువు కట్టను పటిష్ఠం చేయాలి. మురుగు చేరకుండా కట్టడి చేయాలి. నాలాలను పునరుద్ధరించాలి.

పేరుకే పెద్ద

రామంతాపూర్‌
  • ప్రాంతం: రామంతాపూర్‌
  • విస్తీర్ణం: 26 ఎకరాలు
  • ఆక్రమణ: 13 ఎకరాలు
  • పరిస్థితి: ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. రవీంద్రనగర్‌, సాయిచిత్రనగర్‌, లక్ష్మీనగర్‌కాలనీ, మహేశ్వరినగర్‌ కాలనీలకు ముంపు ఏర్పడుతోంది.
  • ఏం చేయాలి: పెద్దచెరువు నుంచి చిన్నచెరువుకు నీరు పారేలా కాల్వ నిర్మించాలి. నాలాలోని ఆక్రమణలను తొలగించాలి.

గ్రేటర్‌లో చెరువుల స్వరూపం

  • మొత్తం చెరువులు 185
  • సుందరీకరణకు ఎంపిక చేసినవి 127
  • కేటాయించిన నిధులు రూ.407.30 కోట్లు
  • ఇప్పటికే ఖర్చుచేసింది రూ.218కోట్లు
  • సుందరీకరణ పూర్తయినవి 48

ఇదీ చూడండి: Minister KTR on ponds: 'చెరువులను పరిరక్షిస్తాం... ఆక్రమణలు జరగనివ్వం'

చెరలో చెరువులు.. వరదలో ఆవాసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.