ETV Bharat / state

TDP leader Pattabhi arrest: తెదేపా నేత పట్టాభి అరెస్టు..

author img

By

Published : Oct 20, 2021, 9:21 PM IST

Updated : Oct 20, 2021, 10:42 PM IST

pattabi
pattabi

22:16 October 20

తెదేపా నేత పట్టాభి అరెస్టు..

21:20 October 20

తెదేపా నేత పట్టాభి అరెస్టు

నా భర్తకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి: పట్టాభి భార్య

 తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి పట్టాభి నివాసం వద్ద వేచి ఉన్న పోలీసులు రాత్రి 9గంటల సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి పట్టాభిని అరెస్టు చేశారు. కాలింగ్‌ బెల్‌కొట్టినా పట్టాభి తలుపు తీయలేదని అందుకే బలవంతంగా అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. 

ఏం జరిగినా సీఎం, డీజీపీదే బాధ్యత : పట్టాభి

 పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత తనకు ఏం జరిగినా సీఎం జగన్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌దే బాధ్యత అని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. అరెస్టుకు ముందు వీడియో సందేశం మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం తన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని వీడియో ద్వారా వెల్లడించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తెదేపా తరఫున పోరాడుతున్నందుకే తనపై కక్షగట్టి పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి, ఇంట్లోని ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం చేసిన నిందితులను పట్టుకోకుండా తనను అరెస్టు చేయడం ఏమేరకు సబబో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని పట్టాభి విజ్ఞప్తి చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేసి ఎంపీ రఘురామకృష్ణరాజుపై దాడి చేసిన విధంగా దాడి చేయాలని పోలీసులు చూస్తున్నారని, ఏం జరిగినా కోర్టులో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందని హెచ్చరించారు. న్యాయస్థానం, రాజ్యాంగంపై తనకు పూర్తి నమ్మకం ఉందని న్యాయబద్ధంగా తన పోరాటం కొనసాగుతుందని పట్టాభి స్పష్టం చేశారు.  

ప్రభుత్వానిదే బాధ్యత: పట్టాభి భార్య

'నా భర్తకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తలుపు పగులగొట్టి ఇంట్లోకి వచ్చి తీసుకెళ్లడం సరికాదు. నోటీసు ఇచ్చిన వెంటనే నా భర్తను అరెస్టు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీ అడిగితే తర్వాత ఇస్తామని చెప్పారు. నా భర్త ఆరోగ్యంగా ఉన్నారు.. అలాగే తిరిగి రావాలి. 120-బి సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామని చెప్పారు' - పట్టాభి భార్య

మంగళవారం సాయంత్రం వైకాపా మద్దతుదారులు పట్టాభి నివాసంపై దాడి చేసి వాహనాలు, ఇంట్లోని ఫర్నిచర్‌ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్‌పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైకాపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నిన్న తెదేపా కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. సీఎంపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని వైకాపా ఫిర్యాదు మేరకు విజయవాడ గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో పట్టాభిపై కేసు నమోదైంది. అరెస్టు అనంతరం పట్టాభిని గవర్నర్‌ పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు

ఇదీ చూడండి: చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష.. శనివారం అమిత్‌ షాతో భేటీ!

Last Updated :Oct 20, 2021, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.