ETV Bharat / state

కాంగ్రెస్ భిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారు: రేవంత్‌రెడ్డి

author img

By

Published : Oct 24, 2022, 7:39 PM IST

Revanthreddy letter to Congress Activists: కాంగ్రెస్ భిక్షతో ఎదిగిన వాళ్లే వెన్నుపోటు పొడిచారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని భాజపా, తెరాస కుట్ర చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణకు ప్రాణం పోసిన తల్లి సోనియమ్మకే ద్రోహం చేస్తుంటే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

Revanthreddy
Revanthreddy

Revanthreddy letter to Congress Activists: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ భిక్షతో ఎదిగిన వాళ్లే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. మునుగోడును కేవలం ఉఎన్నికగానే చూడలేం అన్న రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ను అంతం చేయాలని భాజపా, తెరాస కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. దుష్టశక్తులన్నీ ఏకమై కాంగ్రెస్‌ను ఒంటరి చేయాలనుకుంటున్నాయని అన్నారు. సీఆర్పీఎఫ్, ఎలక్షన్ కమిషన్‌లను భాజపా దుర్వినియోగం చేస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

తల్లి సోనియమ్మకే ద్రోహం చేస్తుంటే ఊరుకుందామా.. రాష్ట్ర పోలీసులు, అధికారులను తెరాస విచ్చలవిడిగా వాడుకుంటోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పవిత్రమైన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానాన్ని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడం దీనికి పరాకాష్ఠగా ఆయన అభివర్ణించారు. ఆడబిడ్డ అని చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు తెగబడ్డారన్నారు. కాంగ్రెస్‌ కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేష్ఠులుగా ఉందామా అని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రాణం పోసిన తల్లి సోనియమ్మకే ద్రోహం చేస్తుంటే ఊరుకుందామా అని రేవంత్ వ్యాఖ్యానించారు.

ప్రాణమో... ప్రజాస్వామ్యమో మునుగోడులో తేల్చుకుందాం.. 60 ఏళ్ల ఆకాంక్షను నిజం చేయడమే కాంగ్రెస్ చేసిన నేరమా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఈ కుట్రలు చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణ నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఉన్నపళంగా కదలి రావాలని... మునుగోడులో కలిసి కదం తొక్కుదామని పిలుపునిచ్చారు. కుల, మతాలకు అతీతంగా రాష్ట్ర నలుమూలల నుంచి మునుగోడుకు తరలిరావాలని అక్కడ ఎదురు చూస్తుంటానని పేర్కొన్నారు. ప్రాణమో... ప్రజాస్వామ్యమో మునుగోడులో తేల్చుకుందాం అని రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.