ETV Bharat / state

Metro Parking: వాహనం ఆపితే రూ.25 వసూలు.. మెట్రో నిలుపు దోపిడీ

author img

By

Published : Nov 1, 2021, 9:33 AM IST

కొంతకాలంగా మెట్రో పార్కింగ్‌ దోపిడీపై తరచూ ఫిర్యాదులు వస్తున్నా.. హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ(హెచ్‌ఎంఆర్‌) మాత్రం పట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజు మొత్తం నిలిపితే ఎంత వసూలు చేస్తారో గంట, రెండు గంటలకు కూడా అంతే వసూలు చేయడంపై వాహనదారులు మండిపడుతున్నారు.

Metro Parking
Metro Parking

మెట్రోరైలు స్టేషన్ల వద్ద పార్కింగ్‌ ఫీజులను అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. సౌకర్యాల పేరుతో సరికొత్త దందాకు తెరతీశారు. ద్విచక్రవాహనం నిలిపితే పార్కింగ్‌ ఫీజు రూ.25 వసూలు చేస్తున్నారు. శనివారం కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌ లాట్‌1 పార్కింగ్‌ వద్ద వాహనం ఆపగానే పాతిక రూపాయలు కట్టించుకున్నారు. గంటలో వస్తానన్నా కూడా ఇంతే ఛార్జీ అని దబాయించి మరీ వసూలు చేశారు అక్కడ ఉన్న ఆపరేటరు. రోజు మొత్తం నిలిపితే ఎంత వసూలు చేస్తారో గంట, రెండు గంటలకు కూడా అంతే వసూలు చేయడంపై వాహనదారులు మండిపడుతున్నారు. కొంతకాలంగా పార్కింగ్‌ దోపిడీపై తరచూ ఫిర్యాదులు వస్తున్నా.. హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ(హెచ్‌ఎంఆర్‌) మాత్రం పట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమంగా దండుకుంటున్నారు

ద్విచక్ర వాహనదారులకు 3 గంటల లోపు అయితే రూ.15, 3 నుంచి రోజంతా అయితే పాతిక రూపాయలు అని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. కానీ రూ.15 ఎక్కడా తీసుకోవడం లేదు. దబాయించి మరీ పాతిక రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రీపెయిడ్‌ కావడంతో ఐదు నిమిషాలు ఆపినా.. రెండు గంటలు ఆపినా తమకు సంబంధం లేదని ఏకంగా రూ.25 ముందే తీసుకుంటున్నారు ఆపరేటర్లు. మెట్రోలో కనీస ఛార్జీ రూ.10 ఉండగా.. పార్కింగ్‌ ఛార్జీ పాతికేంటని ప్రయాణికులకు, ఆపరేటర్లకు నిత్యం వాగ్వాదాలు జరుగుతున్నాయి. నిర్వాహకులను ప్రశ్నిస్తే ఆపరేటర్ల వద్ద కాకుండా యాప్‌ ద్వారా పార్కింగ్‌ బుకింగ్స్‌ను ప్రోత్సాహించేందుకు అని సమర్థించుకుంటున్నారు.

బోర్డులో ధరల కన్నా ఎక్కువ..

మెట్రో స్టేషన్ల వద్ద సరైన పార్కింగ్‌ సదుపాయాలు లేకపోవడంతో రహదారులపై బైకులు, కార్ల పార్కింగ్‌కు హెచ్‌ఎంఆర్‌ అభ్యర్థన మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలుత 24 స్టేషన్ల వద్ద పార్కింగ్‌ ఫీజు కూడా వసూలుకు అనుమతి ఇచ్చింది. వాహనదారుల నుంచి నామమాత్రపు ఫీజు వసూలు చేసి తాము పార్కింగ్‌ నిర్వహిస్తామని ‘పార్క్‌ హైదరాబాద్‌’ సంస్థ ముందుకొచ్చింది. ద్విచక్ర వాహనానికి కనీస ఛార్జీ రూ.5(రెండు గంటలకు), కార్లకు రూ.10(రెండు గంటలకు) ఛార్జీలు నిర్ణయించారు. దీనికి జీఎస్‌టీ అదనం. కానీ ఏ రోజు ఈ ధరలను అమలు చేయలేదు. ప్రారంభం నుంచే ద్విచక్ర వాహనాలకు కనీస ఛార్జీ రూ.10 వసూలు చేశారు. కొవిడ్‌ తర్వాత పార్కింగ్‌ కేంద్రాల్లోని బోర్డులపై పెంచిన రేట్లు దర్శనమిస్తున్నాయి. ఈ బోర్డులు కూడా అన్నిచోట్ల ఏర్పాటు చేయలేదు. తెలియక పార్క్‌ చేస్తే నిలుపు దోపిడీకి గురవుతున్నారు.

ఇదీ చూడండి: Technical Issue in Hyderabad Metro : మెట్రోరైల్ టిక్కెటింగ్​లో సాంకేతిక సమస్య

ఆ సాంకేతికతను మొదట తీసుకొచ్చింది హైదరాబాద్​ మెట్రో

మెరుగవుతున్న మెట్రోయానం.. పెరుగుతున్న ప్రయాణికుల శాతం

తొలిరోజు 120 ట్రిప్పుల్లో 19వేల మంది ప్రయాణం: మెట్రో ఎండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.