oysc ngo: సామాజిక సైనికులు... సేవే వారి పథం!!

author img

By

Published : Jun 10, 2021, 1:08 PM IST

yuva for society

సాటివారు సమస్యల్లో ఉంటే అయ్యోపాపం అని అందరంటారు. ఆ కష్టాల్ని నుంచి వారు బయటపడాలని కొందరు అనుకుంటారు. అండగా నిలిచి అవసరమైన సాయం చేసేవారు అరుదుగా ఉంటారు. ఆ కోవకు చెందిన యువతే... ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన అవర్‌ యూత్ సోషల్ కమ్యూనిటీ సంస్థ సభ్యులు. కొవిడ్ వల్ల ఉపాధికి దూరమైన కూలీలకు నిత్యావసర సరకులు, ఆరోగ్యం కాపాడే మాస్క్‌లు,శానిటైజర్లు అందిస్తూ...సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు.

సామాజిక సైనికులు... సేవే వారి పథం!!

సాయం చేయాలనుకోవటం సులువే. ఆ సేవా కార్యక్రమాల్ని సంపూర్ణంగా పూర్తి చేయటమే అతిపెద్ద సవాలు. చాలామంది కష్టాల్లో ఉన్న వారిని చూసి చలించి...వెంటనే సాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఆ సేవల్ని కొనసాగించే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఇతర కారణాలతో మధ్యలోనే వదిలేస్తుంటారు. విజయవాడ యువకుడు సోహన్‌ మాత్రం... సోదరుడి ఆశయం తన లక్ష్యంగా మార్చుకుని నిరుపేదలకు సాయం చేస్తున్నాడు.

ఓవైఎస్సీ ప్రస్థానం

అవర్ యూత్ సోషల్ కమ్యూనిటీ స్వచ్ఛంద సంస్థను పదేళ్ల కిందట సోహన్ సోదరుడైన రోహన్ ప్రారంభించాడు. అనారోగ్యంతో బాధపడే నిరుపేదలకు చేయూత అందించాడు. ఆపదలో ఉన్న అభాగ్యులకు సాయం చేశాడు. రోహన్‌ ఉన్నత విద్య కోసం దిల్లీ వెళ్లటంతో కార్యక్రమాలు నిలిచిపోయాయి. తోటి వారికి సహయం చేసే మంచి పనులు మధ్యలోనే ఆపటం సరికాదని భావించిన సోహన్‌... 2017 నుంచి తిరిగి ఓవైఎస్సీని నడిపిస్తున్నాడు.

తమవంతు సాయం

రెక్కాడితే కానీ డొక్కాడని ఆటోనగర్ కార్మికులు కరోనా కష్టకాలంలో పనుల్లేక పస్తులు ఉండటం గమనించిన ఓవైఎస్సీ సభ్యులు.. 15 రోజులకు సరిపడా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కర్ఫ్యూ సడలింపులు ఉన్నా.. పనులు లేక ఇబ్బందులు పడుతున్న రోజువారీ కూలీలకు ఆహారం సరఫరా చేస్తున్నారు. రహదారుల వెంట ఉండే నిరుపేదలు,నిరాశ్రయులకు తమవంతు సాయం చేస్తున్నారు.

సేవకై... సైన్యంలా

కరోనా వ్యాప్తి భయంతో ప్రయాణికులు చాలా మంది ఆటోలు ఎక్కేందుకు ముందుకు రావటం లేదు. దాంతో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఓవైఎస్సీ బృందం.. ఆటో మధ్యలో అడ్డుగా పెట్టే షీట్లను డ్రైవర్లు పంపిణీ చేస్తోంది. మాస్క్, శానిటైజర్లూ అందించి కరోనా సోకకుండా కనీస జాగ్రతలు పాటించాలని సూచిస్తోంది.

కొవిడ్‌ చికిత్స పొందుతున్న బాధితుల బంధువులు.. ఆసుపత్రి వద్ద ఆహారం లేక అవస్థలు పడటం చూసిన సోహన్‌..వాలంటీర్ల సాయంతో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిత్యం ఉచిత ఆహారం అందజేస్తున్నాడు. ఎంబీఏ, డిగ్రీలు చేసిన ఔత్సాహిక యువత.. ఓవైఎస్సీ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు నచ్చి.. స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

సామాజిక సైనికులు

సెకండ్ వేవ్‌ నగరాలు, పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉండటంతో ఓవైఎస్సీ సభ్యులు..గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విజయవాడ పరిసర గ్రామాలు పెదనందిపాడు, పాలపర్రు, పరిటాలవారి పాలెంలో ఉచితంగా శానిటైజర్లు, మాస్క్‌లు పంపిణీ చేశారు.కొవిడ్ సేవలతో పాటు భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న ఈ బృందం... సురక్ష పేరుతో మహిళలకు శానిటరీ రుమాలు అందించే ప్రాజెక్ట్‌కు అన్ని ఏర్పాటు చేస్తోంది.

విపత్కర పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న వారికి తోటి మనిషి కచ్చితంగా అండగా ఉంటాడనే విషయం తమ సేవా కార్యక్రమాలతో చాటుతున్న ఈ యువ బృందం.. దాతల సహకారంతో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.

ఇదీ చదవండి: Sonu Sood: 'దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.