ETV Bharat / state

ఆలన కరవై.. ఆక్రమణకు నెలవై!

author img

By

Published : Apr 1, 2021, 6:58 AM IST

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో విస్తరించిన భాగ్యనగరం ఒకప్పుడు 3 వేలకు పైగా చెరువులతో భాసిల్లింది. ప్రభుత్వ అధికారుల ఆలన కరవవడంతో వందల సంఖ్యలోనే మిగిలాయి. వెయ్యి ఎకరాలకు పైగా చెరువుల స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. కొన్ని చోట్ల పూర్తిగా కనుమరుగు కాగా, మరికొన్ని చోట్ల గర్భాలు ఆక్రమణ చెరలో ఉన్నాయి. ఎఫ్‌టీఎల్‌ భూముల్లో వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. మిగిలిన వాటిల్లో మూడొంతులు కాలుష్య కాసారాలుగా మారి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నట్లు ఇటీవల కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

occupied-a-thousand-acres-of-pond-lands-in-hyderabad
ఆలన కరవై.. ఆక్రమణకు నెలవై!

భాగ్యనగరంలో 2010 నాటికి 3132 చెరువులున్నట్లు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ గుర్తించాయి. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కేవలం 185 జలాశయాలే ప్రస్తుతం మిగిలాయి. దాదాపు 600 ఆక్రమణలో ఉండటమో పూర్తిగా కనుమరుగవడమో జరిగిందని అధికారులు చెబుతున్నారు. గుర్తించిన చెరువులను నీటిపారుదల శాఖతో కలిసి అభివృద్ధి చేశాయా అంటే అదీ లేదు. హెచ్‌ఎండీఏ పరిధిలో అన్ని చెరువుల ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించాలని పదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు నిర్ధారించినవి 500 లోపే ఉన్నాయి.

హైకోర్టు ఆదేశాలు బేఖాతరు

2010లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ తరవాత 18 మంది సభ్యులతో కూడిన చెరువుల పరిరక్షణ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ సమావేశమై ఆక్రమణలు తొలగించడంతోపాటు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు కమిటీ 30 సార్లు సమావేశం కాలేదని కాగ్‌ ఆక్షేపించింది.

నివేదికకు రూ.కోట్లు.. అందక పాట్లు

చెరువుల అభివృద్ధి ప్రణాళిక తయారు చేసేందుకు ఓ సంస్థకు హెచ్‌ఎండీఏ రూ.12.62 కోట్లు చెల్లించింది. ఇప్పటికీ ఆ సంస్థ పూర్తి నివేదిక ఇవ్వలేదు.

వేలల్లో చెరువులు.. పదుల్లో సిబ్బంది

వేలల్లో చెరువులంటే హెచ్‌ఎండీఏ వద్ద 20 మంది పరిరక్షణ సిబ్బంది లేకపోవడం గమనార్హం.

ఎఫ్‌టీఎల్‌లోనూ అనుమతులు

రాజధానిలోని చెరువుల ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు గత కొన్నేళ్లుగా అనుమతులు ఇచ్చారు. ఇప్పుడేం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. గొలుసుకట్టు చెరువుల కాల్వల భూములన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. వరద నీరు వెళ్లేదారి లేక కాలనీలు మునుగుతున్నాయి.

కాలుష్యమయం.. రోగాల భయం

దాదాపు 2 వేల జలాశయాలు కాలుష్యకాసారాలుగా మారాయి. కొన్నింటిని అభివృద్ధి చేస్తామని కార్పొరేట్‌ సంస్థలు ముందుకొచ్చినా హెచ్‌ఎండీఏ వినియోగించుకోకుండా తాత్సారం చేసింది.

నగర నడిబొడ్డునే...

* పూర్వం గోల్కొండ కోటకు నీటిని సరఫరా చేసిన దుర్గం చెరువు 156.16 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సి ఉండగా, కనీసం 50 హెక్టార్లులోనూ లేదని అధికారులే చెబుతున్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 31.16 ఎకరాల్లో వాణిజ్యపరమైన నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్లు రెవెన్యూ శాఖ 2016లోనే పేర్కొంది.
* అమీన్‌పూర్‌ చెరువును జీవవైవిధ్య వారసత్వ ప్రాంతంగా సర్కారు ప్రకటించింది. ఆక్రమణలను తొలగించి, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాల్సి ఉండగా హెచ్‌ఎండీఏ ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

ఇదీ చూడండి: రాష్ట్రానికి 12 జాతీయ పంచాయతీరాజ్​ అవార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.