ETV Bharat / state

NTR centenary celebrations : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

author img

By

Published : May 28, 2023, 9:37 PM IST

ntr
ntr

NTR centenary celebrations : తెలుగు చరిత్రలో తనదైన శకాన్ని లిఖించుకున్న ఘనుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలువురు రాజకీయవేత్తలు, ప్రముఖులు, నటులు ఆయనను స్మరించుకున్నారు. రాజకీయంలోనూ, నటనాపరంగానూ తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహనీయుడంటూ గుర్తుచేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

NTR Centenary Celebrations in Telangana : శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్​కి చేరుకున్న బాలయ్య.. ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం సుమారు ఆరున్నర గంటలకి ఘాట్​కి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఘాట్‌ వద్ద పుష్పాంజలి ఘటించి కొద్ది సేపు కూర్చున్నారు.

నందమూరి రామకృష్ణ, తారకరత్న కుటుంబ సభ్యులు , దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులు ఎన్టీఆర్​కి నివాళులు అర్పించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనుడని కొనియాడారు. ప్రజాసేవకోసం పదవిని స్వీకరించిన మహనీయుడు ఎన్టీఆర్ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. 'ఎన్టీఆర్ శత జయంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ఆయన సినిమాల్లోనే కాదు.. రాజకీయ రంగంలోనూ అగ్రగామిగా వెలుగొందారు. ఆయన కుమారుడిగా జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని బాలకృష్ణ అన్నారు.

రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్టీఆర్‌కి పుష్పాంజలి ఘటించి ఆయనను స్మరించుకున్నారు. నటుడు రాజేంద్రప్రసాద్ సైతం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు సమర్పించారు. ఎన్టీఆర్ గొప్ప నాయకుడు, రాజకీయ వేత్త, కళాపోషకుడంటూ కొనియాడారు. నిర్మల్ జిల్లాలో రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు.

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా.. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వినమ్ర నివాళులు తెలియజేశారు. తెలుగు జాతి కీర్తిని ఉన్నత స్థితిలో నిలబెట్టిన మహనీయుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు అని మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు కొనియాడారు. మళ్లీ ఎన్టీఆర్ జన్మించి ఈ తెలుగు గడ్డపై తన పరిపాలన కొనసాగించాలని కోరుకున్నారు.

అభివృద్ధి జోడెద్దుల్లా ముందుకు సాగింది : ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన పాలనలో అభివృద్ధి జోడెద్దుల్లా ముందుకు సాగిందని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌ అండ్ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చికిత్స పొందుతున్న పేద రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా హుజుర్​నగర్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా చౌదరి యూత్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో యువత భారీగా ఆసక్తితో పాల్గొన్నారు.

"తెలుగు జాతి కీర్తిని ఉన్నత స్థితిలో నిలబెట్టిన మహనీయుడు. తెలుగు జాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ శత జయంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ఆయన సినిమాల్లోనే కాదు.. రాజకీయ రంగంలోనూ అగ్రగామిగా వెలుగొందారు. ఆయన కుమారుడిగా జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నా". - బాలకృష్ణ, ఎన్టీఆర్ కుమారుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.