Telangana High Court: హైకోర్టు నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం

author img

By

Published : Oct 15, 2021, 11:41 AM IST

Telangana High Court

తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు నియమితులైన ఏడుగురు కొత్త జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబరు 16వ తేదీన కొలీజియం పంపిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (President Ramnath Kovind) ఆమోదం తెలిడంతో... జస్టిస్ పి.శ్రీసుధ, జస్టిస్ సి.సుమలత, జస్టిస్ డాక్టర్‌ జి.రాధా రాణి, జస్టిస్ ఎం.లక్ష్మణ్‌, జస్టిస్ ఎన్‌.తుకారాంజీ, జస్టిస్ ఎ.వెంకటేశ్వరరెడ్డి, జస్టిస్ పి.మాధవి దేవి హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు.

సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు కొత్త న్యాయమూర్తులుగా జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ నుంచి ఏడుగురు పేర్లను సెప్టెంబరు 16న సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ చొరవ చూపి గత జూన్‌లో కోర్టు (Telangana High Court)లోని న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇక్కడున్న ఖాళీల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త నియామకాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నేడు కొత్తగా ఏడుగురు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) న్యాయమూర్తుల సంఖ్య 18కి పెరిగింది. హైకోర్టు చరిత్రలో ఒకేసారి ఏడుగురు.. అందులో నలుగురు మహిళలు ప్రమాణం చేయడం ఇదే మొదటిసారి. హైకోర్టు (Telangana High Court) మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

Telangana High Court
తెలంగాణ హైకోర్టు

నూతన న్యాయమూర్తుల ప్రస్థానమిది...

జస్టిస్ పి.శ్రీసుధ : 1962 జూన్‌ 6న ఏపీలోని నెల్లూరులో జన్మించారు. 1992లో న్యాయవాదిగా నమోదై 2002 ఆగస్టు 21న జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. నిజామాబాద్‌, హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, కరీంనగర్‌, విశాఖపట్నం, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, జ్యుడిషియల్‌ అకాడమి డైరెక్టర్‌గా, వ్యాట్‌ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌గా విధులు నిర్వహించారు.

జస్టిస్ సి.సుమలత : 1972 ఫిబ్రవరి 5న ఏపీలోని నెల్లూరులో జన్మించారు. 1995లో పద్మావతి మహిళా యూనివర్సిటీ (తిరుపతి) నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. రైట్‌ టు టైమ్‌లీ జస్టిస్‌ అనే అంశంపై నాగార్జున యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. జిల్లా జడ్జిగా 2007లో ఎంపికై కర్నూలు, మదనపల్లె, అనంతపురం, గుంటూరుల్లో పనిచేశారు. జ్యుడిషియల్‌ అకాడమి డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా చేసి.. నేడు హైకోర్టులో బాధ్యతలు చేపట్టారు.

జస్టిస్ డాక్టర్‌ గురిజాల రాధారాణి : 1963 జూన్‌ 29 ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. 1989లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా, ఏపీపీగా విధులు నిర్వహించారు. 2008లో జిల్లా జడ్జిగా నియమితులై సంగారెడ్డి, నల్గొండ, సికింద్రాబాద్‌ ఫ్యామిలీ కోర్టు, నాంపల్లి కోర్టుల్లో పనిచేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జిగా విధులు నిర్వహించారు.

జస్టిస్ ఎం.లక్ష్మణ్‌ : 1965 డిసెంబరు 24న వికారాబాద్‌ జిల్లా వేల్చల్‌ గ్రామంలో జన్మించారు. 1991లో న్యాయవాదిగా నమోదయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి కోర్టులతో పాటు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. జిల్లా జడ్జిగా ఎంపికై మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, నాంపల్లిలోని ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టు, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో పనిచేశారు. కార్మిక న్యాయస్థానం కోర్టులో విధులు నిర్వహించారు.

జస్టిస్ ఎన్‌.తుకారాంజీ : 1973 ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో జన్మించారు. 1996లో న్యాయవాదిగా నమోదయ్యారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కోర్టులతో పాటు పలు ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 2007 జిల్లా జడ్జిగా ఎంపికై విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలలో పనిచేశారు. నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తిగా చేశారు.

జస్టిస్ ఎ.వెంకటేశ్వరరెడ్డి : 1961 ఏప్రిల్‌ 15న మహబూబ్‌నగర్‌ జిల్లాలో జన్మించారు. గుల్బర్గా యూనివర్సిటీ నుంచి 1986లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది 1987లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 1994 జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై 2005లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లా జడ్జిగా, సీఐడీ సలహాదారుగా, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా విధులు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు మొదటి రిజిస్ట్రార్‌ జనరల్‌గా విధులు చేపట్టి అందులోనే కొనసాగారు.

జస్టిస్ పి.మాధవిదేవి : 1965 డిసెంబరు 28న హైదరాబాద్‌లో జన్మించారు. గుల్బర్గాలో ఎల్‌ఎల్‌బీ.. ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. హైకోర్టులో ప్రాక్టీస్‌ చేపట్టారు. 2005లో ఇన్‌కంట్యాక్స్‌ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌ జ్యుడిషియల్‌ సభ్యులుగా సర్వీసులో చేరారు. ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లో విధులు నిర్వహించారు.

ఇదీ చూడండి: Telangana High Court: పెళ్లైతే చదువుకు దూరం కావాలా.. ఆ వృత్తులే ఎందుకు ఎన్నుకోవాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.